Share News

BC Reservation: 23న టీపీసీసీ పీఏసీ భేటీ

ABN , Publish Date - Aug 18 , 2025 | 04:29 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం వీలున్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఈ నెల 23న సమావేశం కానుంది.

BC Reservation: 23న టీపీసీసీ పీఏసీ భేటీ

మహేశ్‌గౌడ్‌, పొన్నంతో సీఎం రేవంత్‌ సమావేశంలో నిర్ణయం

  • స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై పీఏసీలో చర్చ

  • 42%పై పార్టీ పరంగా భేటీలో తీర్మానం

  • ఆ తర్వాత ప్రభుత్వ పరంగా ముందుకు

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం వీలున్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఈ నెల 23న సమావేశం కానుంది. గాంధీభవన్‌లో జరగనున్న ఈ భేటీలో ప్రధానంగా ఈ అంశంపైనే చర్చించి.. పార్టీ పరంగా నిర్ణయానికి రానున్నారు. అనంతరం దానికి అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గంలో సమీక్షించి.. ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకోనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు, పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్సు రెండూ కేంద్ర ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే నెలలు గడుస్తున్నా వీటిపై కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో అసెంబ్లీలో తీర్మానం ద్వారా జీవో తీసుకువస్తే ఎలా ఉంటుందన్నదానిపై న్యాయ నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సమీక్షిస్తున్నారు. లేదా స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ప్రకటించి ముందుకు వెళ్లాలన్న అంశంపైనా పరిశీలన జరుగుతోంది. ఈ అంశాలపై చర్చించేందుకు పీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ భేటీలో నిర్ణయించారు.


అయితే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ భేటీ వాయిదా పడుతూ వచ్చింది. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం మహేశ్‌గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోపాటు సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపైనా పీఏసీ భేటీలో చర్చించనున్నారు. అనంతరం ఒకటి, రెండు రోజుల తరువాత బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై క్యాబినెట్‌ భేటీ జరగనుంది. పీఏసీలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా.. బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్‌ ఒక నిర్ణయానికి రానుంది. ఇదిలా ఉండగా ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు కూడా సమావేశమయ్యారు. ఈ నెల 22న శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ

బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ

Updated Date - Aug 18 , 2025 | 04:29 AM