Share News

Nagaram Land Dispute: నాగారం భూములపై విచారణ జరపబోం

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:44 AM

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూములపై విచారణ కమిషన్‌ వేసే ఉద్దేశం తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

Nagaram Land Dispute: నాగారం భూములపై విచారణ జరపబోం

  • అది ప్రైవేటు వ్యవహారం: ప్రభుత్వం

  • భూదాన్‌ భూముల లెక్కలు తేల్చండి: ధర్మాసనం

  • భూదాన్‌ భూములనడం సరికాదు:ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు

హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూములపై విచారణ కమిషన్‌ వేసే ఉద్దేశం తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇది వ్యక్తిగత భూవివాదమని అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. నాగారంలో సర్వే నంబర్‌ 181, 182, 194, 195లలో ఉన్న భూదాన్‌ భూములను ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు స్థానిక రెవెన్యూ అధికారుల సహాయంతో రికార్డులు మార్చి అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఆరోపిస్తూ బిర్ల మల్లేశ్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే భూములపై నాగారంలోని వడిత్య రాములు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. భూదాన్‌బోర్డు తరఫు న్యాయవాది కిరణ్‌కుమార్‌ వాదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 1.40 లక్షల ఎకరాలు దాతలు భూదానం చేశారని, అందులో 40 వేల ఎకరాలు ప్రభుత్వం పేదలకు పంచిందని తెలిపారు. పంచిన భూముల్లో అధికశాతం ఇతరుల చేతుల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు.


ధర్మాసనం జోక్యం చేసుకుంటూ మంచి ఉద్దేశంతో చేసిన భూదానం అనర్హులకు వెళ్లడం భూదాన్‌ స్ఫూర్తిని విస్మరించడం కిందికే వస్తుందని వ్యాఖ్యానించింది. నాగారం భూములపై పూర్తి వివరాలతో రావాలని బోర్డుకు ఽసూచించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రజనీకాంత్‌రెడ్డి ఈ వివాదం ప్రయివేటు అంశం కావడంతో దాంట్లో జోక్యం చేసుకోబోమని తెలిపారు. ప్రస్తుత పిటిషన్‌ వేయడానికి బిర్ల మల్లేశ్‌కు ఉన్న అర్హత ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. మల్లేశ్‌ సమాధానాలు చెప్పకపోవడంపై అసహనం వ్యక్తంచేసింది. పలువురు ఐఏఎస్‌, ఐపీఎ్‌సల తరఫున సీనియర్‌ న్యాయవాదులు శ్రీరఘురాం, చంద్రసేన్‌రెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తూ.. సర్వే నెంబరు 194లో భూదాన్‌ భూమే లేదన్నారు. అది గైరాన్‌ (ప్రభుత్వ) భూమి మాత్రమే అని పిటిషనరే చెబుతున్నప్పుడు దానిని భూదాన్‌ భూమి అని అనరాదని పేర్కొన్నారు. భూదాన్‌ భూముల పేరుతో విచారణ చేయవద్దని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 04:44 AM