ఇసుక అక్రమ రవాణాపై హైడ్రా యాక్షన్
ABN , Publish Date - Feb 15 , 2025 | 03:57 AM
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో హైడ్రా రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచే ఇసుక లారీల తనిఖీని మొదలుపెట్టింది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో లారీల తనిఖీలు
టీజీఎండీసీ సహకారంతో ఆన్‌లైన్‌లో ఈ-ట్రాన్సిట్ పాస్‌ల పరిశీలన
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో హైడ్రా రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచే ఇసుక లారీల తనిఖీని మొదలుపెట్టింది. హయత్‌నగర్, హస్తినాపురం, ఘట్‌కేసర్, శామిర్‌పేట ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో ఈ తనిఖీలు జరిగాయి. లారీ డ్రైవర్లు చూపించే పత్రాలు(మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఇచ్చే ఈ- ట్రాన్సిట్ పాస్)తనిఖీతో సరిపెట్టకుండా ఆన్‌లైన్‌లోనూ ఆయా రికార్డుల పరిశీలనపై దృష్టి పెట్టింది. ఇసుక సక్రమంగా తరలిస్తున్నారా ? అక్రమంగా తరలిస్తున్నారా ? అనేది కచ్చితంగా కనిపెడుతోంది. నిజానికి, గురువారం డ్రైవర్లు చూపించిన కాగితాలను మాత్రమే హైడ్రా సిబ్బంది తనిఖీ చేశారు.
అయితే, నకిలీ ఈ-ట్రాన్సిట్ పాస్‌ల వినియోగంపై ఉన్న ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా.. మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(టీజీఎండీసీ) సహకారం తీసుకుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి మేరకు.. హైడ్రా సిబ్బందికి టీజీఎండీసీ లాగిన్‌ను హైడ్రాకు ఇచ్చింది. దీంతో డ్రైవర్లు చూపించే ఈ-ట్రాన్సిట్ పాస్‌లను శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లోనూ తనిఖీ చేయడం మొదలుపెట్టారు. మరోపక్క, పాస్ తీసుకున్న లారీ నెంబర్‌ను ఇతర వాహనాలకు వినియోగిస్తున్నట్టు గతంలో ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో వాహనాల వివరాలు పరిశీలనపైనా హైడ్రా దృష్టి పెట్టింది. ఈ విషయంలో రవాణా శాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. రవాణా శాఖ కూడా ముందుకొస్తే.. వాహనం నెంబర్, చాసిస్ నెంబర్(ఇంజన్)తో పాస్ తీసుకున్న వాహనంలోనే ఇసుకను తరలిస్తున్నారా ? లేదా ? అనేది ఆన్‌లైన్ రికార్డులను పరిశీలించి గుర్తించనున్నారు. ఇదికాక, వే బ్రిడ్జిల వద్ద తూకం వేయించి పరిమితి ప్రకారమే ఇసుకను తరలిస్తున్నారా ? అనేది కూడా తనిఖీ చేస్తున్నారు.