Share News

Engineering Fees: ఇంజనీరింగ్‌, ఫార్మసీలో.. ఈ ఏడాదీ పాత ఫీజులే!

ABN , Publish Date - Jun 26 , 2025 | 03:46 AM

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఇతర వృత్తివిద్య కోర్సులకు పాత ఫీజులే కొనసాగనున్నాయి. ఈ ఏడాది ఫీజులను పెంచకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.

Engineering Fees: ఇంజనీరింగ్‌, ఫార్మసీలో.. ఈ ఏడాదీ పాత ఫీజులే!

న్యాయసలహా మేరకు ప్రభుత్వ నిర్ణయం

  • వచ్చే ఏడాది కాలేజీల ఆదాయ వ్యయాలను సమగ్రంగా పరిశీలించాకే పెంపునకు అనుమతి

  • నేడు ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

  • మధ్యాహ్న భోజన పథకంలో సోలార్‌ కిచెన్లు

  • ఇంటర్‌లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి

  • అదనపు కలెక్టర్లు వారానికి రెండు ప్రభుత్వ పాఠశాలలు సందర్శించాలి

  • అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశం

  • గోదావరి పుష్కర ఏర్పాట్లపై నేడు సమీక్ష

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఇతర వృత్తివిద్య కోర్సులకు పాత ఫీజులే కొనసాగనున్నాయి. ఈ ఏడాది ఫీజులను పెంచకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. వాస్తవానికి మూడేళ్లకోసారి వృత్తి విద్య కోర్సుల ఫీజులను సవరించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రస్తుత (2025-26) విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రావాలి. దీనిపై కాలేజీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన ‘తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ మండలి (టీఏఎ్‌ఫఆర్సీ) ప్రభుత్వానికి సిఫార్సులు కూడా అందజేసింది. హైదరాబాద్‌లోని అనేక ఇంజనీరింగ్‌ కాలేజీలు భారీగా ఫీజులు పెంచాలంటూ ప్రతిపాదనలు సమర్పించాయి. ఇప్పటికే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో వార్షికంగా గరిష్ఠ ఫీజు రూ.1.62 లక్షల వరకు ఉండగా.. తాజా ప్రతిపాదనల్లో ఇది రూ.2.20 లక్షలకు చేరింది. రూ.లక్ష ఫీజున్న కొన్ని కాలేజీలు దాదాపు రెట్టింపు కోరాయి. ఇలా కాలేజీలు చూపిన ఆదాయ, వ్యయాల మేరకు ప్రభుత్వానికి సిఫార్సు పంపడం తప్ప.. కాలేజీల దరఖాస్తుల్లో వాస్తవాలను నిర్ధారించుకునే అధికారం టీఏఎ్‌ఫఆర్సీకి లేదు. ఈ ఫీజు ప్రతిపాదనలపై గతంలోనే సమీక్షించిన ముఖ్యమంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న ఫీజులే విద్యార్థులకు భారంగా ఉన్నందున మరింతగా పెంచలేమని స్పష్టం చేశారు. ఏడాది ఆలస్యమైనా సరే.. కాలేజీల ఆదాయ, వ్యయాలను క్షుణ్ణంగా పరిశీలించాకే ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఫీజులు పెంచకుండా ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తే కాలేజీల యాజమాన్యాలు కోర్టులను ఆశ్రయించవచ్చని ఉన్నతాధికారులు బుధవారం సీఎం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ప్రస్తావించారు. దీనితో న్యాయసలహా తీసుకుని ముందుకెళ్లాలని సీఎం సూచించారు.


సీఎం సూచన మేరకు సమీక్ష అనంతరం విద్యాశాఖ ఉన్నతాధికారి హైకోర్టుకు వెళ్లి అడ్వొకేట్‌ జనరల్‌తో చర్చించారు. పలు ఇంజనీరింగ్‌ కాలేజీలు సీఎ్‌సఈ సీట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించకపోవడంపై హైకోర్టును ఆశ్రయించగా.. ఆ నిర్ణయాధికారం ప్రభుత్వానిదేనని కోర్టు స్పష్టం చేసిన అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు ఫీజుల పెంపు వాయిదాపైనా ప్రభుత్వానికి అధికారం ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొన్నట్టు సమాచారం. అధికారులు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో.. ఈ ఏడాది పాత ఫీజులనే కొనసాగించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మొత్తానికి ఫీజుల పెంపుపై ఓ స్పష్టత రావడంతో.. గురువారమే ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 27 లేదా 28 నుంచి కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నారు.


‘మధ్యాహ్న భోజనం’లో సోలార్‌ కిచెన్లు

మధ్యాహ్న భోజన పథకంలో కట్టెల పొయ్యిలకు స్వస్తి పలికి, సోలార్‌ కిచెన్ల ఏర్పాటుపై తక్షణమే దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం సీఎం విద్యా శాఖ, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో విడివిడిగా సమీక్షించారు. ఈ ఏడాది బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో 48వేల మంది విద్యార్థులు కొత్తగా చేరారని విద్యాశాఖ అధికారులు వివరించగా.. విద్యార్థుల సంఖ్య పెరిగిన చోట అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇక పదో తరగతి ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్మీడియట్‌లో చేరుతున్న వారి సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంపై అధికారులను సీఎం ప్రశ్నించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా కచ్చితంగా ఇంటర్‌లో చేరేలా చూడాలని.. ఇంటర్‌ తర్వాత వృత్తి కోర్సుల్లో శిక్షణ పొందితే, ఉపాధికి ఢోకా ఉండదని చెప్పారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. ఇక పెరుగుతున్న జనాభా, వచ్చే పాతికేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల కోర్‌ అర్బన్‌ రీజియన్‌ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని పురపాలక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, వర్షాకాలం వచ్చినందున డెంగ్యూ, చికున్‌ గున్యా వంటి సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


గోదావరి పుష్కర ఏర్పాట్లపై నేడు సమీక్ష

2027లో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వివిధ అంశాలపై ఆయా విభాగాల ఉన్నతాధికారులతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. దేవాదాయశాఖ, ఇతర విభాగాల అధికారుల బృందం ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాను సందర్శించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దాని ఆధారంగా గోదావరి పుష్కరాల్లో ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. 2015 నాటి గోదావరి పుష్కరాల్లో రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించగా.. ఈసారి 10 కోట్ల మంది వరకు వస్తారని అంచనా. ఈ మేరకు పుష్కరాల ఏర్పాట్ల కోసం కేంద్రం నుంచి రూ.100 కోట్ల ఆర్థిక సహాయం కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర నిధులతోపాటు మహాకుంభ మేళా కోసం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) కింద వివిధ సంస్థల నుంచి నిధులు సమీకరించిన తరహాలో ఇక్కడా నిధులు సమీకరించే అవకాశం ఉంది.


తెలంగాణ రైజింగ్‌ విజన్‌ లక్ష్యాలు ఆకట్టుకున్నాయి

డాక్యుమెంట్‌ ఆవిష్కరణకై ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. సీఎం రేవంత్‌రెడ్డికి టోనీ బ్లెయిర్‌ లేఖ

తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 నిర్దేశిత లక్ష్యాలు తననెంతో ఆకట్టుకున్నాయని ఇంగ్లండ్‌ మాజీ ప్రధాని- టోనీ బ్లెయిర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ చేంజ్‌ (టీబీఐజీసీ) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ టోనీ బ్లెయిర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌ -2047 అమలులో తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామని బుధవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖలో తెలిపారు. ఆ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించిన సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశంసించడంతోపాటు ఆయన్ను టోనీ బ్లెయిర్‌ అభినందించారు. దీని లక్ష్యాల సాధనకు భారత్‌లోని టీబీఐజీసీ ప్రతినిధులు సహకరిస్తారని.. డాక్యుమెంట్‌పై సందేహాలున్నా, సంకోచాలున్నా వాటిని నివృత్తి చేసుకోవడానికి భారత్‌లోని టీబీఐజీసీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారులు సంప్రదించవచ్చునని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు సీఎం రేవంత్‌.. టోనీ బ్లెయిర్‌తో సమావేశమై తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 డాక్యుమెంట్‌ను ఆయనకు వివరించారు. 3 ట్రిలియన్‌ ఎకానమీ, వివిధ రంగాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు రైతులు, మహిళలు, యువత సాధికారత, ఐటీ సహా ఇతర రంగాల అభివృద్ధి లక్ష్యాల సాధన మార్గాలను ఆయనకు సీఎం రేవంత్‌ వివరించారు. అనంతరం టోనీ బ్లెయిర్‌, సీఎం రేవంత్‌ సమక్షంలో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ రూపకల్పన, దాని అమలుకు టీబీఐజీసీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ మార్చుకున్నారు.


రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌

  • బోనాల శుభాకాంక్షలు

  • ఉత్సవాల నిర్వహణకు రూ.20 కోట్లు విడుదల

ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని సీఎం ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి..

రెక్కలు మీవి, ఎగరడానికి పర్మిషన్ అడక్కండి.. ఖర్గే వ్యాఖ్యలపై శశిథరూర్

సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు

For National News And Telugu News

Updated Date - Jun 26 , 2025 | 03:47 AM