CM Revanth Reddy: 20 లక్షల ఇళ్లు ఇవ్వండి
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:54 AM
ప్రధానమంత్రి ఆవాస యోజన (అర్బన్) 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

పీఎంఏవై కింద తెలంగాణకు మంజూరు చేయండి
మూసీకి 10 వేల కోట్లు, జీహెచ్‌ఎంసీకి 55 వేల కోట్లివ్వండి
మెట్రో రైల్ ఫేజ్-1ను జాయింట్ వెంచర్‌గా చేపట్టండి
విద్యుత్తు సంస్థల రుణాలకు వడ్డీ రేట్లను తగ్గించండి
పట్టణ ప్రగతికి తోడ్పడండి.. ఖట్టర్‌కు సీఎం రేవంత్‌వినతి
పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖలపై కేంద్ర మంత్రి సమీక్ష
దావోస్ ఒప్పందాలపై సీఎంను అభినందించిన ఖట్టర్
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాస యోజన (అర్బన్) 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు పలు ప్రాజెక్టుల నిర్మాణాల కోసం నిధులు కేటాయించి, మంజూరు చేయాలని కోరారు. శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పీఎంఏవై-అర్బన్ పథకంతోపాటు పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హాజరైన సీఎం రేవంత్ మాట్లాడుతూ.. దేశ పట్టణ జనాభాలో 8 శాతం ప్రజలు తెలంగాణలో ఉన్నారని తెలిపారు. పీఎంఏవై 2.0లో చేరిన తొలి రాష్ట్రమైన తెలంగాణ.. ఇళ్ల నిర్మాణానికి సమగ్రమైన వివరాలు, పూర్తి ప్రణాళికతో సన్నద్ధంగా ఉందని చెప్పారు. దేశంలోని మహానగరాలైన ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో మెట్రో కనెక్టివిటీ తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో మెట్రో ఫేజ్-1 కింద ఆరు కారిడార్లను గుర్తించామని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో మొదటి ఐదు కారిడార్లకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని, ఈ డీపీఆర్‌లను ఆమోదించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యం (జాయింట్ వెంచర్) కింద వీటిని చేపట్టి నిధులు కేటాయించాలని సీఎం కోరారు.
పట్టణాల అభివృద్ధికి సహకరించండి..
గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పురపాలిక ల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని కేంద్రమంత్రి ఖట్టర్‌ను సీఎం రేవంత్ కోరారు. హైదరాబాద్‌లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు రూ.55,652 కోట్ల ఆర్థికసాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 65ు భూభాగం పట్టణ పరిధిలోనే ఉందని తెలిపారు. రాష్ట్రాన్ని రూ.లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టి న ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రికి వివరించారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవల్‌పమెంట్‌కు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. మూసీలోకి మురుగు చేరకుండా నదికి ఇరువైపులా 55 కిలోమీటర్ల (మొత్తం గా 110 కి.మీ.) కాలువలు, బాక్స్ డ్రెయిన్లు, ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నామని, వీటికి రూ.10 వేల కోట్ల నిధులు ఇవ్వాలన్నారు. హైదరాబాద్ నగరంతోపాటు సమీపంలోని 27 పురపాలక సంస్థల పరిధి లో మురుగునీటి నెట్‌వర్క్ నిర్మాణానికి రూ.17,212 కోట్లతో సమగ్ర మురుగునీటి మేజర్ ప్లాన్ (సీఎ్‌సఎంపీ) తయారు చేశామని సీఎం తెలిపారు. అమృ త్ 2.0 లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా సీఎ్‌సఎంపీని గు ర్తించి నిధులు సమకూర్చాలన్నారు. వరంగల్ నగరంలో రూ.41,70 కోట్లతో సమగ్ర భూగర్భ నీటి పారుదల (యూజీడీ) పథకాన్ని చేపట్టేందుకు నిధులివ్వాలని కోరారు.
లక్ష సౌర పంపులు కేటాయించండి..
తెలంగాణలోని గిరిజన రైతులకు నిరంతరం సాగునీరు అందించేందుకు వీలుగా పీఎం కుసుమ్ పథకం కింద లక్ష సౌరపంపులను కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క.. కేంద్రమంత్రి ఖట్టర్‌కు విజ్ఞప్తి చేశారు. రా ష్ట్రానికి కుసుమ్-సీ ఎఫ్‌ఎల్‌ఎస్ కాంపొనెంట్ కింద 2,500 మెగావాట్లను కేటాయించాలన్నారు. విద్యుత్తు సరఫరా, నెట్‌వర్క్ బలోపేతానికి రూ.488 కోట్ల అం చనా వ్యయంతో 9 ప్రాజెక్టుల నివేదికలను కేంద్రాని కి సమర్పించామని, వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం(ఆర్డీఎ్‌సఎ్‌స)లో తెలంగాణ డిస్కమ్‌లను చేర్చాలన్నారు. రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు.. విద్యుత్తు ఫైనా న్స్ కార్పొరేషన్ (పీఎ్‌ఫసీ), గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ)లు ఇచ్చిన రుణాలకు సంబంధించిన వడ్డీ రేట్లను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పునరుత్పత్తి విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి రెం డేళ్లకు పైగా సమయం పడుతుందని, అందువల్ల ఆర్‌పీపీవో లక్ష్యాలను చేరుకోలేకపోయినందుకు వి ధించే జరిమానాలను మాఫీ చేయాలన్నారు. కాగా, స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించినందుకు సీఎం రేవంత్‌రెడ్డిని.. కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అభినందించారు. కాగా, సమీక్ష సందర్భంగా తెలంగాణలో పురపాలక శాఖ, హైదరాబాద్ అభివృద్ధిపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ఖట్టర్ తిలకించారు.
మంత్రులతో సీఎం భేటీ నేడు
సీఎం రేవంత్ రెడ్డి శనివారం అందుబాటులో ఉండే మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న పథకాలపై సమీక్ష చేయనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ నేస్తం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తుల మీదా చర్చించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు మరో విడత గ్రామ సభలను నిర్వహించే అంశంపైనా సీఎం సమీక్షించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం