Share News

Power Supply: హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్‌ వ్యవస్థ

ABN , Publish Date - Jan 12 , 2025 | 03:42 AM

భూగర్భంలో విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేసి హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా చేయడంపై దృష్టి సారించాలని విద్యుత్‌ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

Power Supply: హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్‌ వ్యవస్థ

  • ఉత్తమ విధానంపై నివేదిక ఇవ్వండి

  • ఆదివాసీ గూడేలకు ఉచితంగా సౌర విద్యుత్‌ పంపుసెట్లు

  • విద్యుత్‌ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): భూగర్భంలో విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేసి హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా చేయడంపై దృష్టి సారించాలని విద్యుత్‌ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఈ అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ తీగల ఏర్పాటు, నిర్వహణపై వివిధ దేశాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ‘తెలంగాణ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ-2025’ని శనివారం ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ ఆ తర్వాత విద్యుత్‌ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యుత్‌ తీగలతోపాటు అన్ని రకాల కేబుళ్లు భూగర్భంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో అన్నారు.


భూగర్భ వ్యవస్థ వల్ల విద్యుత్‌ చౌర్యం, ప్రకృతి వైపరిత్యాలప్పుడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం వంటివి ఉండవని పేర్కొన్నారు. అలాగే, రాబోయే వేసవిలో రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది లేకుండా డిస్కమ్‌లు సిద్ధం కావాలని ఆదేశించారు. అలాగే, ఆదివాసీ గూడేలల్లో గృహాలకు సౌర విద్యుత్‌ పంపుసెట్లను ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. ఇక, పదేళ్ల క్రితం మంజురైన పరిగి 400 కేవీ సబ్‌స్టేషన్‌ పనులపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మించనున్న నేపథ్యంలో స్టేడియం పక్కనే ఉన్న సబ్‌ ేస్టషన్‌ను మరోవైపు తరలించాలని సూచించారు.

Updated Date - Jan 12 , 2025 | 03:42 AM