కబ్జాకోరల్లో ఆగ్రోస్ భూములు!
ABN , Publish Date - Jan 20 , 2025 | 03:55 AM
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ(టీజీ-ఆగ్రోస్) కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇదే పరిస్థితి..!
మౌలాలిలోని 24 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు.. బెల్లంపల్లిలో కబ్జాకు గురైనట్లు అధికారుల నివేదిక
త్వరలో రంగంలోకి హైడ్రా.. హైదరాబాద్‌కే పరిమితం!
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ(టీజీ-ఆగ్రోస్) కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇదే పరిస్థితి..! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మౌలాలిలో 24 ఎకరాల్లో ఆక్రమణకు గురై.. అక్రమ నిర్మాణాలు జరగ్గా.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఏకంగా 543 ఎకరాలు కబ్జా అయ్యాయి. ఈ మేరకు ఆగ్రోస్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. హైడ్రాను కూడా ఆశ్రయించారు. అయితే.. హైడ్రా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూముల రక్షణపై భరోసానిస్తూ.. రంగంలోకి దిగింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగానథ్ మౌలాలి భూముల కబ్జాలపై విచారణకు ఆదేశించారు.
హైదరాబాద్‌లో విలువైన భూమి
గ్రేటర్ హైదరాబాద్‌లో భూముల విలువ రూ. కోట్లలోనే ఉంటుంది. ఆగ్రో్‌సకు చెందిన 23 ఎకరాల 28 గుంటల భూమి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మౌలాలిలో ఉంది. మౌలాలి రైల్వేస్టేషన్‌కు అత్యంత సమీపంలో.. సర్వే నంబర్లు 29/1, 31లో ఉన్న ఈ భూములు హైదరాబాద్ జిల్లాలోని మారేడ్‌పల్లి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్ మండలాల తహసీల్దార్ల పరిధిలో ఉంది. ఆగ్రోస్ అధికారులు ఈ భూములకు ఎలాంటి రక్షణ గోడను నిర్మించలేదు. దాంతో రియల్టర్లు, స్థానికులు, భూబకాసురుల కన్ను ఈ భూములపై పడింది. కొందరు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టగా.. మరికొందరు ఇళ్లను నిర్మించుకున్నారు. నిజానికి 1975లో హైదరాబాద్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్(హెచ్‌సీఎ్‌ఫఎల్) నుంచి ఆగ్రోస్ ఈ భూమిని సేకరించింది. అయితే.. ఇప్పటి వరకు ఆగ్రోస్ పేరిట మ్యుటేషన్ కాలేదు. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీఏ హెచ్‌సీఎ్‌ఫఎల్ పేరిటే ఈ భూములున్నాయి. మ్యుటేషన్ కాకపోవడంతో.. ఆగ్రోస్ ఇప్పటి వరకు నిర్మాణాలను చేపట్టకపోవడం.. కబ్జాదారులకు వరంగా మారింది. ఈ భూముల కబ్జాపై హైడ్రా విచారణకు ఆదేశించింది. త్వరలో ఆక్రమణలను తొలగించి, ఆగ్రోస్ భూములను కాపాడేందుకు సిద్ధమవుతోంది. ఒకట్రెండ్రోజుల్లో హైడ్రా బృందం మౌలాలిలో సర్వే నిర్వహించనుంది.
మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలం చింతల్‌లోని సర్వే నంబర్లు 221, 222లోనూ ఆగ్రో్‌సకు 10 ఎకరాల భూమి ఉండగా.. కొంత భాగం కబ్జాకు గురైంది.
హైదరాబాద్ జిల్లా షేక్‌పేట్‌లోని సర్వే నంబర్ 403లో 687 గజాలను కూడా కబ్జాదారులు కబళించేందుకు యత్నించగా.. ఆగ్రోస్ ఇటీవల కంచె నిర్మించి, బోర్డును ఏర్పాటు చేసింది. ఇక్కడ ‘ఆగ్రోస్ భవన్’ను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది.
బెల్లంపల్లి భూములు దైవాధీనం?
ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని సర్వే నెంబర్లు 18/19, 18/26, 18/27లో ఆగ్రో్‌సకు 543 ఎకరాల 15 గుంటల భూమి ఉంది. ఇది ఆక్రమణకు గురైందని ఆగ్రోస్ అధికారులు ఇటీవలే గుర్తించి, ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించారు. అయితే ఆ భూమిని ఎవరు కబ్జా చేశారు? అక్కడ ఎలాంటి నిర్మాణాలున్నాయి? ఎంత భూమి కబ్జాకు గురైంది? మిగిలిన భూమి ఎంత? అనే వివరాలు ఆగ్రోస్ వద్ద లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి చెందిన నేతలను ఆగ్రోస్ చైర్మన్‌గా నామినేట్ చేస్తుంటారు. నష్టాల్లో ఉన్న ఆగ్రో్‌సలో వసతులు పొందడం తప్ప.. పాలక మండలి ఆస్తుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్వలు వినిపిస్తున్నాయి. వీసీఎండీగా వ్యవసాయ శాఖ నుంచి సీనియర్ అధికారి ఉంటారు. రాష్ట్రస్థాయిలో మేనేజర్లు, రీజినల్ మేనేజర్లు, వివిధ హోదాల్లో అధికారులు పనిచేస్తున్నా.. ఆగ్రోస్ నిర్వహణ, ఆస్తుల పరిరక్షణపై దృష్టి సారించకపోవడం గమనార్హం..!