Water Dispute: కమిటీల్లేవు.. చర్చల్లేవు
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:58 AM
కృష్ణా, గోదావరిపై అపరిష్కృతంగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులతోపాటు జలవివాదాలపై తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. జలవివాదాలపై కమిటీ అంశాన్ని ఇరు..
జలవివాదాలపై కమిటీ ప్రతిపాదనను పక్కన పెట్టిన తెలుగు రాష్ట్రాలు
తెలంగాణ పేర్కొన్న 13 అంశాలు మాత్రమే ఎజెండాలో ఉన్నాయంటూ ఏపీ విముఖత
పొరుగు రాష్ట్రం సుముఖంగా లేనందున సభ్యుల పేర్లను ఇవ్వబోమంటున్న తెలంగాణ
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరిపై అపరిష్కృతంగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులతోపాటు జలవివాదాలపై తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. జలవివాదాలపై కమిటీ అంశాన్ని ఇరు రాష్ట్రాలు పక్కన పెట్టాయి. జలవివాదాలపై చర్చించడానికి వీలుగా కమిటీలో సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని కేంద్ర జల శక్తి శాఖ ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసిన విషయం విదితమే. అయితే, ఎజెండాలో గోదావరి-బనకచర్ల అనుసంధానం లేకపోవడం, గత నెల 16న కేంద్ర జలశక్తి శాఖ నేతృత్వంలో జరిగిన సీఎంల సమావేశంలో పొందుపర్చిన 13అంశాలు మాత్రమే ఉండడంతో.. కమిటీ ఏర్పాటుపై ఏపీ విముఖత చూపుతోంది. పొరుగు రాష్ట్రం సుముఖంగా లేనందున... తాము కూడా కమిటీకి సభ్యులను ప్రతిపాదించకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయుంచినట్లు తెలిసింది. వాస్తవానికి గత నెలలో సీఎంల సమావేశం విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడే.. గోదావరి-బనకచర్ల అంశం ఎజెండాలో ఉంటే తాము హాజరు కాబోమని తెలంగాణ స్పష్టం చేసింది. సమావేశంలో 13 అంశాలపై చర్చించాలంటూ మంత్రి ఉత్తమ్ కేంద్రానికి లేఖ రాశారు. డిండి ఎత్తిపోతల పథకంతోపాటు సమ్మక్కసాగర్(తుపాకులగూడెం) ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మైనర్ ఇరిగేషన్‌లో కేటాయించిన 45 టీఎంసీలను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ ఇతర బేసిన్‌లకు అక్రమంగా నీటి తరలింపును కట్టడి చేయాలని, శ్రీశైలంతోపాటు సాగర్ నుంచి తరలించే ప్రతి నీటి చుక్కను లెక్కించడానికి టెలిమెట్రీలు పెట్టాలని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ సామర్థ్యం పెంపును అడ్డుకోవాలని, శ్రీశైలం ప్రాజెక్టు రక్షణకు చర్యలు తీసుకోవాలని, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి కేంద్రం సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సీఎంల సమావేశంలోనూ తెలంగాణ లేవ నెత్తిన ఈ 13 అంశాలే చర్చకు వచ్చాయి. అయితే, ఈ అంశాలపై కమిటీ ఏర్పాటు చేసి, చర్చించాల్సిన అవసరం లేదని ఏపీ భావిస్తుండగా, తామూ సభ్యులను ప్రతిపాదించకూడదని తెలంగాణ నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో కమిటీ, చర్చల ప్రతిపాదన అటకెక్కినట్లయింది.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News