Megha Vemuri: నాలాంటి వేలాది విద్యార్థుల మనోగతమే వినిపించా
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:21 AM
మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేదికపై పాలస్తీనాకు మద్దతుగా గళమెత్తి సంచలనం సృష్టించిన తెలుగు సంతతి విద్యార్థిని.. మేఘ వేమూరి..
గాజాలో జరుగుతున్నది నరమేధం
మానవత్వమున్న వారెవరూ సమర్ధించరు
పాలస్తీనా వాసులకు మద్దతుగా పలు కార్యక్రమాలు చేపట్టాం
క్లాస్ ప్రెసిడెంటుగా స్నాతకోత్సవం రోజు కావాలనే ఈ అంశం లేవనెత్తా
అనంతరం నాకు ఎలాంటి బెదిరింపులు ఎదురుకాలేదు
వర్సిటీ నుంచి బహిష్కరించలేదు
డిగ్రీని పోస్టులో పంపుతామన్నారు
యువత బాధితులకు గొంతు అవ్వాలి
‘ఆంధ్రజ్యోతి’తో మేఘ వేమూరి
అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా గళం వినిపించిన ఎంఐటీ విద్యార్థి
మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేదికపై పాలస్తీనాకు మద్దతుగా గళమెత్తి సంచలనం సృష్టించిన తెలుగు సంతతి విద్యార్థిని.. మేఘ వేమూరి! ఆ ప్రసంగం తర్వాత తనకు ఎలాంటి బెదిరింపులూ రాలేదని ఆమె తెలిపింది. ఆ ప్రసంగం తన ఉన్నతచదువులు, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అనుకోవట్లేదని ఆమె పేర్కొన్నారు. మేఘ వేమూరిని సామాజిక మాధ్యమాల ద్వారా ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా... ఆమె పలు అంశాలపై స్పందించారు.
మీ కుటుంబ నేపథ్యం ?
నా పూర్తి పేరు మేఘ మాలిక వేమూరి. జార్జియాలోని అల్ఫారెట్టాలో పుట్టి, పెరిగాను. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు సామాజిక స్పృహ, జ్ఞానార్జనకు తోడ్పడే రకరకాల స్టూడెంట్స్ క్లబ్‌ల నిర్వహణలో నాయకత్వ పాత్ర పోషించా. విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగానూ పనిచేశా. మా నాన్న శరత్ వేమూరి సొంతూరు కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామం. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా అమెరికాలో స్థిరపడ్డారు. అమ్మ పేరు సునీత, ఆమె కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. తల్లిదండ్రులు నా ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువ ఇస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో పెంచారు. అది నా వ్యక్తిత్వానికి ఎంతో మేలు చేసింది.
మీ అభిప్రాయన్ని ప్రకటనకు స్నాతకోత్సవ వేదికను ఎంచుకోవడానికి కారణం ?
2021లో ఎంఐటీలో గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరా. కంప్యూటింగ్, కాగ్నిటీవ్ సైన్స్, లింగ్విస్టిక్స్ నా సబ్జెక్టులు. వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా పని చేస్తున్నప్పుడు 2023 ప్రారంభంలో పాలస్తీనియన్ల దయనీయ పరిస్థితిని తెలుసుకున్నా. ఇజ్రాయెల్ పాలస్తీనాపై సాగిస్తోన్న నరమేధం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఒక దేశ ఆధిపత్య దాడిలో వేల మంది అమాయకులు, అభంశుభం తెలియని చిన్నారులు, మహిళలు చనిపోవడం దారుణం కదా.! గాజాలో ఇజ్రాయెల్ బాంబు దాడులను, కాల్పులను మానవత్వం ఉన్నవారు ఎవరు సమర్థించరు. పాలస్తీనియన్లకు సంఘీభావం ప్రకటించకుండా ఉండలేరు. అదే సమయంలో మా ఎంఐటీలో ఇదే అంశం మీద పనిచేస్తున్న సమూహాలను కలిశా. మేమంతా కలిసి పాలస్తీనవాసులకు మద్దతుగా పలు కార్యక్రమాలు చేపట్టాం. ఈ క్రమంలోనే పాలస్తీనాలో నరమేధం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ ఫోర్సె్‌సతో ఎంఐటీ పరిశోధనా సంబంఽధాలు కలిగి ఉండడాన్ని నిరసించడానికి మా స్నాతకోత్సవం సరైన వేదిక అనుకున్నాం. నేను క్లాస్ ప్రెసిడెంట్‌ను కావడంతో నాకు ప్రసంగించే అవకాశం ఇస్తారని తెలుసు. ఆ సమయాన్ని మా నిరసన తెలియజేయడంతో పాటు గాజాలో ఇజ్రాయెల్ నరమేధాన్ని ఆపాలన్న డిమాండ్‌ను ముందుకు తేవడానికి, పాలస్తీనాకు సంఘీభావాన్ని ప్రకటించడానికి వాడుకున్నాం. పాలస్తీనావాసులకు మద్దతుగా కెఫెయే(’సంప్రదాయ వస్త్రం)ను ధరించి మరీ ఆ వేదికపై ప్రసంగించా.
ప్రసంగం తర్వాత నిర్బంధాలు ఎదుర్కొన్నారా ?
లేదు.! నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు. నిర్బంధాలు ఎదురుకాలేదు. మరుసటి రోజు స్నాతకోత్సవానికి మాత్రం నన్ను అనుమతించలేదు. డిగ్రీ పట్టాను నాకు పోస్టు ద్వారా పంపిస్తామని చెప్పారు. యూనివర్సిటీ నుంచి నన్ను పూర్తిగా నిషేధించారు అని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదు. న్యూరోసైన్స్‌తో పాటు లింగ్విస్టిక్స్‌లో నా పరిశోధన కొనసాగిస్తాను. పాలస్తీనాకు మద్దతు ప్రకటించినంత మాత్రాన, అది నా ఉన్నత చదువు, పరిశోధనల మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది అనుకోలేను. ఆ భయం కూడా నాలో లేదు.
పాక్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై కూడా మాట్లాడాల్సింది అని అంటున్నారు ! దానికి మీ సమాధానం.?
కశ్మీర్ సమస్యతో సహా ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల మీద నాకు అవగాహన ఉంది. అయితే, కొన్నేళ్లుగా గాజా సమస్యపై లోతుగా అధ్యయనం చేస్తున్నా. అందువల్లే మా స్నాతకోత్సవ వేదికపై పాలస్తీనా పక్షాన గళం వినిపించా. ఒక క్లాస్ ప్రెసిడెంట్‌గా ప్రసంగించినా.. అది కేవలం నా అభిప్రాయం కాదు. ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహోమాన్ని వ్యతిరేకిస్తున్న కొన్నివేలమంది విద్యార్థుల మనోగతం.
మీరు ఎదుర్కొన్న విమర్శలు? ప్రశంసలు?
మా గ్రాడ్యుయేషన్ డే రోజున పాలస్తీనాకు సంఘీభావంగా ప్రసంగించాలని అనుకున్నప్పుడే.. ప్రశంసలే కాదు, అంతకుమించి విమర్శలూ వస్తాయని ఊహించాం. నాపై సాగే ట్రోల్స్‌కు కూడా సిద్ధపడ్డా. ఎవరో ఏదో అంటారని, మనం నమ్మిన సత్యాన్ని వెల్లడించకుండా ఉండడం సరికాదు. ఈ సంఘటన తర్వాత మా అమ్మానాన్న, బాబాయిలు, ఇతర కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అంతా నాకు మద్దతుగా నిలిచారు. ‘నీ ధైర్యసాహసాలు, పాలస్తీనియన్ల పట్ల నువ్వు చూపిస్తున్న కరుణ చూస్తుంటే గర్వంగా ఉంది’ అంటూ మా నాన్న నన్ను గుండెలకు హత్తుకున్నారు. నా చర్య వల్ల అమెరికాలోని భారతీయ విద్యార్థులకు సమస్యలు ఎదురవుతాయి అనుకోవడంలో నిజం లేదు. ఎక్కడైనా అన్యాయం, అసత్యం, అమానవీయం అనిపించిన సందర్భాల్లో యువత బాధితులకు గొంతుకగా నిలవాలి.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News