మొదటిసారిగా తెలుగు నేలకు ‘అహికుంటకులు’
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:05 AM
తెలుగు భాషకు ఎల్లలు లేవనడానికి శ్రీలంకలోని అహికుంటక తెగ ప్రజలు నిదర్శనం. వారెవరూ బతుకుదెరువు కోసం అక్కడికి వెళ్లినవారు కాదు.
వర్ణమాల ఉందని ఈ మధ్యే తెలిసింది
అహికుంటక తెగకు చెందిన మసన్న
శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లోని సంచార తెగల్లో తెలుగు మాట్లాడేవారు
తెలుగు నెరవు నిర్వాహకుడు రమేశ్
అహికుంటక ప్రతినిధులకు సన్మానం
హైదరాబాద్ సిటీ, జూలై 11(ఆంధ్రజ్యోతి): తెలుగు భాషకు ఎల్లలు లేవనడానికి శ్రీలంకలోని అహికుంటక తెగ ప్రజలు నిదర్శనం. వారెవరూ బతుకుదెరువు కోసం అక్కడికి వెళ్లినవారు కాదు. పక్కా లంకేయులైనా అచ్చ తెలుగు భాషీయులు. తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా వారిని శుక్రవారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో తెలుగు నెరవు, తెలుగు జాతి ట్రస్ట్ సత్కరించాయి. ఆ తెగకు చెందిన ఆల్ సిలోన్ తెలుగు ఆర్టిస్ట్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షడు మసన్న మాట్లాడుతూ తమ తెగ వారు 15 వేల మందికిపైగా ఉన్నారని తెలిపారు. తాము తెలుగులో మాట్లాడుతున్నా... రాయడం, చదవడం రాదని, అసలు తెలుగులో వర్ణమాల ఉందన్న విషయం ఈ మధ్యే తెలిసిందని చెప్పారు. ‘మా ప్రధాన వృత్తి పాములు, కోతులను ఆడించడం. ఈ తరంలో చాలామంది ఇతర వృత్తులను ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు. ఉన్నత విద్య అభ్యసించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మరోవైపు కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాద’ని మసన్న వివరించారు.
తమను తెలుగు నేలకు, సంస్కృతికి దగ్గర చేయడంలో సీనియర్ జర్నలిస్టు, తెలుగు జాతి ట్రస్టీ డీపీ అనూరాధ, తెలుగు నెరవు సంస్థ నిర్వాహకుడు స.వెం.రమేష్ చూపించిన చొరవ మరువలేనిదని కృతజ్ఞతలు తెలిపారు. తనది కిన్నెర మీటే పరంపరకు చెందిన కుటుంబమని కార్యదర్శి నిమల్ చెప్పారు. శ్రీలంకలోని తెలుగువారి అభ్యున్నతి కోసం కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. బుద్ధభగవానుడి దంతాన్ని శ్రీలంకకు తీసుకురావడంలో తెలుగు వనిత హేమమాల తోడ్పాటు అద్వితీయమని శ్రీలంక బౌద్ధ భిక్షువు థేరో గుర్తుచేశారు. తెలుగు నేల మీద ఒకనాడు విరాజిల్లిన బౌద్ధ చరిత్రను తెలుగు మీద మమకారంతో జపాన్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువు యుషీ వివరించారు. భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో సంచార తెగల్లో తెలుగు మాట్లాడేవారు ఎక్కువ మంది ఉన్నారని రమేష్ తెలిపారు. దేశ దేశాల్లోని తెలుగు వారిపై అధ్యయనంలో డీపీ అనూరాధ కృషి ప్రత్యేకమైనదని కొనియాడారు. ఆమెతో పాటు తెలుగు నెరవు ప్రతినిధులు సుబ్బారెడ్డి, విజయ్, భానుకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ సిటీ బ్యూరో చీఫ్ చామర్తి మురళీధర్ 2007లో తన శ్రీలంక పర్యటన విశేషాలను సభికులతో పంచుకున్నారు. ఇన్నేళ్లకైనా తల్లివేరుతో పిల్లవేరు కలవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
For Telangana News And Telugu News