Godavari Pushkaralu: పుష్కర సన్నద్ధత ఏదీ..?
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:48 AM
గోదావరి పుష్కరాలకు మరో రెండేళ్ల సమయమే ఉంది. ఈసారి ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశాలున్నాయి.
2027 జూలై-ఆగస్టులో గోదావరి పుష్కరాలు.. తెలంగాణలో 6 చోట్ల నిర్వహణకు అవకాశం
ఆరు కోట్ల మంది వస్తారని అంచనా
ఏపీలో 2వేల కోట్లతో పనుల ప్రణాళిక
94 కోట్లు కేటాయించిన మోదీ సర్కార్
తెలంగాణకు పైసా ఇవ్వని కేంద్రం
వరంగల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గోదావరి పుష్కరాలకు మరో రెండేళ్ల సమయమే ఉంది. ఈసారి ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశాలున్నాయి. వారంతా ప్రశాంతంగా పుణ్యస్నానాలు చేసి, సమీపంలోని ఆలయాల్లో దైవ దర్శనాలు చేసుకునేలా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. 2015లో తెలంగాణ వ్యాప్తంగా ఆరు చోట్ల జరిగిన గోదావరి పుష్కరాలకు 4.60 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని అంచనా. ఈసారి ఆరు కోట్లకు పైగా వస్తారని అధికారులు భాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో గోదావరి పుష్కరాల కోసం రూ.94 కోట్లు కేటాయించింది. మరోవైపు, తెలంగాణకు మాత్రం పైసా ఇవ్వకపోవటం చర్చనీయాంశమైంది. ఏపీలో గోదావరి పుష్కరాల కోసం అక్కడి ప్రభుత్వం రూ.2 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు కార్యాచరణ సిద్ధం చేయగా.. తెలంగాణలో ఇంకా పుష్కర సన్నద్ధత లేకపోవటంపై భక్తులు పెదవి విరుస్తున్నారు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి.
వేడుకలకు ఏర్పాట్లు ఏవీ..?
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ఇటీవల సరస్వతి పుష్కరాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వం మూడు నెలల ముందు రూ.35 కోట్ల వరకు నిధులు కేటాయించింది. అయితే పుష్కరాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించటంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. 8 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తే 15 లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అధికారుల అంచనాలు తప్పటంతో పాటు నిర్వహణపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. 2015లో జరిగిన గోదావరి పుష్కరాలకు తెలంగాణలోని ధర్మపురి, బాసర, మంథని, కాళేశ్వరం, ఏటూరునాగారం, భద్రాచలం వద్ద 4.60 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు అంచనా. ఈసారి ఆరు కోట్లకు పైగా భక్తులు హాజరవుతారనే అంచనా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పుష్కరాల కోసం అక్కడి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్సవాల కోసం సుమారు రూ.2 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు గోదావరి పుష్కరాలపై దృష్టి పెట్టకపోవటంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ఇప్పటికే మూడు ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ మరో మూడు ఘాట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు 25 కి.మీ. మాత్రమే డబుల్ రోడ్డు ఉంది. ఇప్పటికే నిధులు మంజూరైనా అటవీ శాఖ అనుమతులు ఆలస్యం అవుతుండటంతో పనులు జరగటం లేదు. అలాగే హైదరాబాద్ నుంచి ఎక్కువగా భక్తులు వచ్చేది ములుగు జిల్లా ఏటూరునాగారం పుష్కరఘాట్లకే. హైదరాబాద్ నుంచి పస్రా వరకు నాలుగు లైన్ల రోడ్డు ఉంది. అయితే పస్రా నుంచి ఏటూరునాగారం వరకు 20 కి.మీ. మాత్రమే డబుల్ రోడ్డు ఉంది. ఇక్కడ కూడా జాతీయ రహదారి-163 విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ అటవీ శాఖ అనుమతులు లేక పనులు జరగటం లేదు. అలాగే ఏటూరునాగారం నుంచి మంగపేట మండలం మల్లూరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు భక్తులు పెద్ద సంఖ్యలో వెళతారు. సుమారు 20కి.మీ. వరకు డబుల్ రోడ్డు ఉంది. దీనిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. వీటితో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రధానంగా రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంది. అలాగే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, లక్నవరం, బొగత జలపాతం, భద్రాచలం, పర్ణశాల, బాసర, ధర్మపురి తదితర ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు, పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉంది.
మనకేదీ కేంద్ర సాయం..?
గోదావరి పుష్కరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించి, తెలంగాణకు మొండి చేయి చూపడం చర్చనీయాంశంగా మారింది. భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం 11 అక్టోబరు 2024న ఆంధ్రప్రదేశ్‌కు రూ.94 కోట్లు కేటాయించింది. అలాగే రైల్వే శాఖ ఏపీకి వరాలు కురిపించింది. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.271.43 కోట్లు కేటాయించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గోదావరి పుష్కరాలకు రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు వచ్చే భక్తులకు సౌకర్యాల కోసం ఈ నిధులను కేటాయించారు. తెలంగాణకు మాత్రం నయా పైసా కేటాయింపులు చేయకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ఏం లాభమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణపై కేంద్ర చిన్నచూపు చూస్తుందనే చర్చ జరుగుతోంది. ఏపీ తరహాలోనే తెలంగాణకు కూడా పుష్కరాలకు కేంద్రం నిధులు కేటాయించేలా బీజేపీ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నీట్ యూజీ టాపర్లకు అభినందనలు తెలిపిన సీఎం
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..
For Telangana News And Telugu News