CM Revanth Reddy: రాష్ట్రంలో మరో డిస్కం
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:28 AM
రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను
ఉత్తర, దక్షిణ డిస్కంలు వాణిజ్య కార్యకలాపాలకే..
ఆర్థిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయండి
విద్యుత్తు వ్యవస్థ ప్రక్షాళనకు సంస్కరణల అమలు
అధిక వడ్డీల రుణాలతో డిస్కమ్‌లు డీలా పడ్డాయ్
6 శాతం వడ్డీ ఉండేలా వాటిని రీస్ట్రక్చర్ చేయండి
ప్రభుత్వ విద్యాసంస్థల్లో, ఆఫీసుల్లో సౌర విద్యుత్తు
సచివాలయంలోనూ సోలార్ రూఫ్‌టాప్, ఫెన్సింగ్
ఇంధన శాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త డిస్కమ్ ఏర్పాటుకు గల ఆర్థిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. విద్యుత్తు వ్యవస్థ ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని చెప్పారు. విద్యుత్తు పంపిణీ సంస్థలన్నీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే సంస్థ వల్ల డిస్కమ్‌లకు ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశాలు ఉంటాయా? అనే అంశాలపై చర్చించాలని సూచించారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ)తో సంప్రదింపులు జరపాలన్నారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంధన శాఖపై ఉప ముఖ్యమంత్రి భట్టి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, జెన్‌కో సీఎండీ ఎస్.హరీశ్, దక్షిణ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ అలీ, ఉత్తర డిస్కమ్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి శరత్‌తో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, ఇళ్లకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తు అందించే గృహజ్యోతి, విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తును అందించే కనెక్షన్లన్నీ కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్ పరిఽధిలోకి తేవాలని సూచించారు. ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లను వాణిజ్య కార్యకలాపాల కోసమే వినియోగించుకునే దిశగా ఆలోచన చేయాలని చెప్పారు. రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా కొత్త డిస్కమ్ పరిధి ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం టీజీ ఎస్పీడీసీఎల్ (హైదరాబాద్), టీజీ ఎన్పీడీసీఎల్ (వరంగల్) ఉండగా.. కొత్తగా మరో డిస్కమ్ రానుంది. దీనివల్ల ప్రస్తుత డిస్కమ్‌ల పనితీరు మెరుగుపడి, జాతీయ స్థాయిలో పరపతి పెరుగుతుందని సీఎం అన్నారు. డిస్కమ్‌ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పనిసరని స్పష్టం చేశారు.
రుణ భారాన్ని తగ్గించాలి..
డిస్కమ్‌ల పునర్వ్యవస్థీకరణతో పాటు విద్యుత్తు సంస్థలపై ఇప్పుడున్న రుణ భారాన్ని త గ్గించాలని సూచించారు. రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. 10 శాతం వరకు వడ్డీతో తీసుకున్న రుణాల వల్ల డిస్కమ్‌లు డీలా పడ్డాయని.. ఈ రుణాలను 6 శాతం వరకు వడ్డీ ఉండేలా రీ స్ట్రక్చర్ చేసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు పెట్టాలని ఆదేశించారు. సౌర విద్యుత్తును అందుబాటులోకి తేవాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, జిల్లాలవారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర సచివాలయంలో కూడా సౌర విద్యుత్తును అందుబాటులోకి తేవాలని చెప్పారు. సచివాలయంలో నీడ లేకపోవడంతో వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. విద్యుత్తు అవసరాలతో పాటు పార్కింగ్ ఇబ్బందులు తొలగేలా సచివాలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సోలార్ రూఫ్ టాప్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఇందిర సౌర గిరి జలవికాసం పథకాన్ని అన్ని గిరిజన, ఆదివాసీ గూడేలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేయాలని చెప్పారు. రానున్న మూడేళ్లలో 2.10 లక్షల మంది ఎస్టీ రైతులకు పథకాన్ని వర్తింపజేయాలని, 6 లక్షల ఎకరాలకు సౌరవిద్యుత్తు పంపుసెట్లు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ను అధికారులు వివరించారు. 2020 ఫిబ్రవరి 20న 13168 మెగావాట్ల డిమాండ్ ఏర్పడగా.. 2021 మార్చి 26న 13,688 మెగావాట్లు, 2022 మార్చి 29న 14,163 మెగావాట్లు, 2023 మార్చి 30న 15,497 మెగావాట్లు, 2024 మార్చి 8న 15623 మెగావాట్లు, 2025 మార్చి 20న అత్యధికంగా 17,162 మెగావాట్ల డిమాండ్ ఏర్పడిందని అధికారులు సీఎంకు నివేదించారు. వార్షిక విద్యుత్తు వినియోగం ఏటా 9.8 శాతం దాకా పెరుగుతోందని గుర్తుచేశారు. కొన్ని ప్రాంతాల్లో వినియోగ వృద్ధి 15 శాతం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో 30 శాతంగా ఉందన్నారు. డిమాండ్‌ను బట్టి విద్యుత్తు వినియోగ ప్రాంతాలను నాలుగు కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News