Share News

Nursing Colleges: నర్సింగ్‌లో జర్మన్‌, జపనీస్‌ పాఠాలు!

ABN , Publish Date - Sep 06 , 2025 | 03:58 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల్లో త్వరలో జర్మన్‌, జపనీస్‌ భాషలను బోధించనున్నారు. బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు తరగతుల్లో జర్మన్‌, జపనీస్‌ పాఠాలు చెప్పి ఆయా భాషలను నేర్పించనున్నారు.

Nursing Colleges: నర్సింగ్‌లో జర్మన్‌, జపనీస్‌ పాఠాలు!

  • రాష్ట్రంలోని 37 ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల్లో త్వరలో తరగతులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల్లో త్వరలో జర్మన్‌, జపనీస్‌ భాషలను బోధించనున్నారు. బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు తరగతుల్లో జర్మన్‌, జపనీస్‌ పాఠాలు చెప్పి ఆయా భాషలను నేర్పించనున్నారు. విదేశాల్లో నర్సులకు ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో నర్సుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నర్సింగ్‌ విద్యార్థులకు విదేశీ భాషలు నేర్పించేందుకు హైదరాబాద్‌లోని ఇఫ్లూ(ది ఇంగ్లీష్‌ అండ్‌ ఫారీన్‌ లాంగ్వేజ్‌ యూనివర్సిటీ)తో త్వరలో అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఈ ఒప్పందం జరిగితే రాష్ట్రంలోని 37 ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల్లో డిజిటల్‌ కాస్లులు ఏర్పాటు చేసి జర్మన్‌, జపనీస్‌ భాషలను బోధిస్తారు. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్ధులకు ఫారీన్‌ లాంగ్వెజ్‌ సబ్జెక్టులుగా జర్మన్‌, జపనీస్‌ ఉంటాయని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.


నిజానికి, భారతీయ నర్సులకు విదేశాల్లో భారీ డిమాండ్‌ ఉంది. అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా అరబ్‌ తదితర దేశాల్లో భారతీయ నర్సులకు ఆకర్షణీయమైన వేతనాలు చెల్లిస్తారు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే నర్సుల్లో కొందరు విదేశాలకు వెళ్లిపోతున్నారు. అయితే, విదేశాల్లో నర్సుగా పని చేయాలనుకునే వారు ఆయా దేశాల నర్సింగ్‌ కౌన్సిల్‌ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులై రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. జపాన్‌, జర్మనీ విషయానికొస్తే బీఎస్సీ నర్సింగ్‌ అర్హత కలిగిన నర్సులకు తమ భాషపై ఆ దేశాలు రాత పరీక్ష నిర్వహిస్తాయి. ఈ నేపథ్యంలో బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు జపాన్‌, జర్మనీ భాషలను నేర్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కాగా, ఒక్క కెనడాలో రాబోయే ఐదేళ్లలో 1.17 లక్షల మంది నర్సులు అవసరం అవుతారని ఓ అంచనా. ఇక యూకేలో 41000 మంది నర్సుల కొరత ఉన్నట్టు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.

విదేశాల్లో భారతీయ నర్సులకు

ఇచ్చే సగటు వార్షిక వేతనాలు ఇలా

దేశం సగటు వార్షిక వేతనం

అమెరికా 75,000-85000 డాలర్లు

డెన్మార్క్‌ 83,888 డాలర్లు

స్విట్జర్లాండ్‌ 90000-లక్ష డాలర్లు

లక్సెంబర్గ్‌ 87000-90000 డాలర్లు

ఆస్ట్రేలియా 65000-95000 డాలర్లు

నార్వే 70000-80000 డాలర్లు

కెనడా 50,000-75,000 డాలర్లు

జర్మనీ 38,000-55,000 డాలర్లు


ఈ వార్తలు కూడా చదవండి..

 ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..

మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి

Read Latest TG News and National News

Updated Date - Sep 06 , 2025 | 03:58 AM