Land Value Increase: భూముల విలువల పెంపు తొలుత ఓఆర్‌ఆర్ వరకు!
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:05 AM
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు త్వరలోనే పెరగనున్నాయి. క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత భూముల విలువలను పెంచుదామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలిసింది.
ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు
క్యాబినెట్‌లో చర్చించి, విలువల పెంపుపై నిర్ణయం
మ్యుటేషన్లు త్వరగా పూర్తి చేయాలి
రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణ శాఖలపై సీఎం సమీక్ష
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు త్వరలోనే పెరగనున్నాయి. క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత భూముల విలువలను పెంచుదామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలిసింది. తొలుత కోర్ అర్బన్ రీజియన్ (ఓఆర్‌ఆర్ లోపల) పరిధిలో భూముల మార్కెట్ విలువలు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. కోర్ అర్బన్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతం మీద సమగ్ర అఽధ్యయనం చేసి, ఎక్కడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలిసింది. భూముల విలువల పెంపుపై జిల్లా కమిటీల నుంచి నివేదికలు వచ్చాక.. వాటిపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో చర్చించి, అమలుపై తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. విలువల పెంపును కోర్ అర్బన్ రీజియన్‌లో తొలుత అమలు చేసి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం రెవెన్యూ; స్టాంపులు, రిజిస్ట్రేషన్లు; గృహనిర్మాణ శాఖలపై మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ భూముల విలువలు ఇప్పటికీ కోర్ అర్బన్ రీజియన్‌లో ఎకరా రూ.20 లక్షలు ఉందని.. బహిరంగ మార్కెట్‌లో మాత్రం ఎకరా రూ.10-20 కోట్ల మధ్య ఉందనే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇలాంటి విలువలను రెండు, మూడు రెట్లు వరకు పెంచాలనే దానిపై క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుందామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే ఓఆర్‌ఆర్ లోపల చాలా ప్రాంతాల్లో గజం భూమి ధర (రిజిస్ట్రేషన్ బుక్ వాల్యూ) రూ.2000-2500 లోపు ఉందని, అదే భూమి గజం రూ.30-50వేల మధ్య విక్రయాలు జరుగుతున్నాయని అధికారులు వివరించినట్లు తెలిసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, కలెక్టర్ల నుంచి తెప్పించే నివేదికల్లో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా భూములకు భూధార్‌నంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. వారసత్వ, ఇతర మ్యుటేషన్ల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. లైసెన్స్డ్ సర్వేయర్లు భూములను సర్వే చేసి న తర్వాత వాటిని రెగ్యులర్ సర్వేయ ర్లు పరిశీలించాలని ఆదేశించారు. కోర్ అర్బన్ పరిధిలో నూతనంగా నిర్మించనున్న 10సబ్ రిజిస్ట్రార్‌కార్యాలయాల నమూనాలను రేవంత్ పరిశీలించారు. ప్రతి కార్యాలయం లో పార్కింగ్, క్యాంటిన్, ఇతర మౌలిక వసతులుండేలా చూడాలని సీఎం సూచించారు.
ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయండి
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పూర్తయిన ఇళ్ల ప్రారంభోత్సవానికి ఈ నెలాఖరులోగా ఏర్పాట్లు చేయాలని గృహనిర్మాణ శాఖ అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్‌లోని హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచర్‌గా ఉన్న ప్రాజెక్టుల్లోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
మూడు రోజులూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేసుకోవాలని బుధవారం ఎక్స్ వేదికగా సూచించారు. క్లౌడ్ బరస్ట్ సమయంలో అనుసరించాల్సిన కార్యాచరణపై అధికారులకు సూచనలు చేశారు. అత్యధిక వర్షాలు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వానలు, వరదల పరిస్థితులపై ప్రజలను ఎఫ్‌ఎం రేడియోల ద్వారా అలర్ట్ చేయాలన్నారు. అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో పాటు, ఐటీ ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
Read latest Telangana News And Telugu News