National Highways Road Expansion: 4 వరసలుగా.. 15 జాతీయ రహదారులు
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:22 AM
రాష్ట్రంలోని పలు జాతీయ రహదారులను విస్తరించనున్నారు. 1123 కిలోమీటర్ల మేర ప్రస్తుతం 2 వరసలుగా ఉన్న 15 రహదారులను 4 వరసలుగా అభివృద్ధి చేయనున్నారు.
రాష్ట్రంలో 33 వేల కోట్లతో పనులు
1123 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులకు కేంద్రం పచ్చజెండా!
అటవీ, ఇతర అనుమతులు, భూ సేకరణ బాధ్యత రాష్ట్రానిదే..
నిర్మాణ పనుల వ్యయం కేంద్రానిది
ట్రాఫిక్‌ను బట్టి రోడ్లపై టోల్‌ప్లాజాలు
2028 కల్లా పూర్తి చేయాలని లక్ష్యం
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు జాతీయ రహదారులను విస్తరించనున్నారు. 1123 కిలోమీటర్ల మేర ప్రస్తుతం 2 వరసలుగా ఉన్న 15 రహదారులను 4 వరసలుగా అభివృద్ధి చేయనున్నారు. రూ.33,690 కోట్ల వ్యయమయ్యే ఈ పనులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తెలంగాణ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉన్న పలు జాతీయ రోడ్లు, హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలను అనుసంధానించడం, ఇప్పటికే ట్రాఫిక్ అధికంగా ఉన్నట్లు గుర్తించిన పలు జాతీయ రహదారుల విస్తరణకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. తమ పరిధిలో ఉన్న జాతీయ రోడ్లను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే, వాటిలో కొన్నింటిని మాత్రమే మంజూరు చేసేది. ఇప్పుడా నిబంధనను తొలగించి, రాష్ట్రాల పరిధిలో ఉన్న జాతీయ రోడ్ల విస్తరణకు ఎలాంటి ఆంక్షలు లేకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసిన మేరకు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రహదారుల అభివృద్ధికి అవసరమైన భూ సేకరణ, అటవీ ప్రాంతాల మీదుగా పనులు చేయాల్సి ఉంటే అటవీ అనుమతులతో పాటు పర్యావరణ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. వాటితో పాటు సమగ్ర నివేదికను సమర్పించాలి. అన్ని వివరాలు సమగ్రంగా అందినట్లు కేంద్రం భావిస్తే వెంటనే ఆయా పనులకు అనుమతులు ఇస్తుంది. వాటికయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు జాతీయ రహదారులను 2 నుంచి 4 వరసలుగా విస్తరించిన తర్వాత వాటిపై టోల్‌ప్లాజాలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆయా రోడ్లపై ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్, అభివృద్ధి చేశాక పెరిగే ట్రాఫిక్‌ను అంచనా వేశాకే వాటిని విస్తరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం గుర్తించిన 15 రోడ్ల విస్తరణ పనులను 2028కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఇలా దాదాపు 10 వేల కి.మీ. మేర రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉందని కేంద్రం గుర్తించింది.
జడ్చర్ల నుంచి కోదాడ వరకు పెద్ద రోడ్డు..
ఎన్‌హెచ్-167లో జడ్చర్ల నుంచి కల్వకుర్తి- మల్లేపల్లి- హాలియా- అలీనగర్- మిర్యాలగూడ మీదుగా కోదాడ వరకు 219 కి.మీ. మేర ఉన్న రోడ్డును 4 వరసలుగా విస్తరించనున్నారు. ప్రస్తుతం ఇది రెండు వరసలుగా ఉండడంతో రద్దీ వేళల్లో ప్రయాణం ఇబ్బందిగా ఉంటోంది. గుర్తించిన 15 రోడ్ల పనుల్లో దూరం పరంగా ఇదే పెద్దది. లక్ష్యం మేరకు గుర్తించిన పనులను పూర్తిచేయగలిగితే తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా సంబంధిత వ్యాపారం పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
గుర్తించిన 15 రోడ్లు ఇవే..
ఎన్‌హెచ్-167లోని జడ్చర్ల- కల్వకుర్తి- మల్లేపల్లి- హాలియా- అలీనగర్- మిర్యాలగూడ మీదుగా కోదాడ వరకు 219 కిలోమీటర్లు.
ఎన్‌హెచ్-365: నకిరేకల్- మల్లంపల్లి సెక్షన్‌లోని నకిరేకల్- తానంచర్ల వరకు, నర్సంపేట బైపాస్ 181 కి.మీ.
ఎన్‌హెచ్-563: ఖమ్మం-వరంగల్ సెక్షన్‌లో 119 కి.మీ.
ఎన్‌హెచ్-30: విజయవాడ- జగదల్‌పూర్ సెక్షన్‌లో రుద్రంపూర్- భద్రాచలం వరకు. ఇందులో కొత్తగూడెం, పాల్వంచ బైపా్‌సరోడ్లకు అనుసంధానం. మొత్తం 100 కి.మీ.
ఎన్‌హెచ్-365: సూర్యాపేట- జనగామ సెక్షన్‌లో 83 కిలోమీటర్లు.
ఎన్‌హెచ్-365బిబి: ఖమ్మం- సత్తుపల్లి మార్గం. 81 కిలోమీటర్లు.
ఎన్‌హెచ్-163: మన్నెగూడ- రావులపల్లి సెక్షన్‌లో 73 కి.మీ.
ఎన్‌హెచ్-765డి: హైదరాబాద్ ఓఆర్‌ఆర్ నుంచి మెదక్ సెక్షన్ వరకు 63 కి.మీ.
ఎన్‌హెచ్-353సి: పరకాల బైపాస్, భూపాలపల్లి బైపాస్ వరకు 61 కి.మీ.
ఎన్‌హెచ్-61: కల్యాణ్- నిర్మల్ సెక్షన్‌లో 53 కిలోమీటర్లు.
ఎన్‌హెచ్-63: బోధన్- నిజామాబాద్ సెక్షన్‌లోని మైనర్ బ్రిడ్జిని 4 లేన్లుగా మార్చడం. ఇదే మార్గంలో 4 లేన్లుగా రోడ్డు, మరో చోట ఆర్వోబీ నిర్మాణంతో పాటు మహారాష్ట్ర సరిహద్దు నుంచి బోధన్ వరకు మిగిలిన పనుల పూర్తి. మొత్తం 36 కిలోమీటర్లు.
ఎన్‌హెచ్-163: హైదరాబాద్- భూపాలపట్నం మార్గంలో ఒకచోట విస్తరణ, రెండు చోట్ల మేజర్ బ్రిడ్జిల నిర్మాణం, మరో చోట రోడ్డు విస్తరణ. మొత్తం 26 కిలోమీటర్లు.
ఎన్‌హెచ్-167, ఎన్‌హెచ్-167ఎన్: మహబూబ్‌నగర్ బైపాస్ నిర్మాణం. ఇది 11 కి.మీ. ఉండనుంది.
ఎన్‌హెచ్-63: నిజామాబాద్- జగదళ్‌పూర్ సెక్షన్‌లో రహదారి విస్తరణ, ఒకచోట మేజర్ బ్రిడ్జి నిర్మాణం. ఇది 10 కి.మీ.
ఎన్‌హెచ్-765డి: మెదక్ బైపాస్ నిర్మాణం. ఇది 7 కిలోమీటర్లు ఉండనుంది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి