Share News

Suicide Rate: బలవన్మరణాల రేటులో ఐదో స్థానం!

ABN , Publish Date - Aug 06 , 2025 | 04:15 AM

రాష్ట్రంలో బలవన్మరణాలు పెరుగుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. ఆత్మహత్యల్లో జాతీయ సగటుకు రెండింతలకు మించి తెలంగాణలో ఆత్మహత్యలు నమోదయ్యాయి.

Suicide Rate: బలవన్మరణాల రేటులో ఐదో స్థానం!

  • 2018-22 మధ్య రాష్ట్రంలో 43,729 ఆత్మహత్యలు

  • ప్రతి లక్ష జనాభాకు 26 బలవన్మరణాల నమోదు

  • జాతీయ సగటుకు రెండితలపైనే.. టాప్‌లో సిక్కిం

  • ఏపీ కాస్త మెరుగు.. అక్కడ ఆత్మహత్యల రేటు 16.8

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బలవన్మరణాలు పెరుగుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. ఆత్మహత్యల్లో జాతీయ సగటుకు రెండింతలకు మించి తెలంగాణలో ఆత్మహత్యలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 12.4 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణలో ఈ రేటు 26.3గా ఉంది. ఈ మేరకు ఆత్మహత్యల రేటులో తెలంగాణ దేశంలో ఐదో స్థానంలో ఉంది. ఏపీలో ఆత్మహత్యల రేటు 16.8గా ఉంది. రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆత్మహత్యలపై 2018-22 మధ్యకాలానికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సభ ముందు ఉంచింది. ఆ జాబితా ప్రకారం 2018 నుంచి 2022 వరకు ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 7,61,648 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2018లో 1,34,516 మంది ఆత్మహత్యకు పాల్పడితే.. 2022లో 1,70,924 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో ప్రతి లక్ష జనాభాకు సూసైడ్‌ రేటు 10.2గా ఉంటే.. 2022 నాటికి అది 12.4కు పెరగడం గమనార్హం.


కేంద్రం ప్రకటించిన జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం ఆత్మహత్యల్లో 5.8శాతం తెలంగాణలోనే నమోదవుతున్నాయి. ఆ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 7,61,648 మంది ఆత్మహత్య చేసుకుంటే వీరిలో రాష్ట్రం నుంచి 43,729 మంది ఉన్నారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల జరుగుతున్న ఆత్మహత్యల్లో తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉన్నట్లు ఆ జాబితా వెల్లడించింది. 2018-22 మధ్య మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా 63,331 మంది ఆత్మహత్య చేసుకుంటే.. వీరిలో 2,590 మంది (4.08శాతం) తెలంగాణ నుంచి ఉన్నారు. ఆత్మహత్యల రేటులో సిక్కిం మొదటి స్థానంలో ఉంది. అక్కడ 2022లో ప్రతి లక్ష జనాభాకు సూసైడ్‌ రేటు 42.8గా ఉంది. అంటే.. జాతీయ సగటుకన్నా మూడు రెట్లు ఎక్కువ! సిక్కిం తర్వాత స్థానం అండమాన్‌ నికోబార్‌ది. అక్కడ రేటు 42.5గా ఉంది. చత్తీ్‌సగడ్‌లో (28.5), తమిళనాడు (25.9), కర్ణాటక (20.2), గోవాలో (19.2), మహారాష్ట్ర (18.1), మధ్యప్రదేశ్‌ (17.9), త్రిపుర (17.3), ఢిల్లీ (16.2)లో జాతీయ సగటుకు మించి ఆత్మహత్యలు నమోదయ్యాయి.


టెలికాల్స్‌లోనూ రాష్ట్రం రెండోస్థానం

మానసిక ఆరోగ్యానికి సంబంధించి 10 అక్టోబరు 2022న కేంద్రం ‘నేషనల్‌ టెలి మెంటల్‌ హెల్త్‌ ప్రొగ్రామ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా క్వాలిటీ మెంటల్‌ హెల్త్‌ కౌన్సెలింగ్‌ను ఇస్తున్నారు. ఈ ఏడాది జూలై చివరి నాటికి దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాల్లో 53 టెలిమానస్‌ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. మొత్తం 20 భాషల్లో రోగులకు సేవలందిస్తున్నారు. కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి జూలై 31 వరకు మొత్తం 24 లక్షల కాల్స్‌ వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. చైన్నెలోని 104 హెల్ప్‌లైన్‌కు అత్యధికంగా 2.48 లక్షల కాల్స్‌ రాగా, ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ కేంద్రానికి 1,61,477 కాల్స్‌ వచ్చినట్లు కేంద్రం తెలిపింది. కేంద్రం టోల్‌ఫ్రీ హెల్ప్‌ లైన్‌ నంబరు 14416ను ఏర్పాటు చేసింది. కాల్‌ చేసే వారు తమకు నచ్చిన భాషను ఎంచుకొని వైద్యులతో మాట్లాడొచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 04:16 AM