Share News

Ambedkar Open University: పోలీసు డిగ్రీ

ABN , Publish Date - Aug 15 , 2025 | 03:35 AM

ఇంటర్‌ విద్యార్హతతో పోలీసు ఉద్యోగాల్లో చేరిన వారు ఇకపై డిగ్రీలు అందుకోవచ్చు. ఐదేళ్లలో పట్టభద్రులై పట్టాలు పుచ్చుకోవచ్చు. ఉన్నత చదువులు చదువుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Ambedkar Open University: పోలీసు డిగ్రీ

  • సర్వీసులో ఉన్నవారు డిగ్రీ చదివేందుకు అవకాశం

  • ‘దూరవిద్య’లో ఐదేళ్లలో పూర్తి

  • అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీతో రాష్ట్ర పోలీసు శాఖ ఒప్పందం

  • పోలీసు ట్రైనింగ్‌ సెంటర్లలో వర్సిటీ తరఫున స్టడీ సెంటర్లు

  • ఇంటర్‌తో పోలీసు కొలువుల్లో ప్రస్తుతం 30 వేల మంది

  • డిగ్రీ చేస్తే పదోన్నతులకు చాన్స్‌

హైదరాబాద్‌,ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యార్హతతో పోలీసు ఉద్యోగాల్లో చేరిన వారు ఇకపై డిగ్రీలు అందుకోవచ్చు. ఐదేళ్లలో పట్టభద్రులై పట్టాలు పుచ్చుకోవచ్చు. ఉన్నత చదువులు చదువుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ విద్యార్హతతో ఉద్యోగంలో చేరిన కానిస్టేబుల్‌, ఏఆర్‌ ఎస్‌ఐ, ఏఎ్‌సఐ పోస్టుల్లో పనిచేస్తున్న వారు ఐదేళ్ల కాలంలో దూరవిద్యా విధానం ద్వారా డిగ్రీ పూర్తి చేసుకునేలా అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీతో తెలంగాణ పోలీసుశాఖ ఒప్పందం చేసుకుంది. డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ జితేందర్‌, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఘంటా చక్రపాణి అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.


పోలీసులను ప్రత్యేక కేటగిరిగా భావించి ఐదేళ్లలో కోర్సు పూర్తి చేయించి డిగ్రీలు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు చదువు కోసం సెలవులు పెట్టకుండా పోలీసు ట్రైనింగ్‌ సెంటర్లలో అంబేద్కర్‌ యూనివర్సిటీ తరఫున స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. డీజీపీ జితేందర్‌ మాట్లాడుతూ దాదాపు 30వేల మంది పోలీసులు ఇంటర్‌తోనే చదువు ఆపేసి పోలీసు ఉద్యోగంలో చేరారని, వీరంతా విధులు నిర్వహిస్తూనే డిగ్రీ పూర్తి చేసుకోవచ్చని చెప్పారు. తద్వారా పదోన్నతులకు అవకాశం ఉంటుందన్నారు. ఔటర్‌ పోలీసింగ్‌, నూతన చట్టాలు, సైబర్‌ క్రైమ్స్‌, ట్రాఫిక్‌ తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందిస్తామని యూనివర్సిటీ అధికారులు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

Updated Date - Aug 15 , 2025 | 03:35 AM