Share News

Ponguleti: వచ్చే 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి!

ABN , Publish Date - Aug 15 , 2025 | 04:48 AM

వచ్చే 24 గంటల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అధికారులను ఆదేశించారు.

Ponguleti: వచ్చే 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి!

  • సహాయ చర్యల కోసం జిల్లాకు కోటి

  • 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకాధికారులు

  • సిబ్బంది సెలవుల రద్దు: పొంగులేటి

హైదరాబాద్‌ , ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వచ్చే 24 గంటల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వరద సహాయ చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాబోయే 24 గంటల్లో రెడ్‌ అలెర్ట్‌ ఉన్న మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వరద సహాయ చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించినట్లు వివరించారు. అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కి పిలిపించాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, మెట్రో వాటర్‌బోర్డు, ట్రాఫిక్‌ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


జాగృతి జిల్లా అధ్యక్షుల నియామకం: కవిత

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్మాణంలో భాగంగా పలు అనుబంధ విభాగాలతో పాటు 11 జిల్లాలకు అధ్యక్షులను నియమించామని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. 11 జిల్లాలకు అధ్యక్షులను నియమించామని.. వారిలో ఐదుగురు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒకరు ఎస్టీ ఉన్నారని.. అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల నియామకాల్లోనూ సామాజిక న్యాయం పాటించామని పేర్కొన్నారు. జాగృతి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా దూగుంట్ల నరేశ్‌ ప్రజాపతి, అధికార ప్రతినిధిగా నలమాస శ్రీకాంత్‌గౌడ్‌, మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మేక లలితా యాదవ్‌తో పాటు ఇతర విభాగాలకూ పలువురిని నియమించినట్లు కవిత వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

Updated Date - Aug 15 , 2025 | 04:48 AM