Fruit Based Alcohol: మల్లె జిన్.. మామిడి మద్యం!
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:26 AM
ఇదేదో అసాధ్యమని అనుకోకండి! ఇటువంటి మద్యం, జిన్ ఇతర దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది! రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
టమాటాతో వోడ్కా, బీట్‌రూట్, క్యారెట్‌తో లిక్కర్
మందార పువ్వూ ఇకపై మత్తెక్కిస్తుంది
మార్కెట్లోకి పువ్వులు, పండ్లు, కూరగాయల మద్యం
ఇప్పటికే యూర్‌పలో ఆదరణ.. 30 వేల కోట్ల మార్కెట్
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముందుకు ప్రతిపాదనలు.. కసరత్తు
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):
మీరు మందుకొట్టారు! దాని రుచి మీకు ఎంతో ఇష్టమైన మామిడి జ్యూస్‌లా ఉంది! రుచి మాత్రమే కాదు.. వాసన కూడా.. మద్యం వాసన రాకుండా
మామిడి వాసన వస్తే..!?
మీరు జిన్ తీసుకున్నారు! తాగిన తర్వాత కిక్కెక్కించే మందు వాసన కాకుండా కైపెక్కించే మల్లెపూల
వాసన వస్తే..!?
.. ఇదేదో అసాధ్యమని అనుకోకండి! ఇటువంటి మద్యం, జిన్ ఇతర దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది! రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఇటీవల ‘3 క్యుజిన్ ల్యాబ్స్ (ఆర్టిసన్ క్రాఫ్ట్ స్పిరిట్)’ అనే సంస్థ తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమిషనర్‌ను కలిసి ఒక ప్రతిపాదన ఇచ్చింది. టమాటాలు, మామిడి, కర్బూజ, పైనాపిల్.. ఇలా 6రకాల పండ్లతో మద్యం తయారు చేటందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపింది. తాము తయారు చేసిన మద్యం నమూనాలను సదరు కంపెనీ ప్రతినిధులు తీసుకొచ్చి అధికారులకు చూపారు. దాంతో, ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ విధానంలో ఈ తరహా తయారీదారులకు వర్తించే నిబంధనలు, అనుమతులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పండ్లు,పూలతో మద్యం తయారీకి కంపెనీలు ముందుకొస్తే అనుమతుల విషయంలో ఎలాం టి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై చర్చిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల కేరళలో కేఎ్‌సఆర్టీసీ బస్సుడ్రైవర్లు మిగల ముగ్గిన పనస తొనలు తిన్నారు. తనిఖీల్లో భాగంగా పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో పరిశీలిస్తే మద్యం తాగినట్లు చూపించింది. తాము మద్యం తాగలేదని, పనస తొనలే తిన్నామని వారు వాదించారు. దాంతో, పోలీసులు మరో వ్యక్తికి కూడా పనస తొనలు తినిపించి పరిశీలించారు. అతనికి కూడా మద్యం తాగినట్లు పాజిటివ్ వచ్చింది. ఇందుకు కారణం మిగల ముగ్గిన ఆ పండులో సహజసిద్ధంగా ఫెర్మెంటైన చక్కెరలు ఉండడమేనని గుర్తించారు. ఇప్పుడు పనస పళ్లతో మద్యం తయారు చేశారనుకోండి. పనస తొనలు తిన్నట్లు వాసన వస్తుంది.. మద్యం తాగినట్లు పాజిటివ్ చూపిస్తుంది! అప్పుడు అతను పనస తొనలే తిన్నానని అంటే పోలీసులు ఏం చేయాలి మరి!? ఇటువంటి సమస్యల పరిష్కారం దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

పూలతో మత్తెక్కించే పానీయాల తయారీ
పూల ఆధారిత మద్యం తయారీకి అంతర్జాతీయ మార్కెట్‌లో ఆదరణ పెరుగుతోంది. స్కాట్లండ్, ఎస్తోనియా, దక్షిణాఫ్రికా, స్పెయిన్ తదితర దేశాల్లో పూల తో తయారు చేసిన మద్యం బ్రాండ్లు కనిపిస్తాయి. యూరప్ దేశాల్లో పూల మద్యం అమ్మకాలు క్రమేణా పెరుగుతున్నాయి. ఫ్లోరల్ జిన్‌కు ప్రత్యేకంగా బార్లూ పెరుగుతున్నాయి. ఎస్తోనియాలో క్రాఫ్టర్ ఆరోమాటిక్ ఫ్లవర్ జిన్ అనే సంస్థ గులాబీ, లావెండర్ (లామియాసి లేదా పుదీనా కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క), ఎల్డర్ ఫ్లవర్ (బూరుగు పువ్వు, లేదా జాజి పువ్వు) నుంచి జిన్ తయారు చేసి 20 దేశాలకు ఎగుమతి చేస్తోంది. స్పెయిన్‌కు చెందిన ఓ కంపెనీ పూల తో తయారైన జిన్‌ను 13 దేశాలకు ఎగుమతి చేస్తుండగా, ఫిన్‌ల్యాండ్, స్కాట్లండ్‌లో పూల జిన్‌కు ప్రాధా న్యం పెరుగుతోంది. స్కాట్లండ్‌కు చెందిన ద బొటానిస్ట్ సంస్థ స్థానికంగా సేకరించే పూల, చెట్టు బెరడు, సుగంధ ద్రవ్యాలు, విత్తనాల నుంచి 22 రకాల జిన్‌ను తయారు చేస్తోంది. జపాన్‌లో చెర్రీ బ్లోసమ్ జిన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇటలీలో హైబిస్కస్ (మందార), అరెంజ్ జిన్‌కు ఎక్కువ ఆదరణ ఉంది.
రైతులకు అదనపు ఆదాయం
పూలు, పండ్లు, కూరగాయల రైతులకు ఈ కొత్త తరహా మద్యం కొత్త మార్కెట్ అవకాశాలను కల్పించనుంది. పూల తోటల్లో నష్టాలు మూటకట్టుకునే రైతులకు మద్యం కంపెనీలు కొత్త ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో టమాటా, మామిడి వంటి పండ్లు, పూల దిగుబడి అధికంగా ఉన్నందున.. వీటి ఆధారంగా తయారు చేసే మద్యం పరిశ్రమలు వస్తే రైతులకు మంచి లాభాలు అందే అవకాశం ఉంది.
ఏమిటీ పూలు, పండ్ల మద్యం
సాధారణంగా మద్యాన్ని ద్రాక్షరసం, బార్లీ తదితరాలతో తయారు చేస్తారు. ఇప్పుడు కొత్త ప్రయోగాలు మద్యం ప్రపంచంలో నూతన విప్లవానికి నాందిపలుకుతున్నాయి. పూలతో జిన్, పండ్లతో లిక్కర్ తయారు చేసేందుకు పరిశ్రమలు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకూ మందు కొడితే మద్యం వాసన వచ్చేది. కానీ, ఇకనుంచి మద్యం తాగినా సదరు పూలు, పండ్ల వాసనే మత్తెక్కించనుంది. మల్లెలు, లావెండర్లు, గులాబీ, మందారం, చెర్రీ బ్లాసమ్ తదితర పువ్వులతో తయారైన జిన్.. మామిడి, పైనాపిల్, పనస, టమాటా తదితర పండ్లతో తయారైన మద్యం మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించనున్నాయి. ఒక గ్లాసులో మల్లెపూల వాసన.. మరో గ్లాసులో మామిడి రుచి బార్లలో కొత్త విప్లవాన్ని సృష్టించనున్నాయి. పూల రేకులతో తయారైన ఫ్లోరో జిన్ మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే ఇంగ్లాండ్, జపాన్, స్కాట్లాండ్, ఇటలీ వంటి దేశా ల్లో ఈ తరహా మద్యం మార్కెట్‌లో హల్‌చల్ చేస్తోంది. త్వరలోనే రాష్ట్రంలోనూ దీని రుచులు పంచేందుకు తయారీదారులు పోటీ పడుతున్నారు. కగర్ నివేదిక ప్రకారం.. పండ్లు, పూలతో తయారు చేసిన లిక్కర్ మార్కెట్ 2023లో 3.4 బిలియన్ డాలర్లు (రూ.30 వేల కోట్లు) ఉండగా.. 2032 నాటికి ఇది 5.8 బిలియన్ డాలర్ల (రూ.50 వేల కోట్లు)కు పెరుగుతుందనే అంచనాలున్నా యి. ఇప్పుడున్న మద్యం బ్రాండ్ల స్థానంలో.. భవిష్యత్తులో పూలు, పండ్లు, కూరగాయలతో తయారయ్యే మద్యం అమ్మకాలు 5-6 శాతం అదనంగా పెరుగుతాయని కగర్ తన నివేదికలో పేర్కొంది.
పండ్లు, కూరగాయలతో లిక్కర్
మామిడి, పైనాపిల్, పుచ్చకాయ, పనస, టమాటా, బీట్‌రూట్, క్యారెట్ తదితరాలతో తయారవుతున్న లిక్కర్‌కు మార్కెట్‌లో ఆదరణ పెరుగుతోంది. స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో టమాటా వోడ్కా విక్రయాలు ఉన్నాయి. టమాటా వాసన (అరోమా) దెబ్బతినకుండా.. మద్యం వాసన లేకుండా ఉండటం దీని ప్రత్యేకత. ఇండియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లో మామిడితో మద్యం తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. బ్రెజిల్, హవాయి ప్రాంతాల్లో పైనాపిల్ మద్యానికి ఆదరణ ఉంది. కేరళ, శ్రీలంక నుంచి పనస లిక్కర్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అమెరికా, మెక్సికోల్లో పుచ్చకాయ ద్వారా తయారు చేసే మద్యానికి మంచి గుర్తింపు ఉంది. అక్కడ వేసవిలో ఎక్కువ విక్రయించే మద్యం బ్రాండ్లలో ఇది కూడా ఒకటి. అంతేనా.. పువ్వులు, పండ్లు, కూరగాయలతో తయారు చేసే మద్యంలో వాటి సహజ వాసనలను కోల్పోకుండా తయారు చేసి మద్యం ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ప్రతి దేశంలో స్థానికంగా దొరికే రకరకాల పూలను జిన్ తయారీకి వినియోగిస్తున్నారు. ఇందులో ఆల్కహాల్ శాతం 18 నుంచి 38 శాతం వరకు ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం
రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..