Union Budget: రాష్ట్రానికి మళ్లీ మొండిచెయ్యే!
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:50 AM
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మళ్లీ మొండిచెయ్యే ఎదురైంది. హైదరాబాద్ చుట్టుపక్కల చేపట్టనున్న ప్రాజెక్టులు.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాఽధాన్యమైన ప్రాజెక్టులకు నిధులు, అనుమతుల మంజూరు కోరుతూ ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసినా దేనికీ నిధులివ్వలేదు.
బడ్జెట్‌లో పైసా విదల్చని కేంద్రం.. గ్రాంట్లనూ కేటాయించని వైనం
మూసీ, మెట్రోలకు నిధుల్లేవు
విభజన హామీలు.. గిరిజన వర్సిటీ, స్టీల్‌ప్లాంట్, కోచ్ ఫ్యాక్టరీ తూచ్
హైదరాబాద్- మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ హైవేను పట్టించుకోనేలేదు
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి వినతులు బుట్టదాఖలు
ప్రతిష్ఠాత్మక ఫోర్త్ సిటీకి ‘అర్బన్ చాలెంజ్ ఫండ్’ మీదనే ఆశలన్నీ
హైదరాబాద్, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మళ్లీ మొండిచెయ్యే ఎదురైంది. హైదరాబాద్ చుట్టుపక్కల చేపట్టనున్న ప్రాజెక్టులు.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాఽధాన్యమైన ప్రాజెక్టులకు నిధులు, అనుమతుల మంజూరు కోరుతూ ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసినా దేనికీ నిధులివ్వలేదు. గోదావరి బేసిన్‌లోని మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీలను మూసీకి తరలించడానికి ‘గోదావరి-మూసీ అనుసంధాన’ ప్రాజెక్టుకు ప్రత్యేక గ్రాంటు కింద రూ.7,440 కోట్లు అడిగినా కనికరించలేదు. మెట్రో రైలు రెండో దశ కింద రూ.24,269 కోట్లతో 76.4 కిలోమీటర్ల పొడవుతో ఐదు కారిడార్ల నిర్మాణానికి నిధుల మంజూరును పట్టించుకోలేదు. ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 60 శాతం నిధులివ్వాలని విన్నవించినా దాని ఊసెత్తలేదు. మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ.14,100 కోట్లు, రీజినల్ రింగు రోడ్డుకు రూ.34,367 కోట్లు, ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు మధ్య నిర్మించే 10 గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లకు రూ.45 వేల కోట్లు అవసరమని వివరించినా కేంద్రం పైసా విదల్చలేదు.
హైదరాబాద్‌తో పాటు సమీప 27 మున్సిపాలిటీల్లో 7,444 కి.మీ. మేర సీవరేజీ నెట్‌వర్క్ అభివృద్ధికి ‘సమీకృత మురుగు నీటి మాస్టర్ ప్లాన్’ (సీఎ్‌సఎంపీ) రూపొందించామని, రూ.17,212 కోట్లు ఇవ్వాలని, వరంగల్‌లో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ అభివృద్ధికి రూ.4,170 కోట్లు కావాలని ప్రతిపాదించినా కేంద్రం పక్కనపెట్టింది. ఏపీలోని బందరు పోర్టు నుంచి హైదరాబాద్ డ్రై పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి రూ.17 వేల కోట్లు కోరినా పట్టించుకోలేదు. తెలుగు రాష్ట్రాలను కలిపే ఇంతటి ప్రాధాన్యమైన హైవేను విస్మరించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ‘వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి’ కింద 9 పాత ఉమ్మడి జిల్లాలకు పెండింగ్‌లో ఉన్న రూ.1,350 కోట్లను ఇవ్వాలని అడిగినా కేంద్రం పెడచెవిన పెట్టింది. ఐఐటీ, ఐఐఎం, జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్లను ప్రతి బడ్జెట్ సందర్భంగా కోరుతున్నా ఈసారీ నిరాశే మిగిలింది. కరీంనగర్, జనగామ జిల్లాల్లో లెదర్ పార్కులు, హైదరాబాద్- విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం, హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు తుది అనుమతుల మంజూరునూ విస్మరించారు.
విభజన చట్టం ప్రకారం కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అడిగినా కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వహించింది. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి సిఫారసు చేసిన రూ.2,233 కోట్లను కేటాయించాలని అడిగినా పట్టించుకోలేదు. హైదరాబాద్‌కు నేషనల్ డిజైన్ సెంటర్(ఎన్‌ఐడీ), జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం(ఐఐహెచ్‌టీ) మంజూరును కోరినా స్పందించలేదు. గిరిజన రైతులకు నిరంతరం సాగు నీటిని అందించేందుకు వీలుగా ‘పీఎం కుసుమ్’ పథకం కింద లక్ష సౌర పంపులు కేటాయించాలని కోరింది. కాగా, తెలంగాణకు గ్రాంట్ల కింద రూ.1,63,559 కోట్లను కేటాయించాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా, కేంద్రం చిన్నచూపు చూసిందని, పక్షపాత వైఖరికి ఇది నిదర్శనమని ప్రభుత్వ పెద్దలు, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫోర్త్ సిటీకి నిధులొస్తాయా?
నగరాలను వృద్ధి కేంద్రాలుగా (గ్రోత్ హబ్స్) అభివృద్ధి చేసేందుకు ‘అర్బన్ చాలెంజ్ ఫండ్’ కింద తాజా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల రూ.లక్ష కోట్లను కేటాయించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ శివారులో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీనికి కనీసం అర్బన్ చాలెంజ్ ఫండ్ కిందనైనా నిధులొస్తాయని ఆశలు రేగుతున్నాయి. మూలధన వ్యయం, సంస్కరణలకు ప్రోత్సాహకాల స్కీమ్ కింద కేంద్రం బడ్జెట్‌లో రూ.1,50,000 కోట్లను కేటాయించింది. దీనికింద రాష్ట్రాలకు 50 ఏళ్ల కాల వ్యవధితో వడ్డీ లేని రుణాలను అందిస్తుంది. ఇందులో ఏమైనా సహకారం లభిస్తుందేమోనని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.
ఇవీ చదవండి:
సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్
ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి