Share News

Leader Program: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ కార్యక్రమం.. టార్గెట్ యూత్

ABN , Publish Date - Jun 15 , 2025 | 04:11 PM

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ కార్యక్రమం ప్రారంభమైంది. యువతలో నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో దీనిని ఆరంభించినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Leader Program: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ కార్యక్రమం.. టార్గెట్ యూత్
Leader Program Kavitha

హైదరాబాద్: తెలంగాణ యువత, మహిళలకు రాజకీయ శిక్షణ అందించేందుకు తెలంగాణ జాగృతి 'లీడర్' కార్యక్రమాన్ని (Leader Program) ప్రారంభించింది. యువతను రాజకీయాల్లోకి రప్పించి, సమాజంలో మార్పు తీసుకురావడానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని తెలిపారు. రాజకీయాల్లోకి యువత రావడం ద్వారా స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.


ప్రశ్నించే తత్వానికి ప్రాధాన్యం

తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించే తత్వం అని కవిత పేర్కొన్నారు. ప్రశ్నించే తత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో ప్రశ్నించే ఆలోచనలను ప్రోత్సహించడం ముఖ్యమని స్పష్టం చేశారు కవిత. దీని కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ నెల మూడు రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించబడతాయన్నారు. జులైలో హైదరాబాద్‌లో ప్రారంభించి, ఆగస్టు నుంచి జిల్లాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంపై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనాలని కవిత కోరారు. ఇది ఒక నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుందని ఆమె వెల్లడించారు.


ప్రజాప్రతినిధుల విధులు

సర్పంచ్ నుంచి మొదలుకుని ఎమ్మెల్యే, ఎంపీ వంటి ప్రజాప్రతినిధుల విధులు, పరిధి, పరిమితులు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజాసమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం, అభివృద్ధికి నిధులు సాధించడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజాసేవ చేయాలన్న సంకల్పం ఉంటే అన్ని దారులు ప్రజాసంక్షేమం వైపు వెళ్తాయని ఆమె అన్నారు.


యువత పాత్ర

యువత, మహిళలు, తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రతీ ఒక్క నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నామని కవిత పేర్కొన్నారు. చేసే పోరాటాలకు కూడా ఫలితం వచ్చే రోజు వస్తుందని ఆమె చెప్పారు. మహిళా రిజర్వేషన్ల చట్టం వచ్చినందున.. రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో 33 శాతం మహిళా అభ్యర్థుల నాయకులు కావాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేశారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 153కు పెరుగుతాయని, లోక్ సభ సీట్లు కూడా పెరుగుతాయని అన్నారు. కాబట్టి, మనం నాయకులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకూ ఉద్యమిస్తామని వెల్లడించారు కవిత.


ఈ వార్తలు కూడా చదవండి..

సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..


For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 05:35 PM