High Court Judges: హైకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జిలు!
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:28 AM
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు నియామకం కానున్నారు. హైకోర్టు న్యాయవాదులు గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్‌లను హైకోర్టు జడ్జిలుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
సుద్దాల చలపతిరావు, గౌస్ మీరా మొహియుద్దీన్, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్
ఇప్పటివరకు న్యాయవాదులుగా హైకోర్టులో సేవలు
కేంద్రానికి పేర్లు సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
ఏపీ సహా మరో 4 రాష్ట్రాలకూ కొత్త న్యాయమూర్తులు
హైదరాబాద్/న్యూఢిల్లీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు నియామకం కానున్నారు. హైకోర్టు న్యాయవాదులు గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్‌లను హైకోర్టు జడ్జిలుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే ఏపీ సహా మరో నాలుగు రాష్ట్రాల హైకోర్టులకూ న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత వీరు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టులో 42 మంది జడ్జిలు ఉండాలి. ప్రస్తుతం 26 మంది ఉన్నారు. కొత్తగా నలుగురిని నియమిస్తే ఈ సంఖ్య 30కి చేరనుంది.
గౌస్ మీరా మొహియుద్దీన్: హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన గౌస్ మీరా మొహియుద్దీన్ 1969లో జన్మించారు. 1993లో ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేయడంతోపాటు ప్రత్యేక తెలంగాణ హైకోర్టు ఏర్పడిన తర్వాత తెలంగాణ బార్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా ఇప్పటివరకు కొనసాగుతున్నారు.
సుద్దాల చలపతిరావు: జనగామకు చెందిన సుద్దాల చలపతిరావు 1971 జూన్ 25న జన్మించారు. ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్‌లో 1998లో న్యాయవాదిగా నమోదు చేసుకున్న ఆయన.. న్యాయవాది వై.రామారావు చాంబర్స్‌లో జూనియర్‌గా 2004 వరకు పనిచేశారు. హైకోర్టు, రంగారెడ్డి, సిటీసివిల్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సహా పలు సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు.
వాకిటి రామకృష్ణారెడ్డి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో 1970 సెప్టెంబరు 14న జన్మించారు. బీకాం, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన ఆయన 1997లో న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాది ఎ.అనంతారెడ్డి ఆఫీ్‌సలో జూనియర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2005 నుంచి సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు, ఆ తర్వాత తెలంగాణ, ఏపీ హైకోర్టులు, సిటీసివిల్, రంగారెడ్డి, సికింద్రాబాద్ కోర్టుల్లో వకాలత్ చేశారు. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ప్రాతినిధ్యం వహించిన ఆయన ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరఫు న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
గాడి ప్రవీణ్‌కుమార్: నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 1971లో జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశారు. ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్‌లో 1998లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, హోం, కార్మిక, ఉపాధి శాఖల తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఈడీ, ఇండియా మింట్, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఒక న్యాయమూర్తి
ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకానికి సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టుకు తుహిన్ కుమార్ నియామకానికి సిఫారసు చేసింది. అలాగే ఢిల్లీ హైకోర్టుకు ఇద్దరు న్యాయాధికారులు; రాజస్థాన్ హైకోర్టుకు న్యాయవాది అనురూప్ సింఘీ, ఓ జ్యుడీషియల్ అధికారిని; మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఐదుగురు జ్యుడీషియల్ అధికారులను; పంజాబ్-హరియాణాకు పదిమంది జ్యుడీషియల్ అధికారులను సిఫారసు చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి
రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..
తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్
టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్
Read latest Telangana News And Telugu News