Share News

High Court: ఆ కాలేజీల్లో ఫీజులపై.. 6 వారాల్లో తేల్చండి

ABN , Publish Date - Jul 12 , 2025 | 03:25 AM

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలు ఫీజులు పెంచుకోవడానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

High Court: ఆ కాలేజీల్లో ఫీజులపై.. 6 వారాల్లో తేల్చండి

  • పిటిషన్‌ వేసిన ఇంజనీరింగ్‌

  • కాలేజీల ప్రతిపాదనలు పరిశీలించండి

  • కొత్త ఫీజులను ప్రభుత్వానికి తెలపండి

  • టీఏఎ్‌ఫఆర్సీకి హైకోర్టు ఆదేశం

  • ఫీజులు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న కాలేజీల విజ్ఞప్తి తిరస్కరణ

  • ప్రస్తుతానికి పాత ఫీజులే

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలు ఫీజులు పెంచుకోవడానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే కోర్టును ఆశ్రయించిన కాలేజీలు అందజేసిన ప్రతిపాదనలను పరిశీలించి, ఆరు వారాల్లో కొత్త ఫీజులను ఖరారు చేయాలని తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ)ని ఆదేశించింది. కొత్త ఫీజుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని పేర్కొంది. ప్రస్తుతానికి పాత ఫీజులు వసూలు చేసుకోవచ్చని, అయితే సదరు ఫీజులు హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని విద్యార్థులకు చెప్పాలని టీజీఈఏపీసెట్‌ కన్వీనర్‌ను ఆదేశించింది. ఈ కోర్టు కేసులకు సంబంధించిన వివరాలతో కూడిన సర్క్యులర్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని సూచించింది. బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ తదితర వృత్తివిద్యా కోర్సుల ఫీజులు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, గోకరాజు గంగరాజు కాలేజీ సహా దాదాపు పది కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. కాలేజీల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టీఏఎ్‌ఫఆర్సీ ఫీజులను నిర్ధారించినప్పటికీ.. ప్రభుత్వం వాటిని నోటిఫై చేయకుండా పాత ఫీజులను కొనసాగిస్తూ జారీ చేసిన జీవో 26 చెల్లదని పేర్కొన్నారు. టీఏఎ్‌ఫఆర్సీ చట్టబద్ధమైన సంస్థ అని, అది నిర్ధారించిన ఫీజులను ఆమోదించాల్సిందేనని వాదించారు. దీనికి సంబంధించి పలు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వివరించారు.


విద్యార్థులపై తీవ్ర భారం పడుతుంది..

ఇక టీఏఎ్‌ఫఆర్సీ, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పాత ఫీజులే కొనసాగించాలంటూ జారీ చేసిన జీవోలో దోషమేదీ లేదని తెలిపారు. కాలేజీలు ఏకంగా 70శాతం నుంచి 90 శాతం వరకు ఫీజులు పెంచాలని కోరుతున్నాయని, దానివల్ల విద్యార్థులపై తీవ్ర భారం పడుతుందని వివరించారు. రాష్ట్రంలో బీటెక్‌ కోర్సుల్లో దాదాపు లక్షా ఆరువేల మంది, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో దాదాపు 33 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతారని.. వారి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని విన్నవించారు. కాలేజీలు సమర్పించిన ప్రతిపాదనలపై మార్చి నెలలో పరిశీలన చేపట్టామని.. ఆ ప్రతిపాదనల్లో వాస్తవ విరుద్ధమైన అంశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ అంశాలన్నీ పరిశీలించాకే పాత ఫీజులు కొనసాగించాలంటూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లు వేసిన కాలేజీల ప్రతిపాదనలను పరిశీలించి, ఆరువారాల్లో ఫీజులు నిర్ధారించాలని టీఏఎ్‌ఫఆర్సీని ఆదేశించింది. మరోవైపు ఫీజులు పెంచుకోవడానికి సీబీఐటీ కాలేజీకి అనుమతిస్తూ మరో సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్‌ వేస్తామని టీఏఎ్‌ఫఆర్సీ న్యాయవాది తెలిపారు. కాగా, ఫీజులు పెంచుకోవడానికి సింగిల్‌ జడ్జి అనుమతి ఇవ్వకపోవడంపై డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేయాలని ఇంజనీరింగ్‌ కాలేజీలు భావిస్తున్నట్టు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!

అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు

For Telangana News And Telugu News

Updated Date - Jul 12 , 2025 | 03:25 AM