High Court: సెటిల్‌మెంట్ అడ్డాలుగా పోలీస్‌స్టేషన్లు!
ABN , Publish Date - Jul 02 , 2025 | 03:44 AM
రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లుసెటిల్‌మెంట్ దందాలకు అడ్డాలుగా మారుతున్నాయని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖలో ఈ ట్రెండ్ పెరిగిపోయిందని, ప్రస్తుతం ఉధృతంగా మారి పతాక స్థాయికి చేరిందని వ్యాఖ్యానించింది.
రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ట్రెండ్ పెరిగిపోయింది
ప్రస్తుతం ఉధృతంగా మారి పతాకస్థాయికి..
కోర్టు ఉత్తర్వుల్ని సైతం లెక్క చేయట్లేదని
పోలీసులపై పిటిషన్లు వస్తున్నాయి
సివిల్ కేసు సెటిల్ చేసుకోవాలని పౌరుడిని స్టేషన్‌లో నిర్బంధించడమేంటి?
నాగోల్ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
ఎస్‌వోపీ రూపొందించాలని డీజీపీకి ఆదేశం
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లుసెటిల్‌మెంట్ దందాలకు అడ్డాలుగా మారుతున్నాయని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖలో ఈ ట్రెండ్ పెరిగిపోయిందని, ప్రస్తుతం ఉధృతంగా మారి పతాక స్థాయికి చేరిందని వ్యాఖ్యానించింది. సివిల్ కోర్టులు ఇంజంక్షన్ ఆర్డర్‌లు ఇచ్చినప్పటికీ కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా పోలీసులు జోక్యం చేసుకుంటున్నారనే ఫిర్యాదులతో ఎక్కువ పిటిషన్‌లు దాఖలవుతున్నాయని ప్రస్తావించింది. ఆస్తి వివాదాలతో వచ్చే కక్షిదారులకు సివిల్ కోర్టుకు వెళ్లి విషయాన్ని పరిష్కరించుకోవాలని పోలీసులు చెప్పాలని స్పష్టం చేసింది. బలప్రయోగంతో సెటిల్‌మెంట్లు చేయడం, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఎన్ని దశాబ్దాలుగా భూమి స్వాధీనంలో ఉన్నా సరైన హక్కు పత్రాలు లేకపోతే సదరు ఆస్తిపై ఎలాంటి హక్కులు దఖలు పడవు అని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. నాగోల్ సర్కిల్ బండ్లగూడ కృషినగర్‌లో ఉన్న తన ప్లాట్ నెంబర్ 65కి సంబంధించిన వివాదాన్ని రూ.55 లక్షలకు రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో సెటిల్ చేసుకోవాలని నాగోల్ పోలీసులు తనను నిర్బంధించారని పాము సుదర్శనం హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. తాజా కోర్టు తీర్పులకు అనుగుణంగా పోలీస్ స్టేషన్లలో అనుసరించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎ్‌సవోపీ)ను మళ్లీ రూపొందించాలని డీజీపీకి ధర్మాసనం సూచించింది. సదరు ఎస్‌వోపీలను వెబ్‌సైట్లలో, ప్రతి ఠాణాలో ప్రదర్శించాలని, తద్వారా ప్రజలు ఏయే అంశాలపై ఫిర్యాదు చేయవచ్చో తెలుసుకుంటారని పేర్కొంది. అలాగే ప్రస్తుత కేసులో పిటిషనర్‌కు సంబంధించిన సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని, నిర్బంధించిన వ్యవహారంలో వర్చువల్‌గా హాజరైన రాచకొండ సీపీ సుధీర్‌బాబు, ప్రత్యక్షంగా హాజరైన నాగోల్ ఠాణా ఎస్‌హెచ్‌వోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్‌ను జూన్ 19న ఠాణాలో నిర్బంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను సమర్పించాలని ఆదేశించింది. సదరు ప్లాట్ వివాదంపై మూడు సివిల్ కేసులు పెండింగ్‌లో ఉండటంతోపాటు ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ పిటిషనర్ ఆస్తిని అవతలి పక్షం డిమాండ్ చేస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం చేసింది. తప్పుడు పత్రాలతో ఆస్తిని క్లెయిం చేస్తున్నాడని పిటిషనర్‌పైనే కేసు పెట్టడం అక్రమమని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులకు పోలీసులు తమకు ఇష్టం వచ్చిన భాష్యం అన్వయించుకుంటూ సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా మారుస్తున్నారని ధ్వజమెత్తింది. కేసు కోర్టులో ఉన్న తర్వాత పొజిషన్‌లో ఎవరున్నారనే విషయాన్ని పోలీసులు ఎలా నిర్ధారిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.
ఇవి కూడా చదవండి:
ఉగ్రవాదులు అరెస్ట్.. ఉలిక్కిపడ్డ రాష్ట్రం
వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్
బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..
For More Telangana News and Telugu News