Fertility Centers: ఫర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు!
ABN , Publish Date - Jul 29 , 2025 | 04:40 AM
సరగసీ ముసుగులో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ శిశువిక్రయానికి పాల్పడిన అంశాన్ని వైద్య ఆరోగ్య శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సర్కారు ఆదేశించిన నేపథ్యంలో..
‘సృష్టి’ ఘటన నేపథ్యంలో సర్కారు సీరియస్.. రాష్ట్రవ్యాప్తంగా 292 కేంద్రాలు.. గ్రేటర్ పరిధిలోనే 213
హైదరాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): సరగసీ ముసుగులో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ శిశువిక్రయానికి పాల్పడిన అంశాన్ని వైద్య ఆరోగ్య శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సర్కారు ఆదేశించిన నేపథ్యంలో.. ఆ శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంతాన సాఫల్య కేంద్రాల్లో తనిఖీలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలోని 18 జిల్లాల్లో 292 ఆర్ట్ (అసిస్టెడ్ రీప్రోడక్టివ్ టెక్నాలజీ), సరొగసీ కేంద్రాలున్నాయి. వీటిలో ఆర్ట్ లెవల్ వన్‌లో 64 కేంద్రాలుండగా, లెవల్ టూలో 141, ఆర్ట్ బ్యాంకులో 45, సరగసి క్లినిక్స్ 42 ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే ఆర్ట్, సరగసీ కేంద్రాలు అత్యధికంగా 126 ఉండగా.. రంగారెడ్డిలో47, మేడ్చల్‌లో 40, వరంగల్ అర్బన్‌లో 27, కరీంనగర్‌లో 13, ఖమ్మం, నిజామాబాద్‌లో ఎనిమిదేసి చొప్పున ఉన్నాయి. మిగిలిన 11 జిల్లాల్లో 23 కేంద్రాలున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయ గణాంకాలు చెబుతున్నాయి. ఫర్టిలిటీ కేంద్రాల అనుమతులు 2022 ముందు వరకూ జిల్లా వైద్యాధికారి పరిధిలో ఉండేవి. ఆ తర్వాత సరగసీ చట్టం వచ్చింది. 2022 నుంచి ఇటువంటి కేంద్రాలన్నింటికి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయమే అనుమతులు మంజూరు చేస్తోంది. అనుమతుల కోసం దరఖాస్తు చేసిన కేంద్రాలకు ఆ కార్యాలయమే తనిఖీ బృందాలను పంపుతుంది. ఆ బృందాలు తనిఖీ చేసి కమిషనర్‌కు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఫర్టిలిటీ కేంద్రాలకు అనుమతులు మంజూరు చేస్తారు. అలా అనుమతులు పొందిన కేంద్రాలు ప్రతి నెలా 5లోగా తమ వద్ద ఎన్ని స్కానింగ్స్ జరిగాయో విధిగా నివేదికలు పంపాలి. ప్రతి 3 నెలలకు లేదా ఆరు నెలలకొకమారు తమ వద్ద నిర్వహించిన ఐయూఐ, ఐవీఎఫ్, సరగసీ ప్రొసీజర్ల వివరాలను నివేదిక రూపంలో పంపాలి.
ఇష్టం వచ్చినట్టు..
రాష్ట్రంలోని పలు సంతాన సాఫల్య కేంద్రాలు ప్రభుత్వ అనుమతి లేకుండానే ఇష్టారాజ్యంగా సరగసీ ప్రక్రియ చేపడుతున్నట్టు, ఆ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారమైతే.. వివాహమై ఐదేళ్లు అయినప్పటికీ సహజ పద్ధతిలోగానీ, ఐయూఐ, ఐవీఎఫ్ విధానంలోగానీ సంతానం కలగని దంపతులు మాత్రమే సరగసీ ద్వారా పిల్లలను పొందడానికి అర్హులు. అటువంటి వారు ఆ విధానంలో పిల్లలను పొందడం కోసం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. కమిషనర్ వారి దరఖాస్తులను స్వయంగా పరిశీలిస్తారు. వైద్యులిచ్చిన ధ్రువపత్రం, వారికున్న ఇతరత్రా ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. నిజంగా సరగసీ అవసరమే అని నిర్ధారించుకున్న తర్వాత అందుకు అనుమతిస్తారు. నిబంధనల ప్రకారం.. సరగేట్ మదర్ (అంటే పిల్లల్లేని దంపతులకు తన గర్భాన్ని అద్దెకు ఇచ్చే తల్లి) వారికి సమీప బంధువు అయి ఉండాలి. ఆమె కూడా 25-35 ఏళ్లలోపు వయసున్న మహిళ అయి ఉండాలి. ఆమెకు అప్పటికే సొంత బిడ్డ ఒకరైనా ఉండాలి. అలాంటివారే సరొగేట్ మదర్‌గా ఉండడానికి అర్హులు. అంతేకాదు.. ఒక మహిళ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే సరగేట్ మదర్‌గా ఉండడానికి అర్హురాలు. డబ్బులిచ్చి బయటి వ్యక్తులను సరగేట్ మదర్‌ను నియమించుకుంటామంటే కుదరదు.
అడ్డగోలుగా అనుమతులు..
నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ.. తనిఖీలకు వెళ్లిన అధికారులు, పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుని వాటికి అనుకూలంగా నివేదికలిచ్చినట్టు.. ఆ నివేదికల ఆధారంగా గత దశాబ్ద కాలంలో పలు కేంద్రాలకు అనుమతులు మంజూరైనట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఒకరిద్దరు మహిళా అధికారులు ఇటువంటి కేంద్రాలకు అనుకూలంగా నివేదికలిచ్చేందుకు ప్రతిఫలంగా చీరలు, బంగారం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల సుమారు కొత్తగా 16 కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ కుటుంబ సంక్షేమ కమిషనర్ సంగీతా సత్యనారాయణ వద్దకు రాగా.. ఆ కేంద్రాలకు ఒక్కరే అధికారి వెళ్లి తనిఖీలు చేసి నివేదిక ఇచ్చినట్లు తేలింది. ఒక్క ఆఫీసరే ఎలా వెళ్తారని కమిషనర్ ప్రశ్నించినట్లు.. ఆ 16 కేంద్రాల అనుమతులను పక్కనపెట్టి.. మళ్లీ ఇద్దరు సభ్యులతో తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. అనుమతులు పొందిన కేంద్రాలు కాలపరిమితి ముగియగానే రెన్యువల్స్ చేసుకోవాలి. కానీ కొన్ని కేంద్రాలు అలా చేసుకోకుండానే నడుస్తున్నాయి. రెన్యువల్స్ చేసుకున్న వాటినే పరిశీలిస్తున్న వైద్య శాఖ.. మిగిలిన వాటిని పట్టించుకోవట్లేదు. రెన్యువల్ చేసుకోకుండా నడుస్తున్న కేంద్రాలే అక్రమాలకు పాల్పడుతున్నాయి. సృష్టి ఫర్టిలిటీ కేంద్రం కూడా ఇదే బాపతు. ఆ కేంద్రాన్నివైద్య శాఖ నాలుగేళ్ల క్రితమే సీజ్ చేసింది. అయినా ఆ కేంద్రం దందాలను ఆపలేదు. అలాంటి వాటిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
For More National News and Telugu News..