Share News

IAS Committee: ఉద్యోగుల సంఖ్యపై.. సమీక్షకు ఐఏఎస్‌ల కమిటీ

ABN , Publish Date - Jul 10 , 2025 | 03:22 AM

రాష్ట్రంలోని ఉద్యోగుల సంఖ్యపై ప్రభుత్వం దృష్టి సారించింది. శాఖలు, విభాగాలు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలవారీగా సమీక్షించాలని నిర్ణయించింది.

IAS Committee: ఉద్యోగుల సంఖ్యపై.. సమీక్షకు  ఐఏఎస్‌ల కమిటీ

  • ప్రభుత్వ శాఖలు, విభాగాలు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, వర్సిటీల వారీగా పరిశీలన

  • ఇప్పుడున్న ఉద్యోగులెందరు?.. వారి విధుల్లో మార్పులు, చేర్పులు..

  • కొత్త పోస్టుల ఆవశ్యకతపై సమీక్ష.. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ వివరాల సేకరణ

  • 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉద్యోగుల సంఖ్యపై ప్రభుత్వం దృష్టి సారించింది. శాఖలు, విభాగాలు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలవారీగా సమీక్షించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మంజూరైన రెగ్యులర్‌ పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఇంకా మంజూరు చేయాల్సిన పోస్టులు, ప్రభుత్వ అవసరాల మేరకు ఉద్యోగుల విధుల్లో మార్పులు.. వంటి అన్ని అంశాలను సమీక్షించనుంది. ఇందు కోసం ప్రభుత్వం ఐఏఎ్‌సల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌), ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం వైస్‌ చైర్మన్‌ అండ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న ఎ.శాంతికుమారి, విశ్రాంత ఐఏఎస్‌, వేతన సవరణ సంఘం కమిషనర్‌ ఎన్‌.శివశంకర్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా, సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) కార్యదర్శి ఎం.రఘునందన్‌రావులతో ఈ కమిటీని నియమించింది.


ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందంటూ వివిధ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, మల్టీ జోన్ల ఏర్పాటు తర్వాత ఉద్యోగులపై పనిభారం పెరిగిందని ఆరోపిస్తున్నాయి. ఆయా జిల్లాల అవసరాలకు అనుగుణంగా క్యాడర్‌ స్ట్రెంథ్‌ను పెంచాలంటూ చాలాకాలం నుంచి డిమాండ్‌ చేస్తున్నాయి. మొదటి పీఆర్సీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,91,304 పోస్టులు మంజూరయ్యాయి. 2020లో మొదటి పీఆర్సీ సమర్పించిన నివేదిక ప్రకారం.. 3,00,178 పోస్టుల్లోనే రెగ్యులర్‌ ఉద్యోగులు పని చేస్తున్నారని వెల్లడైంది. దాంతో.. ఖాళీల సంఖ్య 1.91 లక్షలుగా తేలింది. అప్పటి నుంచి ఏటా కొందరు ఉద్యోగులు పదవీవిరమణ పొందుతుండగా.. మరికొన్ని పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తోంది. అంటే.. ఈ సంవత్సరం మే నెల 30వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 3,56,135 మంది రెగ్యులర్‌ ఉద్యోగులున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.


ఇంకా 1,35,169 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే మంజూరైన పోస్టులే సరిపోవడం లేదని, కొత్త పోస్టులను మంజూరు చేయాలని సంఘాలు అడుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం ఉద్యోగుల వివరాలను సేకరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు(పీఎ్‌సయూ), స్థానిక సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల్లోని ఉద్యోగులతోపాటు.. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వివరాలను సేకరించి, సమీక్షించే బాధ్యతను ఐఏఎ్‌సల కమిటీకి అప్పగించింది. శాఖల వారీగా ఉద్యోగుల సంఖ్య, మంజూరైన పోస్టులు, ఉద్యోగుల విధుల్లో మార్పులను కమిటీ సమీక్షించనుంది. ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు, విభాగాధిపతులతో చర్చించి, 60 రోజుల్లో నివేదికను తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


కమిటీకి అప్పగించిన విధులివే..

  • ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతులు, కార్పొరేషన్లు, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు(పీఎ్‌సయూ), స్థానిక సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీలు, ఇతర సంస్థలకు మంజూరైన రెగ్యులర్‌ పోస్టులు, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య, వీటిలో కొనసాగించాల్సిన పోస్టులు, ఖాళీల సంఖ్య, కొత్తగా మంజూరు చేయాల్సిన పోస్టులు, మార్పులు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇతరత్రా అవసరాలపై సమీక్షిస్తుంది.

  • కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ వంటి పోస్టులతో పాటు ప్రభుత్వ అనుమతితో తాత్కాలికంగా చేపట్టిన సిబ్బంది నియామకాలపై సమీక్షిస్తుంది.


ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 03:22 AM