CM Revanth Reddy: వరద నష్టంపై 2 రోజుల్లో సమగ్ర నివేదిక
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:09 AM
టీవల భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై రెండ్రోజుల్లో నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆదేశించారు...
4న నివేదికతో ఢిల్లీకి భట్టి విక్రమార్క నేతృత్వంలో బృందం
చెరువుల మరమ్మతులు, సహాయక చర్యలు వేగవంతం
మృతుల కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల పరిహారం
తీవ్ర ప్రభావిత జిల్లాలకు తక్షణ సాయం కింద రూ.10కోట్లు
రాష్ట్రంలో 82 మండలాల్లో 2.36 లక్షల ఎకరాల్లో నష్టం
సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై రెండ్రోజుల్లో నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై సచివాలయంలో సోమవారం సాయంత్రం సీఎం సమీక్ష నిర్వహించారు. వరద నష్టంపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు అత్యవసర పనుల కోసం రూ.10 కోట్లు, సాధారణ నష్టం వాటిల్లిన జిల్లాలకు రూ.5 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయనున్నట్లు సీఎం ఆదేశించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 82 మండలాల్లో 2.36 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని సీఎం దృష్టికి వ్యవసాయ శాఖ అధికారులు తీసుకొచ్చారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 257 చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు వివరించారు. అయితే వర్షాలు, వదరలతో జరిగిన నష్టంపై అన్ని శాఖలవారీగా నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. గత ఏడాది ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ కేంద్రం నుంచి సరైన సాయం అందకపోవడంపై సీఎం ఆరా తీశారు. తాజా నష్టంపై నివేదిక, నిరుడు నష్టంపై ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చకపోవడంపైనా నివేదికను రెండ్రోజులుగా ఇవ్వాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం 4న ఢిల్లీకి వెళ్లి ఈ రెండు నివేదికలను కేంద్ర మంత్రులకు అందజేస్తుందని తెలిపారు. ఇక భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలకు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నీట మునిగిన విద్యుత్తు సబ్‌స్టేషన్ల స్థానంలో అధునాతన పరికరాలతో కొత్త సబ్‌స్టేషన్లను నిర్మించాలని ఆదేశించారు. కామారెడ్డి, ఆదిలాబాద్, సిరిసిల్ల, అసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతో సీఎం మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగానికి కావాల్సిన అధికారులు, సిబ్బందిని వెంటనే సర్దుబాటు చేయాలని సీఎ్‌సను ఆదేశించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు ఉన్నా నిబంధనల ప్రకారం వాటిని ఖర్చు చేయడంలో అలసత్వం చూపుతున్నారంటూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గతంలో నీటి వినియోగదారుల సంఘాల ఆధ్వర్యంలో సంఘాలు ఉండేవని, ఈ సంఘాలకు సంబంధించి నిబంధనలు పరిశీలించి.. మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మునిసిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ, పంచాయతీరాజ్ పరిధిలో వీధి దీపాల నిర్వహణపై సమీక్షించి పరిష్కారాలతో రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. చెంగిచర్ల, జియాగూడ, అంబర్‌పేటలోని స్లాటర్ హౌస్‌లల్లో హలాల్, జట్కా సక్రమంగా జరిగేలా చూడాలని, అధునాతన యంత్రాలు వినియోగించాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, పశుసంవర్ధక శాఖలు సమగ్ర నివేదికలను రెండు రోజుల్లో అందించాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నూతన వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, ఆస్పత్రి భవనాల పనులు వేగవంతం చేసి ప్రారంభోత్సవానికి తేదీలు నిర్ణయించాలనిఅధికారులను ఆదేశించారరు.
అనుమతుల పేరుతో వేధిస్తే కఠిన చర్యలు
బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలలకు సంబంధించి అనుమతుల జారీ విషయంలో జాప్యంపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలో బిల్డ్‌నౌ కింద ఇస్తున్న పనుల అనుమతలపై సోమవారం పురపాలక శాఖ అధికారులతో సమీక్షించారు. బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యునిటీల నిర్మాణం, ఇతర అనుమతల విషయంలో కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా అలసత్వం చూపుతున్నారని సీఎం మండిపడ్డారు. అనుమతుల జాప్యంలో ఆలస్యానికి కారకులను గుర్తించి వారిని సరెండర్ చేయాలని హెచ్‌ఎండీఏ కార్యదర్శి ఇలంబర్తిని ఆదేశించారు. ముఖ్యంగా నీటిపారుదల విభాగం అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయని, వాటిని సహించేదిలేదని హెచ్చరించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులు, నాలాలకు సంబంధించి లైడార్ సర్వేను తక్షణమే చేపట్టాలని సీఎం ఆదేశించారు. అన్ని విభాగల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News