Share News

Red Cross: ఆస్పత్రులపై ‘రెడ్‌ క్రాస్‌’ గుర్తు

ABN , Publish Date - May 09 , 2025 | 03:06 AM

దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తమైంది. ఒకవేళ యుద్ధం జరిగే సమయంలో వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు వైద్య, ఆరోగ్య శాఖ కీలక చర్యలు తీసుకుంటోంది.

Red Cross: ఆస్పత్రులపై ‘రెడ్‌ క్రాస్‌’ గుర్తు

  • యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ సన్నద్ధత

  • జెనీవా ఒప్పందం ప్రకారం రెడ్‌ క్రాస్‌ ఉన్న భవనాలపై దాడి చేయొద్దు

  • రాష్ట్రంలో 164 ఆస్పత్రి భవనాలపై ఏర్పాటు

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తమైంది. ఒకవేళ యుద్ధం జరిగే సమయంలో వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు వైద్య, ఆరోగ్య శాఖ కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా యుద్ధ సమయంలో ఆస్పత్రులపై దాడి జరగకుండా ఉండేందుకు.. ఆస్పత్రి భవనాలపై రెడ్‌క్రాస్‌ గుర్తును పెద్ద సైజులో పెయింటింగ్‌ చేయిస్తున్నారు. ఫలితంగా విమానాలు, జెట్‌లు, డ్రోన్ల ద్వారా ఆస్పత్రులను సులభంగా గుర్తించవచ్చు. జెనీవా ఒప్పందం ప్రకారం ఈ రెడ్‌ క్రాస్‌ గుర్తు ఉన్న భవనాలపై శత్రు దేశాలు దాడి చేయకూడదు. దేశంలో యుద్ధం జరుగుతున్నప్పటికీ.. పౌరులకు, సైనిక సిబ్బందికి అందే వైద్య సేవలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు ఈ మానవతా ఒప్పందం చేసుకున్నాయి.


1949లో జరిగిన ఒప్పందాన్ని ఎవరైనా అతిక్రమిస్తే దానిని యుద్ధ నీతుల ఉల్లంఘనగా పరిగణిస్తారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని 164 ప్రభుత్వ ఆస్పత్రులపై వైద్య, ఆరోగ్య శాఖ రెడ్‌ క్రాస్‌ గుర్తును పెయింటింగ్‌ వేయించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 15 ఆస్పత్రులు, సంగారెడ్డిలో 12 ఆస్పత్రుల్లో పెయింటింగ్‌ పని పూర్తి చేశారు. మరో రెండు రోజుల్లో మిగిలిన అన్ని ఆస్పత్రుల్లో ఈ పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక, యుద్ధ సన్నద్ధత చర్యల్లో భాగంగా.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవులను రద్దు చేసినట్టు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, అన్ని ఆస్పత్రుల్లో మందులు సరిపడా నిల్వ ఉంచుకోవాలని, తెలంగాణ వైద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా అవుతున్న అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 03:06 AM