Education: ‘విద్య’కు రూ.15,396 కోట్ల రుణం!
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:48 AM
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఏడీబీ, ఏఐఐబీ నుంచి సేకరణకు సర్కారు ఏర్పాట్లు
యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం,
విద్యార్థులు-టీచర్లకు శిక్షణ కోసం రూ.5వేల కోట్లు
బడుల్లో మౌలిక సదుపాయాలకు రూ.10,396 కోట్లు
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కార్యక్రమం కింద చర్యలు
విదేశాంగ శాఖ, నీతి ఆయోగ్‌తో చర్చలు
రుణ సేకరణకు అనుమతుల కోసం విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, టీచర్లకు శిక్షణతోపాటు పాఠశాల, ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ)4 కార్యక్రమం కింద ప్రత్యేకంగా రూ.15,396 కోట్లు రుణంగా తీసుకోనున్నట్టు తెలిసింది. ఇందులో యంగ్ ఇండియా గురుకులాల కోసం ఆసియన్ డెవల్‌పమెంట్ బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.5వేల కోట్లు... పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకు (ఏఐఐబీ) నుంచి రూ.10,396 కోట్లు సేకరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ రుణాల సేకరణకు సంబంధించి ఇప్పటికే విదేశాంగ శాఖ, నీతి ఆయోగ్‌లతో ఇప్పటికే చర్చలు జరిపింది. అనుమతుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరింది. గురుకులాల కోసం ఏడీబీ నుంచి తీసుకోబోయే రూ.5వేల కోట్ల రుణానికి సంబంధించి ప్రాథమిక ప్రక్రియ పూర్తయినట్టు తెలిసింది. ఇక రూ.10,396 కోట్ల రుణం ఇచ్చేందుకు ఏఐఐబీ ఆసక్తి వ్యక్తం చేసినా, మిగతా అంశాలపై చర్చలు జరగాల్సి ఉందని సమాచారం. ఈ రుణాలకు సంబంధించి బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటర్‌గా ఉండనున్నట్టు తెలిసింది. ఈ విషయంపైనే విదేశాంగ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్చలు జరిపిందని అధికార వర్గాలు తెలిపాయి.
కేజీబీవీలు, ఇతర పాఠశాలల అభివృద్ధి కోసం..
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏఐఐబీ నుంచి రూ.10,396 కోట్లు రుణం తీసుకోవాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఏఐఐబీతో ప్రాథమిక చర్చలు జరిగాయని, త్వరలోనే స్పష్టత వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. భారీగా తీసుకోనున్న ఈ రుణంతో ఏయే పనులు చేయాలనేదానిపై సర్కారు ఇప్పటికే కసరత్తు చేసింది. రాష్ట్ర్ట్రంలోని 495 కేజీబీవీలలో అవసరాలను బట్టి రెండు విభాగాలు చేసింది. ఒక విభాగంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవసరమైన డార్మిటరీలు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. రెండో విభాగంలో గ్రంథాలయాల ఏర్పాటు, తరగతి గదుల నిర్మాణం, పాత వాటికి మరమ్మతులు చేపట్టనుంది. ఈ పనులకు సుమారు రూ.2,800 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇక రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లను కూడా 1 నుంచి 6 తరగతి వరకు ఒక గ్రూపుగా, ఆపై రెండో గ్రూపుగా విభజించారు. మొదటి గ్రూప్‌లో ఇంగ్లిష్ మీడియం క్లాసుల ఉన్నతీకరణ, ఇతర పనులను.. రెండో గ్రూపులో తరగతి గదుల నిర్మాణంతోపాటు మరికొన్ని సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.2వేల కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కొత్తగా తలపెట్టిన పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) పాఠశాలలకు సుమారు రూ.3వేల కోట్లు అవసరమని భావిస్తున్నారు. మిగతా నిధులతో జిల్లా పరిషత్ బడుల్లో మరుగుదొడ్లు, తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు వంటివి చేపడతారు. దాదాపు 20 వేల బడుల్లో ఇలాంటి పనులు చేయాల్సి ఉందని అంచనా వేశారు.
హబ్ అండ్ స్పోక్ కేంద్రాలుగా..
రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణానికి రూ.21వేల కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకు 78 గురుకులాలను మంజూరు చేయగా.. 76 చోట్ల నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించారు. వీటి నిర్మాణానికి రూ.15,200 కోట్లు అవసరమని అంచనా. ఇందులో తొలిదశ కింద ఏడీబీ నుంచి రూ.5వేల కోట్లు రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణాలకు రూ.3 వేల కోట్లు, విద్యార్థులకు బోధన, టీచర్లకు శిక్షణ సదుపాయాల కల్పన తదితర అంశాల కోసం రూ.2 వేల కోట్లు అవసరమని ఏడీబీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అందజేసింది. ఇక యంగ్ ఇండియా గురుకులాలను ‘హబ్ అండ్ స్పోక్’గా కేంద్రాలుగా సిద్ధం చేసి.. ఇతర పాఠశాలల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందని.. రుణం కోసం ఏడీబీకి ఇచ్చిన ప్రతిపాదనల్లో పేర్కొన్న లక్ష్యం కూడా నెరవేరుతుందని సర్కారు భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
వికసిత్ తెలంగాణ బీజేపీకే సాధ్యం
Read Latest Telangana News And Telugu News