Share News

BC Reservation: బీసీ రిజర్వేషన్ల పెంపు.. క్యాటగిరీల వారీగా!

ABN , Publish Date - Feb 16 , 2025 | 03:30 AM

బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. బీసీ కులాలన్నింటికీ కలిపి గంపగుత్తగా కాకుండా సబ్‌ క్యాటగిరీల వారీగా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

BC Reservation: బీసీ రిజర్వేషన్ల పెంపు.. క్యాటగిరీల వారీగా!

  • గంపగుత్తగా 13 శాతం కాకుండా ఏ, బీ, సీ, డీ, ఈ క్యాటగిరీలకు పెంచే చాన్స్‌

  • అసెంబ్లీలో చట్టం చేయడం ద్వారా అమలు

  • ఎవరైనా కోర్టుకు వెళితే రద్దుకు ఆస్కారం

  • ఇదే చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించి షెడ్యూల్‌ 9లో పెడితే నిలిచే అవకాశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. బీసీ కులాలన్నింటికీ కలిపి గంపగుత్తగా కాకుండా సబ్‌ క్యాటగిరీల వారీగా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 29 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా.. వీటికి అదనంగా మరో 13 శాతం పెంచుతామని ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. మొత్తంగా బీసీలకు ఇంతమేర పెంచామని బిల్లులో పేర్కొంటారా లేక బీసీల్లో ఉన్న ఏ, బీ, సీ, డీ, ఈ.. క్యాటగిరీల వారీగా పెంచుతారా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం న్యాయనిపుణులు, మేధావులు, బీసీ సంఘాల నేతలతో చర్చలు జరుపుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏ, బీ, సీ, డీ, ఈ క్యాటగిరీల వారీగానే రిజర్వేషన్‌ను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీల్లోని ఏ క్యాటగిరీకి 7శాతం, బీ-10, సీ-01, డీ-7, ఈ-క్యాటగిరీకి 4శాతం చొప్పున రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం పెంచబోయే 13 ు రిజర్వేషన్‌ను ఈ క్యాటగిరీలవారీగా ఎంతెంత పెంచబోతుందనే వివరాలను అసెంబ్లీలో పెట్టబోయే బిల్లులో పేర్కొనే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరో అంశం ఉంది. ఇప్పటికే సబ్‌ క్యాటగిరీల వారీగా ఉన్న రిజర్వేషన్లను కూడా సమీక్షిస్తారా, లేక వాటిని అలానే ఉంచి.. అవి ప్రస్తుతం ఏ నిష్పత్తిలో ఉన్నాయో.. వాటి ప్రకారమే పెంచబోయే శాతాన్ని వర్తింపజేస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం బీసీ-ఏ క్యాటగిరీలో ఉన్న కులాలన్నింటికి కలిపి 7శాతం రిజర్వేషన్‌ అమలవుతోంది. దాని నిష్పత్తి ప్రకారమే ఆ సబ్‌క్యాటగిరీకి రిజర్వేషన్‌ పెంచుతారా, లేక ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసింది కాబట్టి అందులో తేలిన వివరాల ప్రకారం సబ్‌ క్యాటగిరీల్లో ఉన్న కులాలకు సంబంధించి జనాభా, వారికి ఇప్పటివరకు దక్కిన అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం, వెనుకబాటుతనాన్ని పరిశీలించి మొత్తంగా మార్పు చేస్తారా.. అన్నది చూడాల్సి ఉంది.


అసెంబ్లీలో ఆమోదించి.. చట్టం చేసినా..

బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయం మేరకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ బిల్లును సభ ఆమోదిస్తే.. దానిపై గవర్నర్‌ సంతకం చేశాక చట్టంగా మారుతుంది. బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కలుగుతుంది. కానీ, మొత్తం రిజర్వేషన్లు 50ు మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఎవరైనా కోర్టుకు వెళితే చట్టం రద్దయ్యేందుకూ అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బిల్లు పెట్టి.. చట్టం చేసి దానిని పార్లమెంటుకు పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. పార్లమెంటులో చట్టాన్ని ఆమోదింపజేసి ఆ వెంటనే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31 ప్రకారం షెడ్యూల్‌ 9లో పొందుపరిచేలా చూడాలని భావిస్తోంది. దీనిని షెడ్యూల్‌-9లో చేరిస్తేనే రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లను పెంచి అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ, రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బిల్లు లేదా చట్టాన్ని పార్లమెంటుకు పంపిన తరువాత దానిపై పార్లమెంటు సమీక్ష చేస్తుంది. ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లను పెంచాలనుకుంటున్న విధానం, విద్య, ఉద్యోగాలతోపాటు వెనకబాటుతనంపై వివరాలన్నింటినీ పరిశీలిస్తుంది. ఈ వివరాలతో కూడిన నివేదికను పార్లమెంటుకు బీసీ కమిషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంటు సమీక్షించి, ఆమోదించి.. షెడ్యూల్‌-9లో చేర్చినా ఇబ్బందులు రాకుండా పోవు. షెడ్యూల్‌ 9లో ఉన్న చట్టాల పైనా న్యాయ సమీక్ష జరిపేందుకు అవకాశం ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పెంచాలనుకుంటున్న 42 శాతం రిజర్వేషన్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Music Night: యుఫోరియా మ్యూజికల్ నైట్.. ఉర్రూతలూగిస్తున్న తమన్..

Nizamabad: పసుపు మార్కెట్ యార్డు సెక్యూటిరీ అధికారిపై దాడి.. పరిస్థితి ఎలా ఉందంటే..

Updated Date - Feb 16 , 2025 | 03:30 AM