Pregnancy Care: గర్భిణులకు ‘జననీ మిత్ర’!
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:18 AM
మాతా.. జననీ మిత్ర.. ప్రతి మాతృమూర్తి తన పిల్లల ఆరోగ్యం పట్ల.. ప్రత్యేకించి గర్భిణులు, బాలింతలైన కూతుళ్ల పట్ల శ్రద్ధ వహిస్తారు. అదే బాటలో రాష్ట్ర సర్కారు పయనిస్తోంది.
వారి ఆరోగ్య పర్యవేక్షణకు ప్రత్యేక యాప్
మీట నొక్కితే 108 అంబులెన్స్
సెల్ఫీ దిగితే రక్త హీనత పసిగట్టొచ్చు
కార్పొరేట్ ఆస్పత్రి యాప్ వినియోగంపై 1,2 రోజుల్లో ప్రభుత్వానికి వైద్యశాఖ నివేదిక
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): మాతా.. జననీ మిత్ర.. ప్రతి మాతృమూర్తి తన పిల్లల ఆరోగ్యం పట్ల.. ప్రత్యేకించి గర్భిణులు, బాలింతలైన కూతుళ్ల పట్ల శ్రద్ధ వహిస్తారు. అదే బాటలో రాష్ట్ర సర్కారు పయనిస్తోంది. గర్భిణులు, బాలింతల్లో రక్త హీనత, మాతా శిశు మరణాల నివారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన యాప్ అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ‘జననీ మిత్ర’ పేరుతో రూపొందించిన యాప్‌ను గర్భిణులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదీ ప్రభుత్వం అనుమతించిన గర్భిణులు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటున్న ఈ యాప్‌లో 4 ఫీచర్లుంటాయి.
ఎమర్జెన్సీలో ఎస్‌ఓఎస్ నొక్కితే సరి
గర్భిణులు అత్యవసర పరిస్థితుల్లో యాప్‌లోని ఎస్‌ఓఎస్ ఫీచర్ దగ్గర 3 సెకన్లు గట్టిగా నొక్కి పట్టుకుంటే సమీప ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగం అలర్టవుతుంది. అత్యవసరమైతే వెంటనే ఆమె వద్దకు 108 అంబులెన్సును ఆస్పత్రికి చేరుస్తారు. ఇక గర్భిణులు యాప్ ఓపెన్ చేసి.. తమ భోజనంలోని ఆహార పదార్థాలను స్కాన్ చేస్తే వాటిలోని పోషకాలు, కేలరీలు, ప్రోటీన్లు, కొవ్వు తదితర విషయాలు చెప్పేస్తుంది. దీంతో వారు ప్రతిరోజూ తమకవసరమైన కేలరీలు, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను స్థానిక ఆశావర్కర్లు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే వైద్యారోగ్యశాఖ వినియోగిస్తున్న యాప్‌లో ఆశా వర్కర్లు గర్భిణుల ఫొటో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. కానీ, జననీ మిత్ర యాప్‌తో అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ప్రతి ఆశా వర్కర్.. గర్భిణుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారా? లేదా? అనే సంగతి పసిగట్టొచ్చు. సర్కారు అమలు చేస్తున్న పథకాలు వారికి అందుతున్నాయా.. లేదా అనే విషయంతోపాటు సరైన సమయంలో ఆలా్ట్రసౌండ్ స్కానింగ్ చేయించుకుంటున్నారా? లేదా? సంగతిని యాప్ ట్రాక్ చేస్తుంది.
ఇలా రక్త హీనత లక్షణాలు బహిర్గతం
గర్భిణులు యాప్ ఓపెన్ చేసి సెల్ఫీ ఫొటో దిగితే వారిలో రక్త హీనత లక్షణాలు చెప్పేస్తుంది. సంబందిత గర్భిణుల వివరాలను సమీప ఆశా వర్కర్, ఎఎన్‌ఎంకు సమాచారం అందిస్తుంది. వారు సదరు గర్భిణి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. యాప్‌లోని డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసి, తమ సందేహాలు అడిగితే వెంటనే నివృత్తి చేస్తుందీ జననీ మిత్ర. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి రూపొందించిందీ యాప్. ఇటీవల ఆ ఆస్పత్రికెళ్లినప్పుడు యాప్ వివరాలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ పరంగా దాని వినియోగ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కుటుంబ సంక్షేమ కమిషనర్ సంగీతా సత్యనారాయణ సారధ్యంలో ఆ ఆస్పత్రికెళ్లిన ఉన్నతాధికారుల బృందం ‘జననీ మిత్ర’ యాప్ వినియోగంపై సందేహాలు నివృత్తి చేసుకున్నారు. గర్భిణుల కోసం ప్రభుత్వ వినియోగంపై రూపొందించిన నివేదికను ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందించనున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లా కుందేరులో పైలెట్ ప్రాజెక్టుగా ఏపీ సర్కారు అమలు చేస్తోంది. ఏటా తెలంగాణలో జరిగే 6.5 లక్షల ప్రసవాల్లో 3.5 లక్షల ప్రసవాలు సర్కారీ దవాఖానల్లో జరుగుతాయి. నిత్యం వారి ఆరోగ్య పర్యవేక్షణకు కార్పొరేట్ ఆస్పత్రి రూపొందించిన యాప్ వినియోగం.. ఆ యాప్‌లో నమోదు చేసే డేటా సురక్షితమేనా అన్న సందేహాలున్నాయి. ఈ యాప్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వానికి ఆ ఆస్పత్రి ఉచితంగా ఇస్తుందా..? రుసుము వసూలు చేస్తుందా..? అన్న సంగతి తెలియరాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు
ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..
Read Latest Telangana News and National News