Share News

Supreme Court: బీసీ బిల్లులపై సుప్రీంకోర్టుకు ?

ABN , Publish Date - Aug 23 , 2025 | 03:59 AM

రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్‌ బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతి/గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు పంపినప్పుడు..

Supreme Court: బీసీ బిల్లులపై  సుప్రీంకోర్టుకు ?

5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో బీసీ రిజర్వేషన్‌ బిల్లులు

  • రాష్ట్రాలు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 90 రోజుల్లో

  • తేల్చాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ

  • బీసీ బిల్లులకూ ఇది వర్తిస్తుందని సర్కారు యోచన

  • సుప్రీంకు వెళ్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు

  • హైకోర్టును మరింత గడువు కోరే అవకాశం

  • నేడు టీపీసీసీ పీఏసీ సమావేశంలో చర్చ

  • 25న క్యాబినెట్‌.. 42ు పై ప్రభుత్వపర నిర్ణయం

హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్‌ బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతి/గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు పంపినప్పుడు.. వాటిపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ యోచన చేస్తోంది. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ మార్చి 17న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులూ రాష్ట్రపతి వద్దకు చేరిన సంగతి తెలిసిందే. అయితే ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్దనే ఆ రెండు బిల్లులూ పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రాలు పంపిన బిల్లులపైన 90 రోజుల్లోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ బీసీ రిజర్వేషన్‌ బిల్లులకూ వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే.. ఈ కారణం చూపి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టును మరికొంత గడువును ప్రభుత్వం కోరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే.. అసెంబ్లీలో బీసీ బిల్లులపై తీర్మానం పెట్టి.. ఆమోదించాలని, దాని ఆధారంగా జీవో తీసుకురావాలన్న ప్రతిపాదనపైనా చర్చ జరుగుతోంది. దీంతోపాటు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ పరంగా నిర్ణయించి.. ఇతర పార్టీలనూ ఈ మేరకు రిజర్వేషన్‌ కల్పించాలంటూ విజ్ఞప్తి చేయాలన్న ప్రతిపాదనా ఉంది. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో స్థానిక ఎన్నికలపై ముందుకు వెళుతూనే.. బిల్లుల ఆమోదంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.


పీఏసీలో నిర్ణయం

గాంధీభవన్‌లో శనివారం సాయంత్రం టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీల ఉమ్మడి సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీల సభ్యులు పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ ఉమ్మడి సమావేశంలో చర్చిస్తారు. అలాగే ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్‌ చోరీ, గద్దె చోడ్‌ ఉద్యమం నిర్వహించడం, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ సంస్థాగత నిర్మాణం, యూరియా కొరత తదితర అంశాలపైన చర్చిస్తారు. అయితే స్థానిక ఎన్నికలు, అందులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలుపై చర్చలో భాగంగా ప్రభుత్వం ముందు ఉన్న మూడు ప్రతిపాదనలపైనా సమావేశం.. చర్చించి నిర్ణయం తీసుకోనుంది. పార్టీ పరంగా తీసుకోనున్న విధాన నిర్ణయాన్ని.. ప్రభుత్వ పరంగానూ తీసుకుని అమలు చేయనున్నారు.


25న క్యాబినెట్‌ భేటీ

రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 25న సచివాలయంలో భేటీ కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అంశాలపైనే చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పీఏసీలో తీసుకునే విధాన పరమైన నిర్ణయాల ఆధారంగానే.. రాష్ట్ర క్యాబినెట్‌ ఈ అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని పీఏసీలో నిర్ణయిస్తే.. పాత రిజర్వేషన్‌ ప్రకారం పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని క్యాబినెట్‌ సమావేశంలో తీర్మానిస్తారు. దీంతోపాటు కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక, అసెంబ్లీ వర్షాకాలం సమావేశాల నిర్వహణ తదితర అంశాలపైనా క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వర్షాకాలం సమావేశాలను సెప్టెంబరు 26 లోపునే నిర్వహించాల్సి ఉన్నందున.. మొదటి లేదా రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు

అందుకే యూరియా ఆలస్యమైంది

Read Latest Telangana News and National News

Updated Date - Aug 23 , 2025 | 03:59 AM