Senior Citizens: వృద్ధులకు వరంగా జెరియాట్రిక్ వార్డులు
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:16 AM
తెలంగాణలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 65 ఏళ్లుపైబడిన పెద్దల కోసం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్ వార్డులు వరంగా మారాయి.
65 ఏళ్లు పైబడిన వారికి చికిత్స అందించేందుకు బోధనాస్పత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు
మే చివరిలో మొదలైన సేవలు
2 నెలల్లో 2.59 లక్షల మందికి వైద్యం
అందుబాటులో ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ చికిత్సలతోపాటు ఫిజియోథెరపీ, ఆర్థో, ఈఎన్‌టీ, మానసిక వైద్య సేవలు..
టాప్‌లో సంగారెడ్డి జిల్లా.. వరంగల్‌లో అత్యల్ప స్పందన..
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 65 ఏళ్లుపైబడిన పెద్దల కోసం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్ వార్డులు వరంగా మారాయి. ఈ ఏడాది మేలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని బోధనాస్పత్రుల్లో పదేసి పడకలతో ఈ వార్డులను ప్రారంభించారు. ఈ వార్డులు, వాటిలో అందుతున్న వైద్యసేవలకు మంచి స్పందన వస్తోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. వీటిద్వారా రెండు నెలల్లోనే 2,59,880 మంది ఓపీ సేవలు, 32,313 మంది ఇన్‌పేషెంట్, 19,685 మంది ఫిజియోథెరపీ సేవలు పొందారని వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీటికితోడు ఆర్థో, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, మానసిక వైద్యసేవలు పొందుతున్నవారు ఎక్కువగా ఉన్నారని స్పష్టమవుతోంది.
సంగారెడ్డి జిల్లాలో మంచి స్పందన
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జెరియాట్రిక్ కేంద్రాలకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో గత రెండు నెలల్లో కలిపి 30,578 మంది వైద్య సేవలు పొందారు. భద్రాద్రి కొత్తగూడెంలో 17,075 మంది, నల్గొండలో 17,342, నిజామాబాద్‌లో 13,214 మేర జెరియాట్రిక్ ఓపీ నమోదైంది. మరోవైపు పలు జిల్లాల్లో ఈ కేంద్రాలకు పెద్దగా స్పందన లేకపోవడంతో.. సేవలు మెరుగుపర్చుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల వైద్యారోగ్యశాఖ సమీక్షలో ఉన్నతాధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్, నారాయణపేట్, గద్వాల, జనగామ, వరంగల్ జిల్లాల్లో జెరియాట్రిక్ కేంద్రాల్లో తక్కువ ఓపీ నమోదైంది. వరంగల్‌లో అత్యల్పంగా రెండు నెలలు కలపి 376 మందే ఓపీకి వచ్చారు.
ఫిజియోథెరపీ కోసం వస్తున్న పెద్దలు
వృద్ధాప్యంలో మోకాళ్లు, ఇతర కీళ్ల నొప్పుల సమస్య ఎక్కువగా ఉంటుంది. వారికి ఫిజియోథెరపీతో ఉపశమనం ఉంటుంది. ప్రైవేటుగా అయితే ఫిజియోథెరపీకి ఒక్కో సెషన్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చవుతుంది. పైగా ఎక్కువసార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. అదే జెరియాట్రిక్ కేంద్రాల్లో ఉచితంగా ఫిజియోథెరపీ సేవలు అందుతండటం పెద్ద వయసు వారికి ప్రయోజనకరంగా మారింది. జెరియాట్రిక్ కేంద్రాలే కాదు.. రాష్ట్రంలో వృద్ధులకు సేవల కోసం వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఏరియా ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, బస్తీ దవాఖానాల్లో ప్రతీ గురువారం ప్రత్యేకంగా పెద్దల కోసం క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. బస్తీ, పల్లె దవాఖానాలకు రాలేని వృద్ధులకు ఇంటివద్దకే వెళ్లి సేవలు అందించాలని కూడా వైద్యశాఖ ఆదేశించింది. సర్కారీ దవాఖానాల్లో ఓపీ, డయాగ్నొస్టిక్ కేంద్రాల వద్ద వృద్ధులకు క్యూ నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించింది.
ఉరుకులు పరుగుల జీవితంలో ఆసరా లేక..
ప్రస్తుతం అంతా ఉరుకుల, పరుగుల జీవితంగా మారింది. చాలా మంది పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులపై సరైన శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. పైగా తల్లిదండ్రులు గ్రామాల్లో ఉండటం, పిల్లలు పట్టణాలకు వలస వెళ్లడం కూడా సమస్యగా మారుతోంది. కొందరు తల్లిదండ్రులు తమ సంతానం నుంచి సొమ్ము తీసుకుని ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు. ఈ కారణాలన్నీ కలసి పెద్ద వయసువారికి సరైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్ కేంద్రాలకు వస్తున్న పెద్దల సంఖ్య పెరిగిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..
ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన
Read latest Telangana News And Telugu News