Education: పాఠశాల విద్యలో ‘కృత్రిమ మేధ’
ABN , Publish Date - Jan 31 , 2025 | 03:58 AM
ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి పాఠశాల విద్యలో నాణ్యతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కరసత్తులు చేస్తోంది.

నాణ్యమైన విద్యకు ఆధునిక పరిజ్ఞానం
ప్రాథమిక విద్యలో అభ్యసన నైపుణ్యాల పెంపునకు ‘ఏక్ స్టెప్ ఫౌండేషన్’ సహకారంతో కార్యక్రమాలు
హైదరాబాద్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి పాఠశాల విద్యలో నాణ్యతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కరసత్తులు చేస్తోంది. ఇప్పటికే ఈ దిశగా కేరళలో అవలంబిస్తున్న అత్యుత్తమ విధానాలను పరిశీలించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు.. గురువారం బెంగళూరులోని ‘ఏక్ స్టెప్ ఫౌండేషన్’ను సందర్శించారు. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని చైర్మన్‌గా ఉన్నారు. పాఠశాల విద్యలో కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి విద్యలో నాణ్యతను పెంచేందుకు ఈ ఫౌండేషన్ ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, ఒడిసా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. కేరళ ప్రభుత్వం కూడా ఈ సంస్థతో కలిసి ఇప్పటికే విద్యలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చింది. విద్యార్థులకు సులభంగా అర్థయమ్యేలా ఏఐ ఆధారిత టూల్స్ అమలు చేస్తోంది.
ఇదే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే కేరళ వెళ్లి వచ్చారు. ఈ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వాలకు ఏక్ స్టెప్ ఫౌండేషన్ అందిస్తోంది. తెలంగాణలోనూ అమలు చేయాలన్న లక్ష్యంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా నేతృత్వంలో ప్రతినిధి బృందం గురువారం బెంగళూరులోని ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించింది. బృందంలో ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమా హారతి, గరిమ ఉన్నారు. తెలంగాణ విద్యా శాఖలో అమలు చేయనున్న అంశాలపై ప్రతినిధులు ఫౌండేషన్‌తో చర్చించారు. డిజిటల్ విద్యపై ఉపాధ్యాయులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. ఏక్ స్టెప్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏఐ ఆధారిత విద్యను ప్రవేశపెట్టడానికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోందని ఉన్నతాధికారులు తెలిపారు.