POCSO Act: లైంగికదాడి కేసుల్లో నిందితులకు భారీ శిక్షలు
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:11 AM
బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి తెలంగాణలోని పలు కోర్టులు భారీశిక్షలను విధించాయి. వేర్వేరు కోర్టుల్లో నలుగురికి 20 ఏళ్లకు పైగా శిక్షలు వేశాయి.
పోక్సో చట్టం కింద 22 ఏళ్లకు పైగా జైలు
వేర్వేరు కేసుల్లో తీర్పు వెల్లడించిన నల్లగొండ, పెద్దపల్లి, మేడ్చల్ కోర్టులు
ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్ : బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి తెలంగాణలోని పలు కోర్టులు భారీశిక్షలను విధించాయి. వేర్వేరు కోర్టుల్లో నలుగురికి 20 ఏళ్లకు పైగా శిక్షలు వేశాయి. నల్లగొండ జిల్లా చండూరు మండలానికి చెందిన తిప్పర్తి యాదయ్య 2016లో ఓ బాలిక ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి మారణాయుధాలతో బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన చండూరు పోలీసులు సరైన ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో నిరూపించారు. దీంతో యాదయ్యకు 20 ఏళ్ల జైలు, ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన నేరం కింద ఏడాది జైలు, ఆమెపై నేరపూరితమైన బెదిరింపులకు పాల్పడిందుకు మరో ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నల్లగొండ జిల్లా అదనపు జడ్జి ఎన్. రోజారమణి తీర్పు ప్రకటించారు. నిందితుడికి రూ.35 వేల జరిమానాతో పాటు, బాధితురాలి బాధకు పరిహారంగా రూ.10లక్షలు చెల్లించాలని ఆదేశించారు.
మరో కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష
నల్లగొండ జిల్లా దేవరకొండ ఓ గ్రామానికి చెందిన బాలికపై 2018లో ఎం.భాస్కరాచారి అనే లారీక్లీనర్ మద్యం మత్తులో లైంగికదాడి చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద నేరం నిరూపితమవడంతో 20ఏళ్ల కఠిన జైలు శిక్ష, 25వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెల్లడించారు. బాధితురాలికి 10లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు.
పెద్దపల్లిలో నిందితుడికి యావజ్జీవం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఓ గ్రామంలో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికపై శీలారపు రమేష్ వ్యక్తి అతడి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. నిందితుడిపె పోలీసులు పోక్సో కేసు పెట్టారు. పెద్దపల్లి ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో జడ్జి కె.సునీత ముద్దాయికి జీవితకాలం కఠిన కారాగార శిక్షతో పాటు రూ.21వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. బాధితురాలికి 5 లక్షలు పరిహారంగా చెల్లించాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీకి సిఫారసు చేశారు.
స్నేహం పేరుతో అత్యాచారం.. 20ఏళ్ల జైలు
మేడ్చల్ జిల్లా అల్వాల్‌లో కూలి పని చేసే అద్దాల నాని(28) ఓ మైనర్ బాలికను స్నేహం ముసుగులో బహిరంగ ప్రదేశాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అల్వాల్ పోలీసులు నానిపై పోక్సో కేసు నమోదు చేశారు. 2020లో విచారణ చేపట్టిన మేడ్చల్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. న్యాయమూర్తి అమరావతి నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షతో పాటు 20వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం
Read Latest TG News and National News