Share News

CM Revathi Reddy: వ్యక్తిగత ఇష్టాయిష్టాలను సహించం

ABN , Publish Date - Dec 24 , 2025 | 06:04 AM

ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేయాలని, వాటి అమల్లో వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ప్రదర్శిస్తే సహించేది లేదని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు....

CM Revathi Reddy: వ్యక్తిగత ఇష్టాయిష్టాలను సహించం

  • సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి

  • బాగా పనిచేస్తే గౌరవిస్తాం.. లేకపోతే ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఊరుకోం

  • పనితీరులో మార్పు రాకపోయినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలే

  • పనితీరును 3 నెలలకోసారి నేనే సమీక్షిస్తా

  • ఐఏఎ్‌సలు పది రోజులకోసారి క్షేత్రస్థాయికెళ్లాలి

  • కొనుగోళ్లకు కేంద్రీకృత విధానం ఉండాలి

  • అన్ని శాఖల పరిధిలో డాష్‌ బోర్డు, ఈ ఫైలింగ్‌

  • పెట్టుబడుల గ్రౌండింగ్‌, పురోగతిపై సమీక్షించాలి

  • కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి..

  • ఆరోగ్యశ్రీ పరిధిలోకి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రులు

  • ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం

హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేయాలని, వాటి అమల్లో వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ప్రదర్శిస్తే సహించేది లేదని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. పథకాల అమల్లో బాగా పని చేసిన అధికారులను హోదాతో సంబంధం లేకుండా గౌరవిస్తామని, ఆశించిన స్థాయిలో పని చేయని అధికారులు ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఊరుకోబోమని, తగిన చర్యలుంటాయని తేల్చి చెప్పారు. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో కలిసి ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో మంగళవారం సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా జరిగింది. ఇటీవల ఒకచోట డంప్‌ యార్డు ఏర్పాటుకు స్థలం కేటాయించి, మళ్లీ ఆ స్థలాన్ని డంప్‌ యార్డుకు ఎలా కేటాయించారంటూ ఒకే శాఖ రెండు రకాలుగా వ్యవహరించడంతో సంబంధిత అధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నామని సంబంధిత అధికారి జవాబిచ్చినట్లు తెలిసింది. అలాగే, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి బేసిన్లకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేయాలని సాగునీటి శాఖ ఉన్నతాధికారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడారు. ఆ వివరాలతో సీఎం కార్యాలయం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్నదాని కంటే అధికారులు తమ పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని, పనితీరులో మార్పు రాకపోయినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇకనుంచి అధికారుల పనితీరును స్వయంగా సమీక్షిస్తానని, ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. శాఖల కార్యదర్శుల పనితీరుపై ప్రతి నెలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీక్షిస్తారని, వారు ఆయనకు తమ పనితీరు నివేదికను సమర్పించాలని సూచించారు.


అలాగే, ఐఏఎస్‌ అధికారులు ప్రతి పది రోజులకు ఒకసారి క్షేత్రస్థాయికి వెళ్లాలని, నెలలో కనీసం మూడుసార్లు ఆయా శాఖల పరిధిలో ఏం జరుగుతోందనేది పరిశీలించాలని నిర్దేశించారు. ‘‘ప్రభుత్వ శాఖలు, అధికారుల మధ్య సమన్వయం ఉండాలి. లేకపోతే ఎలాంటి ఫలితాలూ రావు. ఇందుకు శాఖల మధ్య ప్రత్యేకంగా ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోండి’’ అని సూచించారు. అన్ని శాఖల పరిధిలోని కొనుగోళ్లకు సంబంధించి కేంద్రీకృత విధానాన్ని తీసుకు రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. తద్వారా పన్ను ఎగవేతలకు ఆస్కారం ఉండబోదని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయింది. కొన్ని విజయాలు సాధించాం. మరికొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఇంఽధన, విద్య, సాగునీరు, వైద్యంతోపాటు వివిధ శాఖలకు పాలసీలు తీసుకువచ్చాం. రాష్ట్రానికి ఒక పాలసీ ఉండాలని ‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేసుకున్నాం. రాష్ట్రాభివృద్ధికి స్పష్టమైన విధి విధానాలతో ముందుకెళ్తున్నాం. ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా అందుకు అధికారుల సహకారం కీలకం’’ అని చెప్పారు.

జనవరి 26లోగా ఔట్‌ సోర్సింగ్‌ వివరాలు ఇవ్వాలి

ప్రతి శాఖలో ఉన్న రెగ్యులర్‌, ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పూర్తి వివరాలను జనవరి 26లోగా సీఎ్‌సకు అందించాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అందాల్సిన జీతాలు, ఈపీఎఫ్‌/ ఈఎ్‌సఐ తదితరాలు అందుతున్నాయో లేదో పరిశీలించాలని, ఈ ప్రక్రియను కూడా జనవరి 26లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల డేటా విషయంలో పూర్తి బాధ్యత అధికారులదేనని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి 31లోగా ‘ఈ-ఫైలింగ్‌’ విధానాన్ని అమలు చేయాలని, కాగితాలు, ఫైళ్లు పట్టుకుని తిరిగే పరిస్థితి ఉండకుండా అన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాలని నిర్దేశించారు. తమ తమ శాఖల పరిధిలోని కార్యక్రమాల అమలుకు డాష్‌బోర్డు సిద్ధం చేయాలని చెప్పారు. దీనిని సీఎస్‌, సీఎంవో డాష్‌ బోర్డులకు అనుసంధానం చేయాలని, దాంతో, అన్ని శాఖల పర్యవేక్షణ సులభతరం అవుతుందని, పనితీరు మెరుగుపడుతుందని చెప్పారు.

పెట్టుబడుల పురోగతిని సమీక్షించండి

రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంతమేరకు గ్రౌండ్‌ అయ్యాయి? వాటి పురోగతి ఏమిటనే విషయాన్ని ప్రతి నెలా సమీక్షించుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి అప్రమత్తం చేశారు. పరిశ్రమలకు అవసరమైన భూ సేకరణ, భూ కేటాయింపులకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థంగా పనిచేస్తే ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047’ భవిష్యత్తు లక్ష్యాలను అలవోకగా సాధించగలమని ఆ శాభావం వ్యక్తం చేశారు. విజన్‌ అంటే కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహను తిప్పికొట్టేలా, విజన్‌లో ఉన్న ప్రతి అంశం అమలుకు వెంటనే నడుం బిగించాలని నిర్దేశించారు.


సంక్షేమ హాస్టళ్లు, ఆఫీసులకు సొంత భవనాలు

ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్‌ అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు అద్దె భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేసి జనవరి 26లోగా ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశించారు. ఒకవేళ ఖాళీ భవనాలు అందుబాటులో లేకపోతే, ఖాళీ స్థలాలను గుర్తించాలని, అక్కడ సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇతర శాఖలు, విభాగాల భవనాలనూ వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలోని 113 మున్సిపల్‌ ఆఫీసులకు ఎక్కడెక్కడ సొంత, అద్దె భవనాలు ఉన్నాయో వెంటనే గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా కొత్త భవనాలను నిర్మించాలని ఆదేశించారు. అలాగే, అద్దె భవనాల్లో ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లు, అంగన్‌వాడీలన్నింటికీ సొంత భవనాలు ఉండేలా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రైతు భరోసా పథకం అమలు, మార్గదర్శకాలపై అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రైతు భరోసా నిధులు కేవలం నాగలి పట్టి, సాగు చేసే రైతులకే అందాలని, సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.


కొత్త ఏడాదిలో ఐఏఎ్‌సల బదిలీలు

త్వరలో ఐఏఎస్‌, ఐపీఎ్‌సల బదిలీలు ఉండనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొత్త ఏడాదిలో అధికారుల బదిలీలు ఉంటాయని, అందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని సమాచారం.

ఆరోగ్యశ్రీ పరిధిలోకి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రులు

రాష్ట్రంలోని కోర్‌ అర్బన్‌ ఏరియా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. కార్పొరేట్‌ తరహాలో సర్కారు స్కూళ్లలో నమోదు శాతం పెంచేందుకు రవాణా సదుపాయం, బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం అమలు దిశగా ప్రణాళికలు ఉండాలన్నారు. అలాగే, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని టీచింగ్‌ ఆసుపత్రులను అద్భుతమైన వైద్య సేవలు అందించేలా తీర్చిదిద్దాలని సూచించారు. నిమ్స్‌ తరహాలో సనత్‌నగర్‌, కొత్తపేట, అల్వాల్‌లోని టిమ్స్‌, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ, ఉస్మానియా కొత్త ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా అన్ని వసతులతో తీర్చిదిద్దాలన్నారు. మెడికల్‌ కాలేజీ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎ్‌ఫలను అనుసంధానం చేయాలన్నారు. అక్కడ సేవలందించే వైద్యులు, సిబ్బందికి కూడా సర్జరీలు, ప్రత్యేక సేవలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని సూచించారు.

కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చే నిధులను అన్ని శాఖలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌ సూచించారు. ఆ పథకాలతో దాదాపు రూ.3 వేల కోట్లు తెచ్చుకునే వీలుందని, అందుకు వీలుగా అన్ని శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. ఆ నిధులకు సంబంధించి రాష్ట్ర వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, వివిధ విభాగాలకు సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న అంశాలను ఎప్పటికప్పుడు అన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని, వాటి పురోగతిని ప్రతి వారం సమీక్షించుకోవాలని నిర్దేశించారు.

Updated Date - Dec 24 , 2025 | 06:04 AM