Jaipur Crime News: పాస్టిక్ బ్యాగ్ నుంచి దుర్వాసన.. ఓపెన్ చేయగా షాకింగ్ దృశ్యం
ABN , Publish Date - Dec 24 , 2025 | 08:46 AM
ఓ మూడంతస్తుల భవనంలోని వరండాల్లో ఓ పాస్టిక్ సంచి నుంచి దుర్వాసన వస్తుంది. దీంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి.. ఆ బ్యాగ్ ను ఓపెన్ చేయగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. మహిళ డెడ్ బాడీ కుళ్లిన స్థితిలో దారుణంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
రాజస్థాన్, డిసెంబర్ 24: జైపూర్(Jaipur murder case)లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం శాస్త్రి నగర్ ప్రాంతంలోని ఒక ఇంటి వరండాలో గుర్తుతెలియని మహిళ మృతదేహం ప్లాస్టిక్ సంచుల్లో కుక్కి ఉన్న స్థితిలో పోలీసులు గుర్తించారు. ఆమె ముఖంపై గాయాలు ఉన్నాయి. ఎవరో ఆమెపై దాడి చేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జైపూర్ పట్టణంలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో ఉన్న ఒక మూడు అంతస్తుల భవనంలో ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. ఇంటి యజమాని మొదట ఆ సంచిని గమనించినప్పటికీ, అందులో అద్దెకు ఉండే వారి వస్తువులు ఉన్నాయని భావించాడు. అయితే చాలా సమయం వరకు ఎవరూ దాన్ని తీసుకుపోగా.. అందులో నుంచి దుర్వాసన వస్తుంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు బ్యాగ్ ఓపెన్ చేయగా.. కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది. ఆమె ముఖంపై గాయాల గుర్తులు ఉన్నాయని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్)(Jaipur police investigation) బజరంగ్ సింగ్ తెలిపారు. ఈ భవనం సూరజ్ ప్రకాష్ సాన్వరియా అనే కాంట్రాక్టర్ చెందినది.
ఆయన చనిపోవడంతో భార్య మున్నీ దేవి కింది అంతస్తులో ఒంటరిగా నివసిస్తుండగా, పై అంతస్తులలో ఇద్దరు అద్దెకు ఉంటున్నారు. మృతదేహాన్ని రెండు ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేయడానికి ముందు ఒక దుప్పటిలో చుట్టారని, ఈ పద్ధతి వల్లనే దుర్వాసన ఆలస్యంగా వచ్చి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరించాయి. మృత దేహం ఎవరిది అనేది తెలియాల్సి ఉంది. డాగ్ స్క్వాడ్ ఓ యువకుడి వద్ద ఆగడంతో అతడిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మృతదేహాన్ని కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. నిందితుడు పక్కనే ఉన్న ఇంటి ప్రధాన గేటు తెరిచి, ఆ సంచిని వరండాలో వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లు కనిపిస్తోందని వారు ఇంకా చెప్పారు.