CM Revanth Reddy: తడాఖా చూపిస్తాం!
ABN , Publish Date - Aug 07 , 2025 | 03:39 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలుపకుంటే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపుతామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
బీసీల రిజర్వేషన్లకు ఆమోదం తెలపకపోతే ప్రధాని మోదీని గద్దె దింపుతాం
కేంద్రం మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధిస్తాం
మోదీకి చిత్తశుద్ధి ఉంటే బిల్లును ఆమోదింపజేయాలి
రాహుల్ ఆశయాలకు అడ్డు తగిలిన వారి అడ్రస్ గల్లంతే
ఇక ఢిల్లీకి రాం.. గల్లీలోనే బీజేపీ నేతలను పట్టుకుంటాం
కిషన్‌రెడ్డి, సంజయ్, రాంచందర్‌లకు బీసీలు అక్కర్లేదా?
బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడేది బీజేపీ నేతలు, కేసీఆరే
తెలంగాణతో బీఆర్‌ఎస్ పేగుబంధం తెంచుకుందా?
కులగణన చేసే అదృష్టం సీఎంగా నాకే దక్కింది
ఢిల్లీలో పోరుబాట ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలుపకుంటే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపుతామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు సాధించి తీరతామని స్పష్టం చేశారు. ‘‘మోదీజీ బీసీ రిజర్వేషన్లు ఆమోదించండి. లేదంటే మిమ్మల్ని గద్దె దింపుతాం. గోద్రా అల్లర్ల సమయంలో రాజీనామా చేయమని అప్పటి ప్రధాని వాజపేయి అడిగినా మోదీ రాజీనామా చేయలేదు. ఇప్పుడు 75 ఏళ్లు నిండినందున పదవి నుంచి వైదొలగాలని ఆరెస్సెస్ చీఫ్ కోరుతున్నా మోదీ పట్టించుకోవడం లేదు. ఇక మోదీ లేకపోతే బీజేపీకి 150 సీట్లు కూడా రావని ఆయన భక్తుడు నిశికాంత్ దూబే అంటున్నారు. ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ 150 సీట్లు దాటవని నేను చెబుతున్నా. రాసిపెట్టుకోండి. బీసీ రిజర్వేషన్లను మోదీ అడ్డుకుంటే ఆయన్ను గద్దె దించి, రాహుల్‌ని ప్రధానమంత్రిని చేసుకొని మా డిమాండ్‌ను నెరవేర్చుకుంటాం’’ అని రేవంత్ చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో బుధవారం నిర్వహించిన పోరుబాట ధర్నాలో సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించకుండా కేంద్రం, రాష్ట్రపతి తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. బిల్లులు ఆమోదం పొందే వరకు నిద్రపోయేది లేదన్నారు. బలహీన వర్గాలపై కక్షగట్టిన గత సీఎం కేసీఆర్ 50 శాతం రిజర్వేషన్లు మించకుండా చట్టం చేశారని విమర్శించారు. ఆ చట్టమే ఇప్పుడు రిజర్వేషన్లకు గుదిబండగా మారిందన్నారు. ఆ చట్టాన్ని తొలగించేందుకే ఆర్డినెన్స్ చేశామని చెప్పారు. వెనకబడిన వర్గాల వారికి స్థానిక ఎన్నికల్లో, విద్య, ఉద్యోగ రంగాల్లో 42 ు రిజర్వేషన్లు సాధించేందుకు ఢిల్లీలో ధర్నాకు దిగామని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సాధిస్తామని రేవంత్ తెలిపారు. తెలంగాణ ప్రజల శక్తిని మోదీ తక్కువగా అంచనా వేస్తే ఆయనకు తమ తడాఖా చూపిస్తామని చెప్పారు.
అడ్డుపడేదే వారు..
‘‘తెలంగాణలో కేసీఆర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాంచందర్‌రావు బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డుపడుతున్నారు. వారికి తెలంగాణ బీసీల అవసరం లేదా? బీఆర్‌ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాకు ఎందుకు రాలేదు? ఆ పార్టీ తెలంగాణతో పేరు బంధంతోపాటు పేగు బంధం కూడా తెంచుకుందా? బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాను కేటీఆర్ డ్రామా అంటున్నారు. అసలు ఆయన పేరే డ్రామా రావు. కేసీఆర్ కుటుంబమే డ్రామాలతో బతుకుతోంది. అధికారం పోయినా కేటీఆర్ బుద్ధి మారలేదు. ఆ కుటుంబంలోనే ఒకరు రిజర్వేషన్లకు అనుకూలమని, మరొకరు ప్రతికూలమని చెబుతున్నారు. ఇంకొకరు అటూ ఇటూ కాకుండా మాట్లాడుతున్నారు’’ అని రేవంత్ ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించకుంటే ఇక ఢిల్లీకి రాబోమని, గల్లీకి వచ్చినప్పుడు బీజేపీ నేతలను పట్టుకుంటామని హెచ్చరించారు. దళితులు, గిరిజనులకు అండగా నిలిచి ఇందిరాగాంధీ దేశ ప్రజల గుండెల్లో ఇందిరమ్మగా నిలిచిపోయారని.. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఐటీ విప్లవంతో అగ్ర కులాల్లో చాలా మంది విదేశాల్లో ఉన్నత స్థాయుల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. వారి వారసుడిగా వచ్చిన రాహుల్ బీసీలకు న్యాయం చేసేందుకు కంకణం కట్టుకున్నారని, ఆయన ఆశయాలకు అడ్డుతగిలే వారి చిరునామా గల్లంతవుతుందని చెప్పారు. ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి దగ్గరున్న బిల్లులు ఆమోదం పొందేలా చూడాలని.. లేకుంటే తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
సీఎంగా ఆ అదృష్టం నాకే దక్కింది..
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేయలేదని, ఇప్పటి వరకు దేశంలో 300 మంది ముఖ్యమంత్రులు చేయలేని పని చేసే అదృష్టం తనకు దక్కిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బీసీల రిజర్వేషన్లు పెంచే అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణలోనైనా ధర్నా చేయొచ్చని, కానీ అక్కడ చేస్తే స్థానిక పార్టీలు మాత్రమే వస్తాయని.. అందుకే ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో ధర్నా చేయడంతోనే ఇండి కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, వామపక్షాలకు చెందిన 100 మంది ఎంపీలు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారని రేవంత్ అన్నారు. ఈ ధర్నాలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, తుమ్మల, దామోదర, శ్రీధర్ బాబు, జూపల్లి, సురేఖ, కోమటిరెడ్డి, పొన్నం, పొంగులేటి, సీతక్క, వివేక్, లక్ష్మణ్ కుమార్, శ్రీహరి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రపతిపై మోదీ ఒత్తిడి చేస్తున్నారేమో..?
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ ఒత్తిడి చేస్తున్నారేమో? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ధర్నా సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రపతిని అపాయింట్ మెంట్ అడిగి చాలా రోజులు అవుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రపతి భవన్ నుంచి సమాధానం రాలేదు. రేపటిలోగా (గురువారం వరకు) రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇస్తారని, సమస్య విని ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాం. అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని మోదీ రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చారేమో? బలహీన వర్గాలు ఆలోచించాలి. ఢిల్లీలో ఇంత పెద్దఎత్తున మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ పరివారమంతా ధర్నా చేస్తున్నా బీజేపీకి మాత్రం కనువిప్పు కలగడం లేదు. పార్లమెంట్‌లో మా ఎంపీలు పోరాటం చేస్తూనే ఉన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదు. మోదీ ఇచ్చిండా సరేసరి.. లేదంటే బీజేపీ, మోదీ మెడలు వంచుతాం. మోదీ పార్లమెంట్ వేదికగా జవాబు చెప్పకపోతే ఊరుకునేది లేదు. ఇక మళ్లీ ఢిల్లీకి వచ్చేది లేదు. తెలంగాణకు వచ్చినప్పుడు సరైన సమాధానం చెబుతాం. బీజేపీని తెలంగాణలో తుడిచి పెట్టేస్తాం. దేశంలో చేపట్టబోయే జనగణన విషయంలో మోదీని నమ్మలేం. దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలి. తెలంగాణలో 8 పేజీలు, 53 ప్రశ్నలు ఉంచి అమలు చేశాం. తెలంగాణ సర్వే దేశానికే రోల్ మోడల్. కేంద్రం అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలి’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.
చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే ధర్నా: భట్టి
తెలంగాణలో చేసిన కుల సర్వే దేశ దశ, దిశను మార్చే సర్వే అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. దేశానికి తాము మార్గం చూపామని, దాన్ని అనుసరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. జంతర్‌మంతర్ ధర్నా భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని తెలిపారు. బీజేపీ అసెంబ్లీలో మద్దతు తెలిపిందని, అలాగే పార్లమెంట్‌లోనూ మద్దతుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ ధర్నాలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు గురువారమే ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన పనిని పూర్తి చేసిందని, కేంద్రమే ఆమోదముద్ర వేయాల్సి ఉందని చెప్పారు. దశాబ్దాల ఓబీసీల కల నెరవేరాలంటే అన్ని పక్షాలు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల రిజర్వేషన్ అంశం కాంగ్రెస్, బీజేపీకి సంబంధించింది కాదని.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిందని స్పష్టం చేశారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. 1.05 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వినియోగించుకుని ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించలేని రీతిలో సర్వేను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు