Share News

Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరతాం

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:24 AM

గోదావరిపై ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను ఒప్పుకొనేది లేదని, గోదావరిలో రాష్ట్ర వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోకూడదని తీర్మానించింది.

Banakacharla Project: బనకచర్ల  ప్రాజెక్టును అడ్డుకొని తీరతాం

  • రాష్ట్రానికి రావాల్సిన ఒక్క నీటి చుక్కనూ వదులుకోం

  • బనకచర్లపై జూలై మొదటివారంలో సీఎల్పీ సమావేశం

  • బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన

  • కాళేశ్వరం చరిత్రనంతా ఘోష్‌ కమిషన్‌ ముందుంచుతాం

  • ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా నూతన క్రీడా విధానం

  • మహబూబ్‌నగర్‌లో ట్రిపుల్‌ఐటీ, 1080 సీట్లతో ప్రవేశాలు

  • ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం

  • సంగారెడ్డిలో రెండు కొత్త మునిసిపాలిటీల ఏర్పాటు

  • ఆర్థిక అభివృద్ధికి నిపుణులతో సలహా మండలి

  • 2035 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం

  • డిసెంబరు 9న రైజింగ్‌ విజన్‌-2047 ఆవిష్కరణ

  • క్యాబినెట్‌ నిర్ణయాలు.. మంత్రి పొంగులేటి వెల్లడి

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): గోదావరిపై ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను ఒప్పుకొనేది లేదని, గోదావరిలో రాష్ట్ర వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోకూడదని తీర్మానించింది. ఈ మేరకు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు చట్టపరంగా, న్యాయపరంగా అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని క్యాబినెట్‌ తీర్మానించిందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. సోమవారం మంత్రిమండలి సమావేశం ముగిసిన అనంతరం క్యాబినెట్‌ నిర్ణయాలను ఆయన వెల్లడించారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని సీఎం రేవంత్‌, నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌ స్వయంగా ఢిల్లీకి వెళ్లి కలిసి విజ్ఞప్తి చేశారని ఆయన గుర్తు చేశారు. వాస్తవానికి బనకచర్లకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగిందని, దానిని అడ్డుకోలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు మసి పూసి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. బనకచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను జూలై మొదటివారంలో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరికీ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించాలని నిర్ణయించామన్నారు. గోదావరి-బనకచర్లపై ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి జూలై మొదటివారంలో సీఎల్పీ సమావేశం నిర్వహించాలని క్యాబినెట్‌ నిర్ణయించినట్లు తెలిపారు.


కాళేశ్వరంపై కమిషన్‌కు నివేదిక..

కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్‌ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై క్యాబినెట్‌ చర్చించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కమిషన్‌కు చెప్పాల్సిన పూర్తి విషయాలను ఆధారాలతో ప్రభుత్వం తరఫున ఈ నెల 30లోపు నివేదిక అందజేస్తామన్నారు. గత ప్రభుత్వంలో కాళేశ్వరంపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు ఉద్దేశం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిందా? లేక ఇతర విషయాలు ఏమైనా ఉన్నాయా? అనుమతులకు సంబంధించిన పూర్తి వివరాలు, క్యాబినెట్‌ సబ్‌ కమిటీలో చర్చించిన అంశాలు, గతంలో రిటైర్డ్‌ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, ప్రాజెక్టు కట్టాల్సిన చోటు, కట్టిన చోటు, సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక, ఆ సమయంలో క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేశారా, లేదా అనే పూర్తి వివరాలను ప్రభుత్వ పక్షాన కమిషన్‌కు లిఖితపూర్వకంగా అందించాలని మంత్రిమండలి తీర్మానించినట్లు వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సీనియర్‌ అధికారులకు ఈ బాధ్యతను అప్పగించామన్నారు. ఇక ఈ వానాకాలం పంటలకు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతులకు రికార్డు వేగంతో విజయవంతంగా అందించిందని తెలిపారు. ఈ శుభ సందర్భాన్ని మంగళవారం రైతుల సమక్షంలోనే ఉత్సవంగా జరుపుకోవాలని క్యాబినెట్‌ నిర్ణయించిందని చెప్పారు.


ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం..

రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, సోనియగాంధీ పుట్టినరోజైన డిసెంబరు 9వ తేదీలోపు అన్ని జిల్లాల్లో ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించినట్లు పొంగులేటి తెలిపారు. ఇక హైదరాబాద్‌ చుట్టూ నిర్మించబోయే రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ ప్రతిపాదనలను క్యాబినెట్‌ ఆమోదించిందని చెప్పారు. ఆర్‌ అండ్‌ బీ విభాగం తయారు చేసిన మూడు ప్రతిపాదనలను ఈ సందర్భంగా క్యాబినెట్‌ పరిశీలించిందని, చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవు ఉండే అలైన్‌మెంట్‌కు తుది ఆమోదం తెలిపిందని వెల్లడించారు. దీంతోపాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక ప్రతినెలా రెండుసార్లు మంత్రివర్గం సమావేశం ఉంటుందని, అందులో తీసుకున్న నిర్ణయాలను ప్రతి మూడునెలలకోసారి సమీక్షించాలని తీర్మానించామని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారంలను మునిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ రెండు మునిసిపాలిటీల్లోని పోస్టులతోపాటు మొత్తం 316 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిందన్నారు.


ఒలింపిక్స్‌ లక్ష్యంగా నూతన క్రీడా విధానం..

2036 ఒలింపిక్స్‌ క్రీడలే లక్ష్యంగా రాష్ట్రం నుంచి క్రీడాకారులను తయారు చేసేలా నూతన క్రీడా విధానానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 8 నుంచి 10 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారిని గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా స్థాయి వరకు గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. నూతన క్రీడా విధానం అమల్లోకి తెచ్చే సమయంలో తాను మంత్రిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ క్రీడా హబ్‌ ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు, పారితోషికాలు కేటాయిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనూ పది శాతం నిధులు క్రీడల అభివృద్ధికే కేటాయిస్తామని చెప్పారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించేందుకు కోచ్‌ల నియామకం, క్రీడా కోటాలో రిజర్వేషన్లు పెంచేందుకు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు.


ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రూట్‌మ్యాప్‌

తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌పాలసీ డాక్యుమెంట్‌ రూపొందించేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. 2035 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికశక్తిగా ఎదిగేందుకు అవసరమైన ఆర్థిక ప్రణాళికల అమలుపై క్యాబినెట్‌లో చర్చించామన్నారు. డిసెంబరు 9 నుంచి ఈ ఆర్థిక ప్రణాళికలను అమలు చేస్తామన్నారు. అన్ని విభాగాల భాగస్వామ్యంతో ఆర్థిక రంగ నిపుణులతో సలహా మండలి ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరిశ్రమలు, పర్యాటక రంగంతోపాటు అభివృద్ధికి అవకాశం ఉన్న అన్ని రంగాలపై ప్రత్యేక దృష్టిసారించే ప్రణాళికలను వన్‌ ట్రిలియన్‌ ఎకానమీ లక్ష్యంగా రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. బాసర ట్రిపుల్‌ ఐటీకి అనుబంధంగా మహబూబ్‌నగర్‌లో బాసర ట్రిపుల్‌ ఐటీని ఏర్పాటు చేసి రాబోయే మూడేళ్లలో మరో 1080 సీట్లు పెంచేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం వెల్లడించారు. గ్రామీణ ప్రాంతమైన హుస్నాబాద్‌ శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌కు సంబంధించి నాలుగు కోర్సుల్లో 240 మందికి కొత్తగా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. దీంతోపాటు శాతవాహన లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీలో 60 సీట్లు, ఎల్‌ఎల్‌ఎంలో 60 సీట్ల చొప్పున అదనపు ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత నోరి దత్తాత్రేయుడిని క్యాన్సర్‌ నివారణ చర్యలపై సలహాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సలహాదారుగా నియమించిందని తెలిపారు. క్యాన్సర్‌ రోగులకు మరిన్ని సేవలు అందేలా క్యాన్సర్‌ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు.


ఇవి కూడా చదవండి..

అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి

For National News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 05:19 AM