Share News

Rythu Bharosa: రెండెకరాల వరకు రైతు భరోసా విడుదల

ABN , Publish Date - Jun 17 , 2025 | 03:40 AM

వానాకాలం రైతు భరోసా నగదు బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుట్టింది. ఒకే రోజు రెండెకరాల వరకు ఉన్న రైతులకు నిధులు విడుదల చేశారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున.. తొలుత ఎకరా వరకు ఉన్న రైతులకు..

Rythu Bharosa: రెండెకరాల వరకు రైతు భరోసా విడుదల

  • ఒకేరోజు రూ.2,350 కోట్ల నగదు బదిలీ

  • 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ

  • కొత్త రైతుల నమోదుకు 20 వరకు గడువు

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): వానాకాలం రైతు భరోసా నగదు బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుట్టింది. ఒకే రోజు రెండెకరాల వరకు ఉన్న రైతులకు నిధులు విడుదల చేశారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున.. తొలుత ఎకరా వరకు ఉన్న రైతులకు.. ఆ తర్వాత రెండు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలకు నగదు జమ చేశారు. మొత్తం రెండెకరాల లోపున్న 41.25 లక్షల మంది రైతులకు సంబంధించిన 39.16 లక్షల ఎకరాలకు రూ.2,349.84 కోట్ల రూపాయలను బదిలీ చేశారు. మంగళవారం మూడెకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా వేయనున్నారు. మొత్తం ప్రక్రియను కేవలం వారం రోజుల వ్యవధిలోనే పూర్తి చేయటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో రైతుబంధు వేయటానికి ఎకరానికి ఒక రోజు చొప్పున.. పది రోజుల నుంచి పక్షం రోజుల వరకు నగదు బదిలీ చేసిన సందర్భాలున్నట్లు రాష్ట్ర మంత్రివర్గంలో చర్చకు వచ్చింది. ఈక్రమంలో నిధులు సమకూర్చుకొని కేవలం వారం రోజుల్లోపు ప్రక్రియ పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈమేరకు నిధుల సమీకరణ చేపట్టారు. ఇటీవల రిజర్వు బ్యాంకు నుంచి రూ.3 వేల కోట్లను ప్రభుత్వం అప్పు తీసుకుంది. తర్వాత మరో రూ.4 వేల కోట్లకు ఇండెంట్‌ పెట్టింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున పంపిణీ చేయటానికి... కోటిన్నర ఎకరాలకు రూ.9 వేల కోట్లు అవసరమవుతున్నాయి. ఇప్పటికే రూ.7 వేల కోట్లను ప్రభుత్వం సర్దుబాటు చేసుకుంది. మరో రూ. 2 వేల కోట్లను కూడా జమ చేసి వారం రోజుల్లోపే.. రైతుభరోసా నగదు బదిలీని పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. మరోవైపు.. క్రయవిక్రయాలు, మ్యుటేషన్‌తో యాజమాన్య హక్కులు పొందిన కొత్త రైతులను రైతు భరోసా పథకంలో చేర్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల ఐదో తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు వచ్చిన రైతులను చేర్చాలని, ఈ నెల 20వతేదీ లోపు నమోదు పూర్తి చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టరేట్‌ నుంచి ఆదేశాలు జారీ చేశారు.


ఒకే వేదికపై రాష్ట్ర మంత్రివర్గం..

రైతుభరోసా పథకం అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం... సోమవారం నగదు బదిలీ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. సాధారణంగా ఒక పథకాన్ని ప్రారంభిస్తే.. ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి, కొందరు మంత్రులు హాజరవుతుంటారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించినప్పుడు మాత్రమే వందకు వంద శాతం మంత్రులు హాజరయ్యే సందర్భాలు చూస్తుంటాం.. కానీ రాజేంద్రనగర్‌లోని.. రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభోత్సవం, రైతులతో ముఖాముఖి, రైతు భరోసా నగదు బదిలీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా రాష్ట్ర మంత్రివర్గమంతా ఒకే వేదికపై కొలువుదీరింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసిన లబ్ధిని, చేయబోయే ప్రయోజనాలను, సంక్షేమ పథకాలను కార్యక్రమంలో వివరించింది.


ఈ వార్తలు కూడా చదవండి

గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 03:40 AM