Telangana Assembly Winter Session Begins: నీళ్లతో నిప్పులు!
ABN , Publish Date - Dec 29 , 2025 | 02:16 AM
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో సాగునీళ్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది...
నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. సాగునీటి ప్రాజెక్టులపైనే చర్చ!
పాలమూరు-రంగారెడ్డిపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ గరంగరం
కేసీఆర్ సభకు వస్తే సాగునీటిపై చర్చకు సిద్ధమన్న సీఎం
తామూ చర్చకు సిద్ధంగానే ఉన్నామన్న కేటీఆర్, హరీశ్
సభను హుందాగా న డుపుతాం: మంత్రి శ్రీధర్‌బాబు
సర్కార్ వైఫల్యాల్ని ఎండగడతాం: బీజేపీఎల్పీ నేత ఏలేటి
నేటి సభలో మొదట డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
పలు బిల్లులను సభ ముందుంచనున్న ప్రభుత్వం
ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపాలు
ఆపై జనవరి 2కు వాయిదా.. అనంతరం బీఏసీ భేటీ
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో సాగునీళ్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై కొద్దిరోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు తదితర అంశాలపై సభలో కూడా చర్చ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని వివరాలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై సభలో ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత పదేళ్లలో చేపట్టిన కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికోసం చేసిన ఖర్చు, తద్వారా ఎంత ఆయకట్టుకు నీళ్లు అందాయన్న వివరాలతో పాటు కృష్ణా, గోదావరి జలాల్లో ఏపీ, తెలంగాణకు కేటాయింపులు, అందుకు సంబంఽధించిన ఒప్పందాలు సభలో చర్చకు రానున్నట్లు సమాచారం. ఒకరోజు మొత్తం ఈ అంశంపై చర్చకే కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ చాలాకాలం తర్వాత సభకు వచ్చే అవకాశం ఉండటంతో సాగునీటి అంశాన్ని లోతుగా చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ‘అధికార పార్టీ తోలు తీస్తాం. సాగునీటి విషయంలో నిజాలు నిగ్గు తేలుస్తాం’ అంటూ బచావత్ ట్రిబ్యునల్ అంశాన్ని లేవనెత్తారు. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నీళ్ల కేటాయింపులపై అన్ని విషయాలు చర్చిద్దామని సవాల్ విసిరారు. దీంతో సమావేశాల్లో కూడా వాడివేడి చర్చ తప్పదని భావిస్తున్నారు.
డిప్యూటీ స్పీకర్ ఎన్నికతో మొదలు..
సోమవారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే మొదట డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఆ వెంటనే పలు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఇటీవల ప్రభుత్వం జారీచేసిన పలు ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లును సభ ముందు ఉంచనున్నారు. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (అమెండ్ మెంట్) బిల్లు-2025తోపాటు తెలంగాణ మునిసిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చట్ట సవరణకు సంబంధించిన రెండు బిల్లులను సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెడతారు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ సమగ్ర శిక్ష (టీఎ్‌సఎస్) ఆడిట్ రిపోర్టుతోపాటు అదే కాలానికి సంబంధించి పీఎంశ్రీ ఆడిట్ రిపోర్టును కూడా సీఎం సభ ముందు ఉంచుతారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్, వేతన నిబంధనలకు సంబంఽధించిన రెండు బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుతోపాటు ఎంపీపీ, జడ్‌పీపీలకు సంబంధించి ఇటీవల ప్రచురించిన గెజిట్‌ను ఆ శాఖ మంత్రి సీతక్క సభ ముందు ఉంచుతారు. తెలంగాణ హార్టికల్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌కు సంబంధించిన 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల ఆడిట్ నివేదికలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సభకు సమర్పిస్తారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు అసెంబ్లీ, మండలిలో సంతాపం ప్రకటిస్తారు. అనంతరం జీరో అవర్ చేపడుతారు. ఆ తర్వాత సభలను వచ్చే ఏడాది జనవరి 2వ తేదీకి వాయిదా వేస్తారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. సభలను ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశాన్ని ఈ సమావేశంలో ఖరారు చేస్తారు.
సభను హుందాగా నడుపుతాం: శ్రీధర్‌బాబు
శాసనసభ శీతాకాల సమావేశాలను హుందాగా నడుపుతామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెద్దాయన సభకు వస్తే ఆయన గౌరవానికి ఎక్కడా భంగం కలిగించబోమని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్ అనుభవం అవసరమని.. సలహాలు, సూచన లు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు.
చర్చకు మేం సిద్ధం: కేటీఆర్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సహా సాగునీటి అంశంపై సభలో చర్చకు బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పాలమూరును సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ వలసల జిల్లాగా మార్చారని ఆదివారం ఆయన ఆరోపించారు. పాలమూరుకు నీళ్ల కోసం పోరాటానికి కేసీఆర్ సిద్ధమని తెలిపారు. కేసీఆర్ హయాంలో పాలమూరు ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వ చ్చీరాగానే ఆ ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసిందని ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల జలాలు చాలు అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. అధికార పార్టీ వాళ్లు ఇబ్బందుల్లో పడిన ప్రతిసారీ అసెంబ్లీ నిర్వహించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఏ చర్చపెట్టినా తాము మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
సాగునీటి రంగం అస్తవ్యస్తం: ఏలేటి
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో సాగునీటి రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా కృష్ణా, గోదావరి బేసిన్లపై అసెంబ్లీలో సమగ్ర చర్చ నిర్వహించలేదని మండిపడ్డారు. మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని.. చెరువులు, కుంటలు పాడైపోయాయని తెలిపారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శీతాకాల సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహిస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగరం పూర్తిగా ఆగమైపోయిందని.. ఉన్న నగరాన్నే సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వం, ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపుతోందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ ఎండగడుతుందని తెలిపారు.