Telangana Assembly: ఉదయం బిల్లులు, సాయంత్రం నివేదికపై చర్చ
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:53 AM
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల సవరణ బిల్లులతోపాటు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్‌ను నివేదికను ఒకే సారి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని శాసనసభ బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
పంచాయతీ, మునిసిపల్ చట్టాల సవరణ బిల్లులు సహా ఘోష్ నివేదికనూ ప్రవేశపెట్టనున్న సర్కారు
శాసనసభ బీఏసీ సమావేశంలో నిర్ణయం
వర్షాలు, యూరియాపై చర్చకు బీఆర్‌ఎస్ పట్టు
నివేదిక వచ్చాక చర్చిద్దామన్న భట్టి, శ్రీధర్‌బాబు
బీఏసీ నుంచి హరీశ్, ప్రశాంత్‌రెడ్డి వాకౌట్
హైదరాబాద్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల సవరణ బిల్లులతోపాటు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్‌ను నివేదికను ఒకే సారి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని శాసనసభ బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఉదయాన్నే బిల్లులపై చర్చ చేపట్టి ఆమోదించాక, సాయంత్రం నివేదికపై చర్చ చేపట్టనున్నారు. శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన శనివారం జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహరాల మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, బీఆర్‌ఎస్ తరఫున హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల సవరణ బిల్లులు, పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టి చర్చిద్దామని మంత్రులు ప్రతిపాదించగా.. తొలుత పంట నష్టం, యూరియా కొరతపై చర్చ చేపట్టాల్సిందేనని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి పట్టు పట్టారు. పంట నష్టం వివరాలు పూర్తి స్థాయిలో రానందున.. ముందుగా చట్ట సవరణ బిల్లులు, పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చిద్దామని మంత్రులు అన్నారు. ఈ క్రమంలో హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి నిరసన వ్యక్తం చేస్తూ... సమావేశం నుంచి వాకౌట్ చేశారు. వర్షాలు, వరదలతో పంటనష్టం, ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా 30 రకాల సమస్యలపై సభలో చర్చించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ప్రతిపాదించారు. కాగా, సమస్యలపై చర్చించేందుకు సభను కనీసం 15 రోజులు నిర్వహించాలని బీఆర్‌ఎస్, బీజేపీ కోరగా.. వరద పరిస్థితులు, గణేష్ నిమజ్జనం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆదివారం నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. కాగా, పీసీఘోష్ నివేదికపై చర్చ ఆదివారం ముగియని పక్షంలో సోమవారమూ కొనసాగించే అవకాశం ఉంది. పీసీ ఘోష్ నివేదికపై చర్చ తర్వాత సభను వాయిదా వేయాలా? లేక విరామం ఇచ్చి గణేష్ నిమజ్జనం పూర్తయ్యాక చేపట్టాలా? అనే దానిపై తర్జనభర్జన నడుస్తోంది.
నేడు సీఎం రేవంత్ సుడిగాలి ప్రయాణం
సభలో కీలకమైన పంచాయతీ, మునిసిపల్ చట్టాల సవరణ బిల్లులు, ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ జరగనున్న వేళ.. కేరళలో కేసీ వేణుగోపాల్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సి రావడంతో ఆదివారం సీఎం రేవంత్ సుడిగాలి ప్రయాణం చేయనున్నారు. ఆదివారం ఉదయం పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల సవరణ బిల్లులపై చర్చను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేరళలోని కొచ్చి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అలిప్పి చేరుకుని వేణుగోపాల్ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి హెలికాప్టర్‌లో కొచ్చికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట వస్తారు. 4గంటల కల్లా అసెంబ్లీకి చేరుకుని.. ఘోష్ కమిషన్ నివేదికపై చర్చలో పాల్గొంటారు. కాగా, ఘోష్ నివేదికపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని స్తంభింపజేసే ప్రయత్నం చేసినా, వెల్‌లోకి వచ్చి గొడవ చేసే ప్రయత్నం చేసినా వారిపై స్పీకర్ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌పై మాటల యుద్ధం..
15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..