డీఎంఈగా నరేంద్రకుమార్
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:37 AM
రాష్ట్రంలో వైద్య విద్యలో పదేళ్ల ఇన్‌చార్జుల పాలనకు తెర పడింది. ఎట్టకేలకు ప్రభుత్వం రెగ్యులర్ డీఎంఈ (వైద్య విద్య సంచాలకులు)ని నియమించింది.

తొలిసారి రెగ్యులర్ అధికారి నియామకం
పదేళ్ల ఇన్‌చార్జుల పాలనకు తెర
ఉత్తర్వులు జారీ.. కోర్టుకు కాపీ అందజేత
ఫలించిన నరేంద్రకుమార్ న్యాయపోరాటం
తొలిసారి రెగ్యులర్ నియామకం
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్య విద్యలో పదేళ్ల ఇన్‌చార్జుల పాలనకు తెర పడింది. ఎట్టకేలకు ప్రభుత్వం రెగ్యులర్ డీఎంఈ (వైద్య విద్య సంచాలకులు)ని నియమించింది. డాక్టర్ ఎ.నరేంద్రకుమార్‌ను డీఎంఈగా నియమిస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు శుక్రవారం ఉత్తర్వ్యులు జారీ చేశారు. అలాగే అకడమిక్ డీఎంఈగా డాక్టర్ శివరాంప్రసాద్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు డాక్టర్ నరేంద్రకుమార్ శుక్రవారం సాయంత్రం కోఠిలోని కార్యాలయంలో డీఎంఈగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ప్రభుత్వ వైద్యుల సంఘం అభినందనలు తెలిపింది. పూర్తిస్థాయి డీఎంఈ నియామకం పట్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నరహరి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీఎంఈ పోస్టు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోవడంతో.. అప్పటి నుంచి ఇన్‌చార్జులతోనే నెట్టుకొచ్చారు. తొలుత డాక్టర్ పి.శ్రీనివాస్, ఆ తర్వాత డాక్టర్ రమణి, అనంతరం డాక్టర్ రమేశ్‌రెడ్డిలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇన్‌చార్జి డీఎంఈలుగా నియమించింది. ఇందులో రమేశ్‌రెడ్డి ఒక్కరే ఏడేళ్లపాటు డీఎంఈగా ఉన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రమేశ్‌రెడ్డిని తప్పించి.. త్రివేణికి ఇన్‌చార్జి డీఎంఈ బాధ్యతలు అప్పగించింది. అనంతరం సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వాణికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటిదాకా ఇన్‌చార్జి డీఎంఈగా ఆమెనే కొనసాగుతూ వచ్చారు. వాస్తవానికి డీఎంఈ అయ్యే సీనియారిటీ జాబితాలో నరేంద్రకుమార్ మొదటి వరుసలో ఉన్నారు. కానీ, బీఆర్‌ఎస్ హయాంలో ఎక్కడో 50వ స్థానంలో ఉన్నవారిని తీసుకువచ్చి ఇన్‌చార్జులుగా నియమించారు. దీనిపై నరేంద్ర్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించగా.. అప్పటి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు 2023 మార్చి16న రెగ్యులర్ డీఎంఈ, అకడమిక్ డీఎంఈ పోస్టులను మంజూరు చేసినా.. రెగ్యులర్ నియామకాలు చేపట్టలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక.. కొన్ని సాంకేతిక అంశాల కారణంగా డీఎంఈ నియామకం వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 24న రెగ్యులర్ డీఎంఈ నియామకంపై వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. దీంతో సీనియారిటీ ప్రకారం పదోన్నతుల ద్వారా నియామకం చేపట్టినట్లు వైద్యశాఖ కోర్టుకు తెలిపింది. సంబంధిత జీవో కాపీని కోర్టుకు అందజేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం