Advanced Technology Centers: ఏటీసీలతో విప్లవాత్మక మార్పులు
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:46 AM
రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఐటీఐల్లో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) రాష్ట్ర అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తేనున్నాయని
ఏటా 65 ఐటీఐలలో 10 వేల మందికి శిక్షణ
1.2 లక్షల మందికి 3, 6 నెలల డిప్లొమా కోర్సులు
శిక్షణ అయ్యాక విదేశీ ఉద్యోగాలకూ పంపిస్తున్నాం
‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఐటీఐల్లో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) రాష్ట్ర అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తేనున్నాయని.. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అన్నారు. గత ఐదు దశాబ్దాలతో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయిందని.. అన్ని రంగాల్లోనూ మార్పులు వచ్చాయని.. ఇప్పుడున్న పారిశ్రామిక అవసరాలకు తగ్గ పరిజ్ఞానాలను యువతకు నేర్పితేనే వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఆ లక్ష్యంతోనే ఐటీఐల్లో ఏటీసీల ప్రారంభించినట్టు వెల్లడించారు. ‘‘ఇవి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనతో రూపుదిద్దుకున్నాయి.’’ అని దానకిశోర్ వివరించారు. ఏటీసీలతో పాటు ఐటీఐల ద్వారా అందించే నైపుణ్య శిక్షణ గురించి ఆయన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. అందులో కొన్ని ముఖ్యాంశాలు..
ఏటీసీల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 200 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనిని 2035 నాటికి ట్రిలియన్ డాలర్లకు పెంచాలన్నది సీఎం ఆలోచన. ఈమేరకు అన్ని శాఖలకూ ఆయన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ఆదాయం పెరగాలంటే నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎంతో కీలకం. అందుకే స్కిల్స్ యునివర్సిటీ ఏర్పాటుచేశారు. ఐటీఐల్లోని విద్యార్థులకు ఏటీసీల ద్వారా శిక్షణ ఇస్తున్నాం. వీటిని మొత్తం మూడు విడతల్లో నెలకొల్పుతున్నాం. నిరుడు 25 ఐటీఐలలో ఏటీసీలు ప్రారంభించగా, ఈ ఏడాది 40 మొదలుపెట్టాం. వచ్చే ఏడాది మరో 46 కేంద్రాల్లో ఏర్పాటుచేయబోతున్నాం. మిగతావి మూడో విడతలో ఏర్పాటు చేస్తాం. మొత్తం 113 కేంద్రాల్లో ఏటీసీలు ఉంటాయి. జీనోమ్‌వ్యాలీలోనూ ఒక ఏటీసీ ఏర్పాటుచేయబోతున్నాం. అలాగే.. అన్ని ఐటిఐలను ఆధునీకరిస్తున్నాం. 5వేల కోట్లతో కొత్త యంత్రాలు ఏర్పాటు చేశాం. అన్ని ప్రభుత్వ ఐటీఐలలో సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటుచేస్తున్నాం.
టాటా టెక్నాలజీస్ పాత్ర ఏమిటి.?
నైపుణ్య శిక్షణపై ఆసక్తితో.. వారు ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. ఇప్పుడు వారు ఒక్కో కేంద్రంలో ఆరు రకాల ట్రేడ్‌లలో దాదాపు రూ.35 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, సామాగ్రిని ఏర్పాటుచేస్తున్నారు. యంత్రాల ఏర్పాటుకు అవసరమైన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. శిక్షకులను ఏర్పాటుచేస్తోంది.
కోర్సు పూర్తయ్యాక ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి కోర్సులకు ఐటీఐల్లో మంచి డిమాండ్ ఉంది. ఇది పూర్తయినవారికి ఉద్యోగాలు సిద్ధంగా ఉంటున్నాయి. ఇటీవలే ఏడాది కోర్సు పూర్తిచేసుకున్న మల్లెపల్లి ఐటీఐ విద్యార్థుల్లో 80ు మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే ఏటీసీల శిక్షణతో 52 మంది.. నెలకు రూ.లక్ష దాకా సంపాదిస్తున్నారు. సొంత వ్యాపారాలు విజయవంతంగా నిర్వహిస్తున్నవారూ ఉన్నారు.
ప్రవేశం ఎలా?
పదోతరగతి అర్హతతో 22 సంవత్సరాల్లోపున్న వారు ఎవరైనా ఇందులో చేరవచ్చు. నిరుడు 98ు సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 25శాతం ప్రవేశాలు పూర్తయాయి. ప్రవేశాలకు ఇంకా 20 రోజుల గడువు ఉంది.
యువతకు మీరిచ్చే సందేశం..
రాష్ట్రంలో విస్తృతంగా అవకాశాలున్నాయి. ద్వితీయశ్రేణి నగరాల్లోనూ అనేక కంపెనీలు వస్తున్నాయి. అలాగే.. ఐటీఐ కోర్సు పూర్తిచేసుకున్నవారిని జర్మనీ, జపాన్, అమెరికా లాంటి దేశాలకు పంపిస్తున్నాం. ప్రభుత్వం ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నప్పుడు వాటిని వినియోగించుకోకపోతే అది యువతకే కాదు రాష్ట్రానికీ తీరని నష్టం. కాబట్టి.. అందుబాటులో ఉన్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి.
ఏటీసీల ఏర్పాటుతో ఐటీఐలకు ఏమైనా నష్టం జరుగుతుందా?
అలాంటి అవకాశమే లేదు. ఉదాహరణకు ఐటీఐలలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కోర్సు ఉంది. విద్యుత్ ఉన్నంతవరకూ దానికి డిమాండ్ ఉంటుంది. అలాగే 31 ట్రేడ్‌లు ఐటీఐలలో ఉన్నాయి. డిమాండ్‌ను బట్టి సీట్ల పెంపు, తగ్గింపు ఉంటుంది. కాలానుగుణంగా కోత్త కోర్సులనూ ప్రారంభిస్తున్నాం. ఐటిఐలు మరుగునపడిపోయే అవకాశమే ఉండదు. ప్రస్తుతం 65 ఏటీసీ సెంటర్లలో 10వేల మందికి శిక్షణ అందిస్తున్నాం. ఏటీసీలతో ప్రభుత్వ ఐటీఐలలో కొత్తగా రోబోటిక్స్ లాంటి అనేక కొత్త యంత్రాలు వచ్చాయి. ఇలాంటివి ఇప్పుడున్న ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ లేవు. ఇందులో శిక్షణ పొందితే మన యువతకు ఉపాధి అవకాశాలు చాలా పెరుగుతాయి. పదోతరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులకు ఏటీసీల్లో శిక్షణ ఇస్తున్నాం. మహిళలనూ ప్రోత్సహిస్తున్నాం. ఏటీసీల్లో ఏడాది వ్యవధిగల కోర్సులు మూడు, రెండేళ్ల వ్యవధిగల కోర్సులు మూడు ఉన్నాయి. వీటిలో ఏటా 10వేల మందిని తీసుకుంటున్నాం. ఇందులో ప్రవేశాలకు ఆగస్టు 25వరకు అవకాశం ఉంది. అలాగే నెల, 3, 6 నెలల వ్యవధిగల 23 స్వల్పకాలిక కోర్సులను అందించబోతున్నాం. వాటిలో ఏటా 1.2 లక్షల మందికి శిక్షణ ఇవ్వబోతున్నాం. కోర్సు పూర్తయిన తర్వాత ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇస్తుంది. అలాగే టి-గేట్ అనే కార్యక్రమంలో భాగంగా ఐటీఐల విద్యార్థులకు పారిశ్రామిక నిపుణులతో శిక్షణ కూడా ఇప్పిస్తున్నాం.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
Read latest Telangana News And Telugu News