Education Protest: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:19 AM
ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించి, రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయత నిలుపుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వంలో సమస్యలన్నీ...
20 నెలలుగా ఉపాధ్యాయుల ఎదురుచూపు
రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయత నిలుపుకోవాలి
పాత పెన్షన్ విధానం, ఏకీకృత రూల్స్ తేవాలి
యూఎ్‌సపీసీ మహాధర్నాలో వక్తల డిమాండ్
హైదరాబాద్/కవాడిగూడ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించి, రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయత నిలుపుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఉపాధ్యాయులు అశించారని, వినతిపత్రాలు ఇస్తూ 20 నెలలుగా ఓపికతో ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మ్యానిఫెస్టో హామీలూ అమలు చేయడం లేదన్నారు. గత ప్రభుత్వం విద్యా రంగ సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపినా సహించలేక సంఘ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేసిందని ఆరోపించారు. శనివారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎ్‌సపీసీ) ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. విద్యా శాఖలో ఎన్జీవోల జోక్యాన్ని నివారించాలని, కొత్త జిల్లాలకు డీఈవో, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈవో, కొత్త మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని, పీఆర్‌సీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఐక్య పోరాటాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ధర్నాలో యూఎ్‌సపీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, సీహెచ్ అనిల్ కుమార్, ఎం సోమయ్య ఏ వెంకట్, ఎన్ తిరుపతి, టీ లింగారెడ్డి, కొమ్ము రమేష్, ఎస్ హరికిషన్, జాడి రాజన్న, బీ కొండయ్య, వై విజయకుమార్, జాదవ్ వెంకట్రావు, మేడి చరణ్‌దాస్, దూడ రాజనర్సు బాబు మాట్లాడారు. భాగస్వామ్య సంఘాల నాయకులు, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సహా ఐదువేల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీలు ప్రొ. నాగేశ్వర్, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రొ.లక్ష్మీనారాయణ, అరుణోదయ విమలక్క, పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షులు ఎల్ అరుణమ్మ తదితరులు ధర్నాకు సంఘీభావం తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News