Share News

Peddapalli: కీచక టీచర్‌కు 17 ఏళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Jun 27 , 2025 | 03:11 AM

పదో తరగతి విద్యార్థినిని లోబర్చుకుని శారీరక వాంఛ తీర్చుకోవడమే కాక.. తన దుశ్చర్యను వీడియోలు తీసి వాటితో ఆమెను ఏళ్ల తరబడి వేధించి..

Peddapalli: కీచక టీచర్‌కు 17 ఏళ్ల జైలు శిక్ష

  • పోక్సో కేసులో పెద్దపల్లి జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పు

  • పదో తరగతి చదివే సమయంలో విద్యార్థినిపై

  • ఉపాధ్యాయుడు సాతూరి మధుకర్‌ అత్యాచారం

  • ఆమె డిగ్రీ చదివే వరకు కొనసాగిన ఆగడాలు

  • లైంగిక దాడి వీడియోలు తీసి యువతికి బెదిరింపులు

  • ఆమెకు వివాహమైన తర్వాత కూడా ఆగని వేధింపులు

  • వీడియోలు యువతి భర్తకు పంపడంతో విడాకులు

కాల్వశ్రీరాంపూర్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థినిని లోబర్చుకుని శారీరక వాంఛ తీర్చుకోవడమే కాక.. తన దుశ్చర్యను వీడియోలు తీసి వాటితో ఆమెను ఏళ్ల తరబడి వేధించి..ఆమె వివాహ జీవితం ముక్కలవ్వడానికి కారణమైన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని ఒక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన సాతూరి మధుకర్‌ (52)కు పోక్సో కేసులో న్యాయస్థానం 17 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దాంతో పాటు రూ.1.50 లక్షల జరిమానా విధిస్తూ పెద్దపల్లి జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు స్పెషల్‌ జడ్జి సునీత గురువారం తీర్పునిచ్చారు. 2017 నాటి ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రస్తుత ఎస్సై వెంకటేశ్‌ వివరించారు. జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 2013లో పదో తరగతి చదువుతున్న బాలికతో అదే పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేసిన హన్మకొండకు చెందిన మధుకర్‌ అసభ్యంగా ప్రవర్తించేవాడు. రాత్రి వేళ బాలికను పాఠశాలకు పిలిపించుకుని ఆమెను లోబర్చుకుని పలుమార్లు లైంగిక దాడి చేశాడు.


ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ తల్లిదండ్రులను చంపేస్తానని బాధితురాలిని బెదిరించేవాడు. అనంతరం బాధిత యువతి డిగ్రీ చదువుతున్న సమయంలో.. హన్మకొండలోని తన స్నేహితుడి గదికి పిలిపించుకొని శారీరకంగా వాడుకున్నాడు. ఆ సమయంలో వీడియోలు తీసిన మధుకర్‌.. తాను పిలిచినప్పుడల్లా రావాలని ఆమెను బెదిరించాడు. అయితే, 2017లో ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకున్నా సరే.. మధుకర్‌ వేధింపులు ఆపలేదు. తనకు వివాహమైందని, వదిలేయమని కోరినా కనికరించలేదు. తన మాట వినడం లేదని యువతి భర్త ఫోన్‌కు అసభ్యకర వీడియోలు పంపాడు. వాటిని చూసిన భర్త.. ఆమెకు విడాకులు ఇచ్చాడు. దీంతో మధుకర్‌ వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు.. కాల్వశ్రీరాంపూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై షేక్‌జానీపాషా కేసు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ సింధూశర్మ విచారణ చేసి నేరస్తుడు సాతూరి మఽధుకర్‌ను రిమాండ్‌కు తరలించారు. నేరం నిరూపితం అవ్వడంతో పెద్దపల్లి కోర్టు మధుకర్‌కు శిక్ష విధించింది.


ఇవి కూడా చదవండి:

ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..

జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

For More AP News and Telugu News

Updated Date - Jun 27 , 2025 | 03:11 AM