Teacher Misconduct: హాస్టల్లో విషప్రయోగం
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:26 AM
తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్‌లో ఉండే విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు..
విద్యార్థులు తాగే నీటిలో గడ్డి మందు కలిపిన ఉపాధ్యాయుడు
తనతో పడని ఓ అధికారిని ఇరికించే కుట్ర
విధుల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు, వంట కార్మికురాలి తొలగింపు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఘటన
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్‌లో ఉండే విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు.. కర్కోటకుడిగా మారాడు. తనతో విభేదాలు నెలకొన్న ప్రత్యేకాధికారిని ఇరికించేందుకు విద్యార్థుల ప్రాణాలు తీయాలని చూశాడు. హాస్టల్‌లో విద్యార్థులు వినియోగించే నీళ్లలో విషం కలిపాడు. దీంతో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంఽధీనగర్‌లో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకోగా.. శనివారం విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న 30 మంది విద్యార్థులు ఈ స్కూల్‌లో ఉన్నారు. శుక్రవారం ఉదయం అల్పాహారం చేసిన తర్వాత 11 మంది విదార్థులు నీటిని తాగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. విద్యార్థులు తాగే నీటిలో పాఠశాలలో విధులు నిర్వర్తించే ఓ ఉపాధ్యాయుడే గడ్డిమందు కలిపినట్టు తేలింది. మందు కలిపిన సీసా కూడా తమ గదిలో దొరికినట్టు విద్యార్థులు తెలిపారు. ఈ ఘటనకు ఓ ఉపాధ్యాయుడు, ప్రత్యేక అధికారి మధ్య ఉన్న గొడవే కారణమని విద్యార్థులు అంటున్నారు. ప్రత్యేక అధికారిని ఇరికించేందుకు ఆ ఉపాధ్యాయుడు నీళ్లల్లో గడ్డి మందు కలిపాడని ఆరోపిస్తున్నారు. గడ్డి మందు నీళ్లలో కలిపిన ఆ ఉపాధ్యాయుడు తమ దుప్పట్లపై కూడా దానిని చల్లి ఆ నెపాన్ని తమపై నెట్టేసే ప్రయత్నం చేశాడని చెబుతున్నారు. శనివారం ఉదయం హాస్టల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, డీఎస్పీ సంపత్‌రావుకు ఈ విషయాలను విద్యార్థులు వెల్లడించారు. పాఠశాలలో పనిచేస్తున్న ఎస్‌వో, మరో ముగ్గురు ఉపాధ్యాయులకు తరచుగా గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ముగ్గురు ఉపాధ్యాయులు తరచూ తమను తరచూ వేధిస్తున్నారని చెప్పారు.
విధుల నుంచి నలుగురి తొలగింపు..
కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే హాస్టల్‌కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి దీనికి కారణమైన ఉపాధ్యాయుడు రాజేందర్‌తోపాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు వేణు, సూర్యకిరణ్, వంట కార్మికురాలు రాజేశ్వరిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొంటూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News