Share News

BC Girls Gurukula: గురుకుల హాస్టల్‌పై నుంచి దూకి విద్యార్థిని మృతి

ABN , Publish Date - Jul 15 , 2025 | 04:57 AM

గురుకులంలో ఉండడం ఇష్టం లేని ఓ విద్యార్థిని.. వసతి గృహంపై నుంచి దూకి పారిపోయేందుకు యత్నించి ప్రాణాలు కోల్పోయింది..! ఆదివారం రాత్రి సమయంలో ఆమె దూకడంతో తెల్లవారే వరకు ఎవరూ గమనించలేదు.

BC Girls Gurukula: గురుకుల హాస్టల్‌పై నుంచి దూకి విద్యార్థిని మృతి

  • పారిపోయే ప్రయత్నంలో ప్రమాదం?

  • యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్‌పేట బీసీ గురుకులంలో ఘటన

  • ఎస్‌ఎఫ్‌‌ఐ, బీజేవైఎం నిరసనలు

  • విద్యార్థిని కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించేందుకు స్కూల్‌ అధికారుల హామీ

చౌటుప్పల్‌ రూరల్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): గురుకులంలో ఉండడం ఇష్టం లేని ఓ విద్యార్థిని.. వసతి గృహంపై నుంచి దూకి పారిపోయేందుకు యత్నించి ప్రాణాలు కోల్పోయింది..! ఆదివారం రాత్రి సమయంలో ఆమె దూకడంతో తెల్లవారే వరకు ఎవరూ గమనించలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం విఠలాపురం గ్రామానికి చెందిన ఊరబావి పరుశరాములు జయమ్మ దంపతుల మూడో కుమార్తె సంధ్య (11). గురుకుల ప్రవేశ పరీక్షలో ఎంపికైన ఆమెకు తూప్రాన్‌పేటలోని జ్యోతీరావుఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో సీటు వచ్చింది. గత నెల 21వ తేదీన గురుకులంలో చేరగా, సిక్‌ లీవ్‌లు రావడంతో ఈ నెల 5న సంధ్యను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. సెలవులు ముగియడంతో ఆదివారం మళ్లీ గురుకులానికి తీసుకువచ్చారు. అయితే అప్పటి నుంచి ముభావంగానే ఉన్న సంధ్య.. రాత్రి తోటి స్నేహితులతో భోజనం చేసి నిద్రించింది. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున వాచ్‌మన్‌ గదులను తనిఖీ చేస్తుండగా సంధ్య కనిపించకపోవడంతో.. భవనం వెనుక వైపు పరిశీలించగా రక్తమడుగులో శవమై కనిపించింది.


పక్కన ప్లేట్లు, దుస్తులతో కూడిన బ్యాగ్‌ ఉంది. దీంతో వాచ్‌మన్‌ ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించగా హుటాహుటిన చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ మధుసూదన్‌ రెడ్డి, సీఐ మన్మథకుమార్‌, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి.. ఇతర గురుకుల అధికారులు పరిశీలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మధ్యాహ్న సమయంలో అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇటు ఎస్‌ఎ్‌ఫఐ, బీజేవైఎం నాయకులు గురుకులం ఎదుట ఆందోళన నిర్వహించారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బైఠాయించారు. సాయంత్రం వరకు అధికారులతో చర్చలు జరిపారు. విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లిస్తామని పాఠశాల అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అంత్యక్రియల నిమిత్తం తల్లిదండ్రులకు రూ.20 వేలు అందజేశారు. కూతురి మృతిపై సమగ్ర విచారణ జరపాలని తండ్రి పరుశరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '

తిరుపతి రైల్వే‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 04:57 AM