Share News

Land Survey: భూముల రీ సర్వే పూర్తి

ABN , Publish Date - Jul 11 , 2025 | 06:11 AM

పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ భూముల రీసర్వేను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది.

Land Survey: భూముల రీ సర్వే పూర్తి

కేంద్ర మార్గదర్శకాల మేరకు నిర్వహణ.. పైలట్‌ ప్రాజెక్టు కింద 5 గ్రామాల్లో సర్వే

  • నక్ష పటాలను సిద్ధం చేసిన అధికారులు

  • ఆమోదం కోసం ఉన్నతాధికారులకు నివేదిక

జగిత్యాల, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ భూముల రీసర్వేను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్‌ మోడ్రనైజేషన్‌ ప్రోగ్రామ్‌ (డీఐఎల్‌ఆర్‌ఎంపీ) మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రోన్లు వినియోగిస్తూ.. ప్యూర్‌ గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పద్ధతిలో ఆయా గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఇందులో జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలోని కోమన్‌పల్లి, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ములుగుమడ, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలంలోని సాహెబ్‌నగర్‌, ములుగు జిల్లా వెంకటాపూరం మండలంలోని నూగూరు, మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడు మండలంలోని సలార్‌నగర్‌ ఉన్నాయి. నక్ష పటాలు లేని ఆయా గ్రామాల్లో ప్రత్యేక బృందాలతో రీ సర్వే జరిపారు. ఇందుకోసం మూడు ఏజెన్సీలను ఎంపిక చేయగా, జగిత్యాల జిల్లాలో మార్వెల్‌ జియో ఫేషియల్‌ సొల్యూషన్స్‌ ఏజెన్సీ సహకారంతో సర్వే, ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖ సర్వే నిర్వహించింది. వాస్తవానికి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన రైతులకు 1983-84లో బీర్‌పూర్‌ మండలం కోమన్‌పల్లి శివారులో అప్పటి ప్రభుత్వం పునరావాసం కల్పించింది. ప్రభుత్వ భూములను అందించి వాటిని వ్యవసాయానికి ఆమోదయోగ్యంగా మార్చింది.


బాధితులందరికీ భూములపై హక్కులు కల్పిస్తూ డీ-1 పట్టాలు ఇచ్చింది. అయితే, కోమన్‌పల్లికి చెందిన భూములకు నక్ష పటం రూపొందించలేదు. దీంతో తరచూ భూ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పైలట్‌ ప్రాజెక్టు కింద కోమన్‌పల్లిని ఎంపిక చేశారు. తొలుత గ్రామంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రైతులకు రీ సర్వే జరిగే పద్ధతిని వివరించారు. ప్యూర్‌ గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పద్ధతి ద్వారా సర్వే నిర్వహించి సరిహద్దులు గుర్తించారు. సర్వే ద్వారా నక్ష మ్యాప్‌ను తయారు చేశారు. ఇదే విధంగా మిగతా గ్రామాల్లోనూ ఏ సర్వే నంబరులో ఎంత భూమి ఉంది? ఏ సర్వే నంబరు ఎక్కడ ఉంది? గ్రామ భూములతో పాటు, గ్రామ కంఠంలో ఎన్ని ఎకరాల భూములున్నాయి? అసైన్డ్‌ భూములు ఎన్ని? అనే లెక్క తేల్చారు. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లకు అధికారులు బై నంబర్లు ఇచ్చారు. రికార్డుల్లో ఉన్న భూమికి, క్షేత్ర స్థాయిలో ఉన్న భూమికి తేడాలను గుర్తించారు. సంబంధిత రికార్డులను ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించారు. అక్కడ ఆమోదం పొందితే భూ సరిహద్దులకు సంబంధించి.. ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు. సర్వేలో ఎదురైన అనుభవాలతో రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వేకు మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.


హద్దులు నిర్ధారించి.. నక్ష రూపొందించాం

రాష్ట్రంలో భూముల రీ సర్వేకు నక్ష పటాలు లేని ఐదు గ్రామాలను పైలట్‌ ప్రాజెక్టుగా గుర్తించారు. ఇందులో భాగంగానే కోమన్‌పల్లిలో పకడ్బందీగా రీ సర్వే పూర్తి చేశాం. భూములకు సరిహద్దులను నిర్ధారించడంతోపాటు నక్ష పటాన్ని రూపొందించాం. జగిత్యాల కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశాల మేరకు కమిషనర్‌ ఆఫ్‌ సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌కు పంపించాం.

- వెంకట్‌రెడ్డి, ఏడీ, ల్యాండ్‌ అండ్‌ రికార్డ్స్‌, జగిత్యాల


ఈ వార్తలు కూడా చదవండి.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 06:11 AM