Srushti Fertility Center: నమ్రత లిస్టులో 200 మంది దంపతులు!
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:03 AM
సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. సరగసీ పేరిట ‘సృష్టి’ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.
సరగసీ కోసం ‘సృష్టి’లో భారీగా రిజిస్ట్రేషన్లు
కొనసాగుతున్న పోలీసు విచారణ.. 30కి చేరిన అరెస్టుల సంఖ్య
హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట, విశాఖపట్నం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. సరగసీ పేరిట ‘సృష్టి’ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డాక్టర్ నమ్రత సహా 26 మందిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు నమ్రతకు ఏజెంట్లుగా వ్యవహరించిన మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ఇందులో విజయ్, సరోజ, రత్న అనే ముగ్గురిని విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 30కి చేరింది. అరెస్టయిన వారిలో వైద్యులు, టెక్నిషియన్లు, ఏజెంట్లు, శిశు అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడిన దళారులు ఉన్నారు. ఈ కేసులో విశాఖలోని కేజీహెచ్‌లో పని చేస్తున్న మరో ముగ్గురు వైద్యుల పాత్రను కూడా గుర్తించిన పోలీసులు వారినీ అదుపులోకి తీసుకునే అవకాశముంది. సంతానం కోసం తన వద్దకు వచ్చే దంపతులకు సరగసీ ద్వారా సంతానం పొందాలని నమ్రత ఒప్పించేది. ఆమె మాటలను నమ్మిన దంపతుల నుంచి స్పెర్మ్, అండాలు సేకరించి వాటి ద్వారా వేరొకరి గర్భంలో బిడ్డను పెంచుతున్నామని నమ్మించేది.
వేరెవరికో పుట్టిన బిడ్డలను ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి సరగసీ ద్వారా పుట్టిన బిడ్డ అంటూ ఆ దంపతులకు ఇచ్చి లక్షల్లో డబ్బు వసూలు చేసేది. కాగా, నమ్రత మాటలు నమ్మి సరగసీ ద్వారా సంతానం పొందేందుకు తెలుగు రాష్ట్రాల్లోని సృష్టి ఫర్టిలిటీ సెంటర్లలో 200 మంది దంపతులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఆ జాబితా పోలీసుల చేతికి చిక్కినట్టు తెలిసింది. అయితే, నమ్రత బృందం వారిలో ఎంతమందికి సంతానాన్ని అందించింది? ఎంతమందికి చికిత్స కొనసాగుతోంది?అనేది తెలియాల్సి ఉంది. నమ్రత 80మంది శిశువులను విక్రయించినట్టు పోలీసులు ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారులను తీసుకున్న వారిలో సరగసీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న దంపతులు ఉన్నారా ? ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది చిన్నారులను కొనుగోలు చేశారు? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. కాగా, సరగసీ పేరిట ఒక్కో బిడ్డ ద్వారా రూ.40లక్షల దాకా పొందే నమ్రత.. అనతి కాలంలోనే రూ.25 కోట్ల మేర ఆస్తులు కూడబెట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా, ఈ కేసులో అరెస్టయిన వైజాగ్, కేజీహెచ్ ఆస్పత్రి అనస్థీషియా విభాగం వైద్యడు డాక్టర్ వాసుపల్లి రవి వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణే్‌షకు సోదరుడని తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News